
గ్రామీణ, పట్టణ భారతంలో స్త్రీ, పురుషుల వేతనాల మధ్య గణనీయమైన అంతరం వుందని ఇటీవలి ఎన్‌ఎస్‌ఓ సర్వేలో వెల్లడైంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) తాజాగా ''వుమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022'' సర్వే నివేదికను విడుదల చేసింది. ఒకే రకమైన పనికి మహిళలు, పురుషుల కన్నా తక్కువ వేతనాలు అందుకుంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. పైగా, గత దశాబ్ద కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ పురుష వేతనాల వ్యత్యాసం మరింత పెరిగిందని, పట్టణ ప్రాంతాల్లో తగ్గిందని ఇటీవల ఒక మీడియా కథనం పేర్కొంది.
గతేడాది ఏప్రిల్-జూన్‌లో గ్రామీణ భారతంలో మహిళల వేతన రేటు పురుషుల వేతనంలో సగం నుండి 93.7 శాతం వరకు వుంది. పట్టణ ప్రాంతాల్లో, ఇది సగం నుండి 100.8 శాతం వరకు వుందని నివేదిక వెల్లడించింది. జాతీయ గణాంకాల ప్రకారం, సగటు గ్రామీణ పురుషుల వేతనం రూ.393 వుండగా, మహిళా కార్మికుల వేతనం రూ.265 వుంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో పురుషుల వేతనం రోజుకు రూ.483 వుండగా, మహిళలకు రూ.333 వుంది.
గ్రామీణ ప్రాంతాల్లో పురుషులకు రోజువారీ ఇచ్చే వేతనాలు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో అత్యధికంగా వున్నాయి. అదే సమయంలో మహిళల వేతనాలు పురుషులతో పోలిస్తే 60 శాతం తక్కువగా వున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వేతనాలకు సంబంధించి వేతన వ్యత్యాసం చాలా ఎక్కువగా వుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకే రకమైన పనికి స్త్రీ,పురుషుల మధ్య వేతనాల్లో అసమానతలు అధికంగా వున్నాయి. కేరళలో గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల రోజువారీ వేతనం దేశంలోకెల్లా అధికంగా రూ.842 వుంది. అదే సమయంలో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కార్మికుల రోజువారీ వేతనం పురుషుల వేతనంలో కేవలం 51.5 శాతంగా అంటే రూ.434 వుంది.
ఉత్తరప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషా వంటి ఇతర పెద్ద రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మహిళల వేతనాలు పురుషుల వేతనాలతో పోలిస్తే 70 శాతం తక్కువగా వున్నాయని ఎన్‌ఎస్‌ఓ నివేదిక పేర్కొంది. కర్ణాటకలో మినహా మిగిలిన ఐదు రాష్ట్రాల్లో రోజువారీ వేతనాలు రూ.400 కంటే తక్కువగా వున్నాయి. కర్ణాటకలో పురుషుల వేతనం అత్యధికంగా వుంది. అన్ని రాష్ట్రాల్లో కన్నా ఉత్తరాఖండ్‌లో పురుషులతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో మహిళలు కాస్త ఎక్కువగా సంపాదిస్తారు.
హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వేతన వ్యత్యాసం చాలా తక్కువగా వుంది. పురుషుల వేతనాల్లో 85 శాతానికి పైగా మహిళలకు వేతనం లభిస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ లలో కూడా వేతన వ్యత్యాసం తక్కువగా వుంది. అక్కడ మహిళలకు బాగానే చెల్లిస్తున్నప్పటికీ పురుషులకు కూడా చాలా తక్కువ వేతనాలే చెల్లిస్తున్నారు.
చాలా రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో ఇదే రకమైన ధోరణి కనిపిస్తోంది. పురుషులకు అధిక వేతనాలు చెల్లించే చోట వ్యత్యాసం కూడా ఎక్కువగానే వుంటోంది. అదే సమయంలో పురుషులకు తక్కువ చెల్లించే చోట వ్యత్యాసం కూడా తక్కువగానే వుంది. కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో వ్యత్యాసం ఎక్కువగా వుండగా....గుజరాత్, ఒడిషా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో మొత్తంగా వేతనాలే తక్కువగా వుండడంతో వ్యత్యాసం కూడా తక్కువగా వుంటోంది. 2011-12తో వేతన సమాచారంతో పోలిస్తే మొత్తంగా 19 రాష్ట్రాలకు గానూ 11 రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీపురుషుల మధ్య వేతన అంతరం పెరిగింది.
- ఫీచర్స్ అండ్ పాలిటిక్స్