
ఉదయాకాశం వెలుగుల్లో చెట్లు ఎంత అందంగా కనబడతాయో మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు వీటిని చూస్తూ ఉంటే స్పటిక నిర్మాణం గురించిన ఆలోచనలు వస్తుంటాయి.. అందుకే 'విజ్ఞానం అత్యుత్తమైన సృజనాత్మక కళారూపం' అని సివి రామన్ ఎప్పుడూ చెబుతుండేవారు. రామన్ పరిశోధనలు సైన్స్‌లో ఒక కొత్త విభాగం. అలాగే.. 'విజ్ఞానశాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు.. నిరంతర పరిశోధన.. స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి.. సామాజికంగా అమలు చేయడం.. ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి' అంటూ భారతరత్న అందుకున్న సమయంలో రామన్ చేసిన ప్రసంగం. ఇది నేటి యువతకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. ఈ నెల 28న 'జాతీయ సైన్స్ దినోత్సవం' సందర్భంగా ఈ ప్రత్యేక కథనం..
సైన్సు మనకు ఏమీ తెలియని అయోమయస్థితి నుండి, నిర్దిష్టమైన అవగాహన దిశగా, కచ్చితమైన, విశ్వసనీయమైన మార్గం గుండా తీసుకొని పోతుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశమైనా ఆర్థిక, సామాజిక, పారిశ్రమిక అభివృద్ధి అనేది ఆ దేశ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో మాత్రమే కొలమానంగా పరిగణించబడుతుంది. అందుకే నేడు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అనేది ఒక కొలమానంగా మారింది. అయితే ఈ విషయాలు ఇప్పుడు చెప్పుకోవాల్సి వచ్చింది. అందుకు ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి, సైన్స్ పట్ల సమాజపు ఆలోచనలు, శాస్త్రీయ దృక్పథం, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు కారణం.

- ప్రత్యేకత ఇలా..
ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం. ఒక రకంగా 'ఫిబ్రవరి' నెల సైన్స్ మాసంగా చెప్పుకోవచ్చు. బ్రూనో, గెలీలియో, డార్విన్, మెండలీవ్, సివి రామన్, భట్నాగర్‌లను తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సిన నెల ఇది. సైన్స్ చరిత్రను మలుపు తిప్పిన ప్రముఖులు అనేక మంది గురించి యువతకు స్ఫూర్తిని కలిగించే చిన్న ప్రయత్నమిది. 1987, 28 ఫిబ్రవరి నుంచి 'జాతీయ విద్యా మండలి' సూచనను అనుసరించి, భారత ప్రభుత్వం 'జాతీయ సైన్స్ దినోత్సవం' గా ప్రకటించింది. సర్ సి.వి రామన్ తన 'రామన్ ఎఫెక్ట్' ఆవిష్కరించిన రోజు ఫిబ్రవరి 28. అందుకుగానూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు కలిగిన నోబెల్ పురస్కారం అందుకున్నారు రామన్.

- దేశంలో సైన్స్ నడకపై విశ్లేషణ..
దేశ ప్రజలందరూ గమనించాల్సిన మరో అంశం. నోబెల్ బహుమతి గ్రహీత, జీవ సాంకేతిక శాస్త్ర ప్రముఖుడు ప్రొఫెసర్ వెంకట్రామన్ రామకృష్ణన్ ఫిబ్రవరి 4, 2023న చెన్నరులో దేశంలో సైన్స్ అభివృద్ధిపై విద్యార్థులతో ఓ సదస్సులో చర్చించారు. 2009లో 'రైబోజోమ్' సైన్స్ ఆవిష్కరణకు నోబెల్ బహుమతి పొందారు ఈయన. బరోడాలో సైన్స్ శిక్షణ పొంది, భవిష్యత్తుకు పునాదులు వేసుకున్నారు. తరువాత వెంకట్రామన్ రామకృష్ణన్ (వెంకీ) అమెరికా యూనివర్శిటీలో, ఐరోపా పరిశోధనా సంస్థలోనూ శిక్షణ పొందారు. జీవ సాంకేతిక రంగ నిపుణుడిగా రాటుదేలాడు. దానికి మూలం ఆయా దేశాల్లో సైన్స్-సాంకేతిక రంగాల్లో పురోగతికి సమకూర్చుతున్న వనరులు, ప్రోత్సాహకాలు. బ్రిటన్ పౌరుడిగా పరిశోధనా రంగంలో నిమగమైన వెంకీ తన మాతృదేశంలో సైన్స్ పురోగతిని ప్రత్యక్షంగా చూడాలని తరచుగా భారత్‌కు వస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ నెల చెన్నరులో 'ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజమ్' విద్యార్థుల సమక్షంలో తన ఆంగ్ల గ్రంథమైన - 'జన్యుమిషన్ : రైబోజోమ్' రహస్యాల్ని ఛేదించే ప్రయాణంలో (జీన్ మెషిన్: ద రేస్ టు డెసిఫర్ సీక్రెట్స్ ఆఫ్ రైబోజోమ్స్) తమిళంలోకి అనువదించేలా వారిని ప్రోత్సహించి, యువతకు ప్రేరణ కలిగించారు. దేశంలో సైన్స్ నడకను చర్చించి, విశ్లేషించారు.

