
'పట్టు విడువకుండా చేసే ప్రయత్నం... చివరికి విజయాన్ని చేకూర్చుతుంది. దీన్ని ఒక్క రోజులో సాధించలేం' అంటారు స్వామి వివేకానంద. ఒక్క విజయం కోసం అనేక ప్రయత్నాలు. అనేక అవమానాలు. అనేక ఎత్తుపల్లాలు. ఎన్నో జారుడుమెట్లు. హక్కుల కోసం, హింసలేని ప్రపంచం కోసం, లింగ సమానత్వం కోసం, సమాన హక్కులు-సమాన అవకాశాల కోసం, సమాన విద్య కోసం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందడుగు కోసం, సాధికారత కోసం, హింస నిర్మూలన కోసం, భద్రమైన భవిష్యత్ కోసం, తరతరాల అణచివేత బంధనాలను తెంచుకోవడం కోసం సాగించే ప్రయత్నంలో ఒక్కో అడుగు ఒక్కో మజిలీ. ఇది అలుపెరుగని ప్రయాణం. నిరంతర ప్రయత్నం. ఎన్నో మజిలీల గమ్యం. మార్చి 8న 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' విజయం.
'ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుంది' అంటారు గురజాడ. నేటి మహిళ అన్ని రంగాల్లోనూ తన సత్తా చాటుతోంది. ఆకాశమే హద్దుగా రెక్కలు విప్పుతోంది. అవకాశం ఇవ్వాలేగానీ తాము ఎవ్వరికీ తీసిపోమని, కృషిలో, మేధస్సులో అగ్రగామిగా నిలుస్తామని ప్రకటిస్తోంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముందుకు సాగుతామని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తోంది. కుటుంబంలో వారి పాత్ర ఎంత కీలకమైనదో... సమాజంలోనూ అంతే కీలకం. ఇప్పుడు వారు అడుగుపెట్టని రంగమంటూ లేదు. ప్రపంచంలో సగభాగంగా వున్న మహిళలకు సమాన ప్రాతినిధ్యం లేకుండా ఏ రంగమూ పురోగమించలేదు. 'సిపాయినై తుపాకీ చేతపట్టి/ దేశరక్షణకు సమిధను కావాలని వుంది/ ఆకాశంలోని నక్షత్రాలను నేలకు దింపి/ చీకటి బతుకుల్లో వెలుగులు నింపాలని వుంది' అంటారు డాక్టర్ వాసా ప్రభావతి. దశాబ్దాల క్రితమే ఉన్నత చదువులు చదివి, అత్యున్నత పదవుల నలంకరించిన చరిత్ర మన మహిళామణులది. వంటగదిలో గరిట తిప్పడమే కాదు... సిపాయిగా తుపాకినీ ఎక్కుపెడుతున్నది నేటి మహిళ. అయినా... ఆచరణలో ఎన్నో అడ్డంకులు. కనబడని అంకుశాలు. ఆంక్షల సంకెళ్లు. ఈ హద్దులు వారి ప్రగతికి గుదిబండలుగా మారుతున్నాయి. వైకుంఠపాళి ఆటలో నిచ్చెన మెట్లవుతున్నాయి. నాటి సతీసహగమనం నుంచి నేటి గృహ హింస, లైంగిక దాడుల వరకూ అన్ని అవరోధాలను దాటుకుంటూ నేటి మహిళ పురోగమిస్తూనే వుంది.

- వందేళ్లు పడుతుందట!
'యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా' అని చెప్పే ఈ దేశంలో... స్త్రీలను దేవతలను చేయకపోయినా, మనిషిగా ఆమె హక్కులను, స్వేచ్ఛను, వ్యక్తిత్వాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికీ 'మహిళా దినోత్సవ శుభాకాంక్షలు'. భార్య తనతో సమానమని, తనకూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలున్నాయని గుర్తించే ప్రతి పురుషునికీ ఇది చెందుతుంది. 'స్త్రీని వంటింటి పనిముట్టుగా పరిగణించడం, భారతనారిని నేనని స్త్రీ భావదాస్యంలో పడి ఉండటం, వలపుల రాణిగా, చిలుక పల్కుల చక్కెర పిండి బొమ్మగా, అలికుల వేణిగా స్త్రీని పొగిడి, ఆకాశంలో ఊయల గట్టి ఊగిస్తున్నాడీ పురుషుడు ఎన్నో యుగాల నుండి' అంటూ గుర్రం జాషువా స్త్రీకి జరుగుతున్న అన్యాయాన్ని బట్టబయలు చేస్తాడు. వాస్తవానికి స్త్రీ-పురుషుల మధ్య కొనసాగుతోన్న ఎక్కువ తక్కువల్లో అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పేమీ లేదు. స్త్రీ-పురుష సమానత్వం ఏర్పడాలంటే వందేళ్లు పడుతుందని డబ్యూఈఎఫ్ నివేదిక చెబుతోంది. ఉద్యోగాల్లో సమానత్వం రావాలంటే మహిళలు 217 ఏళ్లు ఎదురుచూడాలట. ఐరాస నివేదిక ప్రకారం.. భారత్‌లోని స్టెమ్ నిపుణుల్లో కేవలం 14 శాతం మాత్రమే మహిళలు వుంటే, వైజ్ఞానిక పరిశోధనా రంగంలో ప్రపంచ వ్యాపితంగా మహిళలు 30 శాతం కంటే తక్కువగా ఉన్నారు. ఇస్రో వంటి ప్రతిష్టాత్మక సంస్థలో కూడా మహిళలు 8 శాతానికి మించి లేరు. పురస్కారాలు, ప్రోత్సాహాల విషయంలో కూడా మహిళల పట్ల చిన్నచూపే. సైన్స్ నోబెల్ బహుమతి గెలుచుకున్నవారిలో పట్టుమని 20మంది కూడా మహిళలు లేరు. స్త్రీ-పురుషుల మధ్య సమానత్వం 2030 నాటికి సాధించాలనే లక్ష్యాన్ని భారత్ చేరుకునే అవకాశంలేదని ఐరాస మహిళల విభాగం 'యూఎన్ విమెన్' తాజా అంచనా. పరిస్థితులు ఇప్పటిలాగే కొనసాగితే మహిళలకు వ్యతిరేకంగా చట్టాల్లో కనిపిస్తున్న వివక్షను తొలగించడానికి, సమానత్వాన్ని సాధించడానికి 268 ఏళ్లు పడుతుందని 'యూఎన్ విమెన్' తాజా నివేదిక వెల్లడించింది.

- శ్రమకు గుర్తింపేదీ..?
అవనిలో సగం, ఆకాశంలో సగం అని సమానత్వం గురించి గొప్పలు చెప్పుకోవడంలో అర్థంలేదని వాస్తవ పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే... ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకోబోయే వరకూ విరామంలేకుండా రాట్నంలా తిరుగుతూ, ఇంటెడు పనులన్నీ చక్కబెట్టే భార్య శ్రమకు గుర్తింపేలేదు. అంతరిక్షానికి వెళ్లినా... పాలించే సత్తా వున్నా... వంటగది వారసత్వం మాత్రం నత్త నెత్తి మీది గూడులా తన వెన్నంటే వస్తోంది. భార్యాభర్తల మధ్య సహజమైన సమానత్వం అంటే... ఇంట్లో చేసే శ్రమకు కూడా విలువ కట్టాలి. అసలు ఈ శ్రమకు గుర్తింపేలేదు. 'పెట్టుబడిదారీ సమాజంలో పాలకుల భావాలే ప్రజల భావాలుగా చలామణీ అవుతాయి' అంటాడు లెనిన్. ఈ భావజాలం మనమే గుర్తించలేనంతగా మన జీవితాల్లో పాదుకొనిపోయింది. చాలామంది పురుషులు 'నా భార్యకు కావాల్సినంత స్వేచ్ఛ వుంది. నాతో సమానంగా చూస్తున్నాను' అనుకుంటాడు. సగటు భార్యలు కూడా 'నా మొగుడు చాలా మంచోడనే భ్రమలో బతుకుతుంటారు. నిజమైన సమానత్వం అంటే... ఆమె చేస్తున్న శ్రమ విలువను తనతో సమానంగా గుర్తించడం. కానీ, అదసలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశంగానే కనబడదు చాలామంది పురుషులకు. ప్రేమ్‌చంద్ అన్నట్లుగా... 'సాంప్రదాయాల సంకెళ్లను ఛేదించకుండా స్త్రీజాతికి స్వేచ్ఛా సమానతలు లభించవు'.