- వాడిపోతున్న సైన్స్...
మనదేశంలో ఎంతో ఉన్నతమైన ఆశయంతో నడవాల్సిన 'సైన్స్ కాంగ్రెస్' నిర్వహణ ఎంత దిగజారిపోయిందో -2016 విశ్లేషణ -'ఐఎస్‌సి, ఎ సర్కసి' మరోసారి గుర్తు చేసుకున్నాడు. అలాగే మద్రాసు విశ్వవిద్యాలయం నిర్వహించిన జి.ఎన్.రామచంద్రన్ (ప్రముఖ జీవ, భౌతిక శాస్త్రవేత్త) స్మారక ఉపన్యాసం సందర్భంగా కలిసిన అనేక యువతీ యువకులు సైన్స్ పట్ల చూపిన ఆసక్తిని మననం చేసుకున్నారు. భారతదేశం స్వపరిపాలనకు ముందు సివి రామన్, జెసి బోస్, మేఘనాథ్ సాహి, ఎస్.ఎస్.బోస్, హామీబాబా వంటి శాస్త్రజ్ఞుల్ని ప్రపంచానికి ఇవ్వగలిగింది. శాస్త్రజ్ఞానం పురోగమించేందుకు దేశం దోహదపడింది. నిజం చెప్పాలంటే సైన్సు పురోగమనం స్వతంత్ర భారతదేశంలో నెమ్మదిగానే నడిచింది. మన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో అభివృద్ధి పథంలోనే సాగింది. శాస్త్ర జ్ఞాన విస్తరణకు తగిన వనరుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. రాను రాను అది మందగించింది. డా.సి.ఎస్ ఆర్.రావు వంటి శాస్త్రవేత్తలు కొంత ప్రయత్నం చేశారు. అయినా అవి విస్తరించలేదు. కారణం నిధుల కొరత, ఆధునికతను సంతరించుకోలేని వనరులు. 2022లో బ్రిటన్ అత్యున్నత పురస్కారం-రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌ను పొందారు వెంకీ. అప్పుడు ఆయన 'మనదేశం అత్యంత వేగంగా శాస్త్ర, సాంకేతికాల ప్రగతిలో ముందుకు వెళ్తుందని నమ్మేవాళ్లం' అని చేసిన వ్యాఖ్యను మనం ఎలా తీసుకోవాలి?! 'ఒకనాడు చెన్నై, ముంబయి, కోల్‌కతా, బరోడా విశ్వవిద్యాలయాలు ఐఐటీలు, ఐఐఎస్‌సిలు సైన్స్ అభివృద్ధి నిలయాలుగా నిలిచాయి. ప్రస్తుతం ఈ సంస్థలు వనరుల లేమితో తిరోగమనంలోకి వచ్చాయని గమనించమ'ని హెచ్చరించారు. గత ఐదారు దశాబ్దాలలో విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు సంఖ్య రీత్యా పెరుగుతూ పోతున్నాయి. ప్రతి ప్రభుత్వం తాము పరిశోధన, అభివృద్ధికి తగిన నిధులు కేటాయిస్తున్నామని చెప్తూనే ఉన్నారు. కానీ ఆచరణలో వాళ్ల ప్రాధాన్యతలు మారుతున్నాయి. అందుకే మన దేశంలో 'సైన్సు పెరుగుదల'ను మొక్కతో పోల్చి అది 'వాడిపోతుందనే' సాహసం చేస్తున్నారు ప్రొఫెషర్ వెంట్రామన్ రామకృష్ణన్.

- నేటి పరిస్థితులకు కారకులెవరు?
సైన్సు ద్వారా ఒనగూరిన సాంకేతికాలన్నింటినీ నిత్యం అనుభవిస్తూనే ఉన్నాం. అది గుర్తించక సైన్సు పెరుగుదలకు దోహదపడని పాలకులా దీనికి కారణం? గతమంతా గొప్పది, ఆధునికత పూర్తిగా నష్టకరమనే సనాతన మేధావులా? పురాణాల్ని చరిత్రగా గుర్తించే పాలనా రంగ నిపుణులా? శాస్త్రీయతకు నోచుకోని ప్రతిపాదనలన్నీ సైన్స్‌లో భాగమనే మధ్యతరగతి మేధావులా? మానవ సమాజాల మూలాల్నే ప్రభావితం చేసిన చార్లెస్ డార్విన్, సత్యం కోసం ప్రాణాన్ని ఇచ్చిన బ్రూనో, మతాలిచ్చిన మూఢనమ్మకాల్ని చేధించిన గెలీలియో, న్యూటన్, ఐన్‌స్టీన్ వంటి ఎందరో చూపిన మార్గాల వెంట నడవలేకపోతున్నాం ఎందుకు? భారతదేశ మొదటిదశ పాలకుల సమయంలో ఈ ప్రశ్న వెల్లువెత్తలేదు. దేశం ఆకలి, బీదరికం, అవిద్యల నుంచి బయట పడటంతోపాటు, సాంస్కృతికంగా శాస్త్రీయ దృక్పథాన్నిచ్చే జీవన సరళిలోకి విస్తరించాలని ఆశించారు. బ్రిటిష్ ఇండియాలో భారతీయులు ప్రగతిని, అభివృద్ధిని కోరిన ఆలోచనాపరులు. అధికారులు వేసిన బీజాలను కొనసాగించాలని కోరుకున్నారు. శాస్త్రీయ దృక్పథం (సైంటిఫిక్ టెంపర్) దేశ పురోగమనానికి కేంద్రంగా ఉండాలని భావించారు. అందుకే అంబేద్కర్ వంటి మేధావుల సారథ్యంలో రూపొందిన రాజ్యాంగాన్ని 'శాస్త్రీయ దృక్పథం' తో నెలకొల్పారు. అది ప్రజల్లో విస్తరించే లక్ష్యంతో అమలు జరిపారు. ఆ నేపథ్యంలో నెహ్రూ ప్రభుత్వం శాస్త్రీయమైన ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ఒక రూపాన్నిచ్చింది. ఆ మేరకు పరిశోధనా రంగాలకు ప్రాధాన్యతనిచ్చింది. దేశ పునర్నిర్మాణంలో భాగంగా అనేక వ్యవస్థల్ని నిర్మించారు. అవే ఐఐటి, ఐఎస్‌సి, కేంద్ర పరిశోధనా సంస్థలు : ఐసిఎఆర్, ఐసిఎస్‌ఐఆర్, ఐసిఎంఆర్ లు. అభివృద్ధి చెందిన దేశాల సహకారంతో సైన్సు అభివృద్ధి దిశగా మానవ వనరులను రూపొందించారు. ప్రజల భౌతిక అవసరాలకు తోడు జ్ఞాన సమాజ నిర్మాణానికి పునాదులేయాలని ప్రయత్నించారు.
- చరిత్ర చెప్తున్న సత్యం ఇదే..