- ఎంత చిత్రమైన వాళ్లు..
రామాయణంలో రాముడికెంత ప్రాముఖ్యత వుందో సీతకీ అంతే ప్రాముఖ్యత వుంది. భాగవతంలో కృష్ణుడికెంత ప్రాధాన్యత వుందో సత్యభామకూ అంతే ప్రాధాన్యత వుంది. భారతంలో పాండవులకెంత ప్రాధాన్యత వుందో ద్రౌపదికీ అంతే ప్రాధాన్యత వుంది. అనాదిగా స్త్రీ ఆదిశక్తి అని చెప్పేవారు... నాటి ప్రాముఖ్యతను మసకబార్చి... మనుస్మృతి కవచాన్ని తొడిగి... ఆమెను వంటింటికి, పడక గదికి పరిమితం చేశారు. అవును-
''రసహీనమైన మగ ప్రపంచానికి కవిత్వాత్మకతనిస్తారు
చెట్లై కొమ్మల్ని విస్తరిస్తారు
ఆకులు రాలుతుంటే శిశిరాల్ని మోస్తారు
చివరకు ఎన్నో వొంటరితనాల్ని భరిస్తారు
యెంత చిత్రమైన వాళ్ళీ స్త్రీలు...'' అంటారు మధురాంతకం నరేంద్ర 'మనోధర్మపరాగం' నవలలో.
అవును... ఎంత అణచివేతనైనా తట్టుకుంటూ... ఎన్నో శిశిరాల్ని మోస్తుంటారు కుటుంబం కోసం.
ఆడవాళ్ల జీవితాలు ఎంత గాలిపటాల్లా వున్నాయో... ఎంత అభద్రతతో నిండిపోయాయో కొడవటిగంటి 'ఆడజన్మ' నవలలో చెబుతాడు. 'బయట ప్రపంచంలో ఎన్నోగొప్పలు పోయేవాళ్లు- పెళ్లాల దగ్గర ఎంత సంకుచితంగా ప్రవర్తిస్తారో... ఎవరికివారు తమ లోపలికి తొంగిచూసుకుంటే, బయటివారికంటే వారికే ఎక్కువ తెలుస్తుంది. కుటుంబాలలోని స్త్రీలు ధైర్యం చేసి తమ మగవాళ్ల గురించిన అసలు వాస్తవాలు చెప్పినట్లయితే ఎవ్వరి పరువూ నిలవదీ ప్రపంచంలో' అంటూ మగవాళ్ల లోగుట్టును బట్టబయలు చేస్తాడు.

- జీతం లేని నౌకరు..
నిజమే, సగటు మగవాడి జీవితంలో ఆమె జీతంలేని నౌకరు. తనది ఇరవైనాలుగ్గంటల నౌకరీ. క్షణం తీరిక వుండదు. దమ్మిడీ జీతం వుండదు. అంతేకాదు, జీవితం తన్నే తన్నులకు ఆమె మీద అక్కసు తీర్చుకొని తృప్తిపడతాం. పక్కవాడికి కూడా తెలియనంత జులుం ఆమె మీద సిగ్గూఎగ్గూ లేకుండా ప్రదర్శిస్తాం. నువ్వు ఆదిశక్తివంటూ, నీ జన్మ ధన్యమైందంటూనే... ఆమెను అణచివుంచడానికి సర్వశక్తులూ ఉపయోగిస్తాం. అడుగడుగునా ఆమెకు ఇన్ని అంకుశాలు ఎందుకంటే... మేమంతా మతానుశాసకులమే. ఆమె పట్ల అందరమూ కరుడుగట్టిన సామ్రాజ్యవాదులమే. సాధువుల్లా తన జీవితం ప్రశాంతంగా సాగిపోవాలనే ప్రతి మహిళా కోరుకుంటుంది. అసలీ ప్రపంచంలో తమకు మిత్రులెవరో, తమ శ్రేయస్సును కోరుకునేదెవరో తెలుసుకోలేరు. అందరు మగాళ్లూ ఆమె క్షేమాన్ని కోరినట్లే కనిపిస్తారు. స్త్రీ హృదయం అగాధం అని అంటాము గానీ, యదార్థమైన అగాధం మగాళ్ల అంతరంగాలు. మహిళలకు ఇన్ని అంకుశాలు, ఇన్ని కంచెలు, ఇన్ని సంకెళ్లు వేసినా... ఆమె గెలుపు సాధిస్తే... అప్పుడామెను ఆకాశానికెత్తడంలోనూ, ఆమె కీర్తిని పొగడ్తలతో ముంచెత్తడంలోనూ, ఆమెకు అసలైన అప్తులం మేమేనని రుజువు చేసుకునేందుకు ప్రయత్నించడంలో ప్రతి మగాడూ పోటీపడతాడు.