ప్రాచీన నాగరికతలు విలసిల్లిన దక్షిణాసియా, తూర్పు ఆసియా ప్రాంతాల్లోనే సైన్సు- సాంకేతికాలు ప్రథమంగా విస్తరించాయని చరిత్ర చెప్తున్న సత్యం. ముఖ్యంగా భారత ఉపఖండంలోనే గణిత, ఖగోళ శాస్త్రాలు రూపొందాయి. వృక్షాయుర్వేద వైద్య విధానాలు విలసిల్లాయి. అనేకమంది శాస్త్రవేత్తలు రూపొందారని విశ్లేషకులు క్రోడీకరించారు. ఆ క్రమంలోనే బౌద్ధయానుడు, ఆర్యభట్ట, భాస్కరాచార్య, బ్రహ్మగుప్తుడు, కణాదుడు, చరకుడు, వరాహమిహిరుడు, నాగార్జునుడు వంటివారి పాత్ర పేర్కొనబడింది. చార్వాకులు, బౌద్ధులు ప్రజల్లో నెలకొన్న అశాస్త్రీయతను సంస్కరించే ఉద్యమాలు చేసినట్లు అర్థమౌతుంది. అయితే రానురాను చారిత్రక పరిణామాలు మలుపు తిరిగాయి. భారత సమాజం మతం పరిష్వంగంలో చిక్కుకొన్నది. ఫలితంగా సైన్సు ద్వారా ఒనగూడిన వనరులు పశ్చిమాసియాకు తరలి వెళ్ళాయి. మత వలయంలో చిక్కుకొన్న పశ్చిమాసియా దేశాల ప్రజలు తమకందిన సైన్సు సాంకేతికతను చేజార్చుకొన్నారు. ఆ స్థితిలో ఐరోపా ఖండ దేశాలు సైన్సును అభివృద్ధి చేసుకున్నాయి. సాంకేతికాల వెలుగులో సముద్రయాన వనరులను సమకూర్చుకున్నాయి. రసాయనశాస్త్ర కాంతిలో నూతన యుద్ధ సామగ్రిని ఒనకూర్చుకొన్నాయి. ఇది ఆధునిక ప్రపంచ చరిత్ర చెబుతున్న విషయమే. వలస రాజ్యాలేర్పడటానికి మూలం యూరపియన్ సైన్సే.

- శాస్త్రీయ ఒరవడికి బీజాలు..
శాస్త్రీయ ఒరవడిని పోగొట్టుకుంటున్న సమయంలోనే మన సమాజాన్ని సంస్కరించాలని మధ్యాసియా, ఐరోపా నుండి వచ్చిన వలస పాలకులు అరకొర ప్రయత్నాలు చేశారు. ఆ ప్రభావంతో ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజా రాంమోహన్‌రారు వంటి సంఘసంస్కర్తలు ప్రజల్లో శాస్త్రీయతను పెంచే ప్రయత్నాలు చేశారు. ఆంధ్రదేశంలో వీర బ్రహ్మం, వేమన వంటి కొంతమంది ప్రజల్లో అవగాహన పెంచేలా ఉద్యమించారు. వీరేశలింగం, గురజాడ వంటి సాహిత్య సంఘ సంస్కర్తలు ప్రజల్లో శాస్త్రీయతను పెంచే ప్రయత్నాలు చేశారు. ఆంగ్లేయ పాలకులు విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలను రూపొందించి నాంది పలికారు. దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల విస్తరణకు తోడ్పడ్డారు.

- వ్యాపారుల చేతుల్లో సైన్స్- సాంకేతికాలు..
మతం నీడలో కునారిల్లుతున్న శాస్త్ర జ్ఞానానికి భిన్నంగా 'సైన్సు' పశ్చిమ దేశాల్లో పెరిగిందా? పెరుగుతూనే ఉందని వెంకట్రామన్ వంటి శాస్త్రవేత్తలు సూచిస్తూనే ఉన్నారు. అయితే ఆ సైన్సు సాంకేతికాలు కూడా సామాన్యులకు దూరంగా అశాస్త్రీయ ఒరవడిలో పడ్డాయని విశ్లేషకులు సూచిస్తున్నారు. పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని జీవవైవిధ్యతను పట్టించుకోలేని ఒరవడిలోకి సైన్సు విస్తరిస్తూ పోతున్నది. పేటెంట్ (గుత్త సొమ్ము) వ్యాపార ఒరవడి సైన్సును, దాని ద్వారా వొనగూడిన సాంకేతికాలు సమాజాల సమతుల్యతను చిన్నచూపు చూస్తున్నది. పాలనా రంగం పూర్తిగా సైన్సు - సాంకేతికాల వ్యాపారుల చేతుల్లో ఇరుక్కుపోయింది. శాస్త్రీయత అక్కడా లోపించిందా?!

- దేశాన్నావహించిన మత, మిత వాదం..
దేశంలో మతవిశ్వాసాలు, మూఢ నమ్మకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దాన్ని సంస్కరించేందుకే నెహ్రూ ప్రభుత్వం ప్రయత్నించింది. సైన్సు పెరుగుదలకు కృషి చేసింది. మతాల చిచ్చులోంచి ప్రజల్ని మేల్కొలిపే లక్ష్యాలకు ప్రాధాన్యతనిచ్చింది. ఇప్పుడు మత వాదం, మిత వాదం విస్తరించాయి. 'శాస్త్రీయత' ప్రజలకు దూరమైంది. నిచ్చెన మెట్ల సిద్ధాంతం కర్మ, తాత్వికతలు మతమౌఢ్యానికి, కులాల రక్కసికి ప్రజల్ని పరిమితం చేసింది. ఫలితంగా సైన్సు- సాంకేతికాలు అనుభవిస్తూనే ప్రజలు అశాస్త్రీయ ఒరవడిలో పడిపోయారు. అయితే రాసుకొన్న రాజ్యాంగానికి కనీసం కట్టుబడుండాలనే ప్రాథమిక సూత్రాల్ని పాటించనివారు అధికారంలోకి వస్తారని ఈ దేశాన్ని పరాయిపాలన నుండి విముక్తి చేసినవారు ఊహించి ఉండరు. నియంతల పాలనా వ్యవస్థ కంటే హీనంగా ప్రజాస్వామ్యం దిగజారుతుందని భావించి, ఉండరు. కార్యాకారణ సంబంధాల్ని, దేశ కాల పరిస్థితుల్ని విశ్లేషించలేని అజ్ఞానులు, అమాయకులు విధాన నిర్ణయకర్తల రూపంలో సామాన్య ప్రజల నెత్తిమీదకెక్కి వికటాట్టహాసం చేస్తారని అనుకొనుండరు.. భారత రాజ్యాంగ రూపకర్తలు. సైన్సు కాంగ్రెస్‌లను సర్కస్‌లుగా మారుస్తారని భావించి ఉండరు. సైన్సు పురోగమనం మతం నీడలో మలిగిపోతుందని ఊహించి ఉండరు. మత విద్వేషాలు రగిల్చి పాలకులే ప్రేక్షక పాత్ర వహిస్తారని, రాక్షసానందం పొందుతారని అస్సలు ఊహించి ఉండరు.

- సైన్స్ విస్తరణ ద్వారానే..
ప్రజా సైన్సు విస్తరణ ద్వారానే ఇది సాధ్యపడుతుందనే స్పృహ కలిగించడానికి కొందరు ఆలోచనాపరులు కృషి చేశారు. ప్రముఖ రసాయన శాస్త్రవేత్త జెడి బెర్నాల్డ్, జెబిఎస్ హాల్డేన్ వంటివారు చరిత్రలో సైన్సును క్రోడీకరించారు. హాల్డేన్ శాస్త్ర పరిశోధనకు మనదేశాన్నే ఎన్నుకున్నారు. అంతరిక్ష పరిశోధకుడైన కార్ల స్లాగన్ (అమెరికా శాస్త్రవేత్త) శాస్త్ర, సాంకేతికాల విస్తృత ప్రచారానికి దోహద పడ్డాడు. మన దేశంలో హెచ్. నరసింహయ్య, నీలం రాజు గంగా ప్రసాదరావు, డిడి కోశాంబి, యశ్‌పాల్, రొమిల్లాథాపర్, జయంత్ నార్లేకర్, స్వామినాథన్, సలీం ఆలీ, సిఎస్‌ఆర్ రావు, యం పి పరమేశ్వరన్, సి యం భార్గవ, మెహతా సొహ్రాబ్ జామీజ, అనీల్ సద్‌గోపాల్, అరవింద గుప్తా, సునీతా నారాయణ్, మేధాపాట్కర్, వందనాశివ, సుమన్ సహారు, నమ్మాళ్‌వార్, భాస్కర్‌సావె, వినోద్‌రైనా వంటి వారు ప్రజాసైన్సు ఉద్యమానికి అవిరళ కృషి చేసినవారే. ఆ క్రమంలోనే నరేంద్ర ధబోల్కర్, గోవింద్ పన్సారె, కల్బుర్గి, లంకేశ్ వంటి వారు శాస్త్రీయ సమాజ ఉద్యమంలో అసువులు బాసారు. ఈ సైన్సు డే (ఫిబ్రవరి 28) వాళ్లందించిన స్ఫూర్తిని- శాస్త్రీయ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్ళేలా ప్రేరణ కలిగిస్తుందని ఆశిద్దాం! దేశంలోని 35 ప్రజా సైన్సు ఉద్యమ సంఘాల్ని సమన్వయం చేస్తున్న అఖిల భారత ప్రజా సైన్సు నెట్‌వర్క్ (జనవిజ్ఞాన వేదిక ) ముఖ్య ఆశయం ఇదే!!
ప్రొ. ఎన్. వేణుగోపాలరావుజన విజ్ఞాన వేదిక.
9490098905