- అసత్యపు పునాదిపై...
అందుకేనేమో...చరిత్రలో శతాబ్దాలుగా మహిళ మౌనంగానే వుండిపోయింది. ఒక అసత్యం పునాది మీదే పురుషాధిక్య సమాజం నిర్మించబడింది. పురుషుడు స్త్రీ శరీరంపైన, మనసుపైన దౌర్జన్యంగా తన ఆధిక్యతను, ఆధిపత్యాన్ని చేజిక్కించుకున్నాడు. మహిళ ఇంటికే పరిమితమని, వంటిల్లే తన ప్రపంచమనే భావనను బలవంతంగా కట్టబెట్టారు. అంతేకాదు... కావ్యాలు, ప్రబంధాలు, పురాణాల నుంచి నేటి సోషల్ మీడియా వరకూ మహిళల అందాన్ని అంగాంగ వర్ణన చేస్తూ... కావ్యనాయికలని, ఉత్తమ కులసంజాతులని, అసూర్యంపశ్యలని ఆకాశానికెత్తారు. అందచందాల వర్ణనలతో ఆమె చుట్టూ ఒక వలయాన్ని నిర్మించారు. ఆ వలయం దాటిపోకుండా కట్టుబాట్ల గుదిబండను వేలాడగట్టారు. ఆమె మృదువుగా వుండాలని, సున్నితంగా ప్రవర్తించాలని, భర్తకు, కుటుంబానికి సేవ చేయడమే ఆమె జీవిత పరమార్థమని ఉపమానాలు చెప్పారు. మహిళ- ఎలావుండాలి.. తన నడక.. నడత ఎలావుండాలి, తన కట్టు బొట్టు... చివరకు ఏం తినాలో కూడా తరతరాలుగా పురుష సమాజమే నిర్ణయిస్తూవచ్చింది. వాళ్లు ఏ విధంగా అలంకరించుకుంటే అందంగా వుంటారో కూడా పురుష సమాజమే నిర్ణయిస్తోంది. బానిస సమాజంలో స్త్రీ బానిసలను సంతలో పెట్టి, వారి అందాలను వర్ణించి వేలం వేసేవారు. ఆ పరిస్థితే నేటి ఆధునిక సమాజంలోనూ కొనసాగుతోంది. స్త్రీ అందాన్ని కొలతల్లో బంధించి... ఆ కొలతల ఆధారంగా మార్కులు వేసి... అందగత్తె అంటూ ఒకరిని ప్రకటిస్తున్నారు. చిన్న పట్టణం నుంచి అంతర్జాతీయ వేదికల వరకూ ఈ అందాల పోటీ వెనుక పెద్ద మార్కెట్ నడుస్తోంది. వారి వాస్తవిక జీవితాన్ని వారిని జీవించనివ్వడంలేదు. వారి సృజనాత్మకతను ఏనాడూ లెక్కలోకి తీసుకోలేదు. వారి యిష్టాయిష్టాలను తెలుసుకోలేదు. మహిళలు యిలాగే వుండాలనే ఒక మనువాద ఊబిలోకి నెట్టారు. ఇవన్నీ తమ బాధ్యతలేనేమో అన్నట్లుగా మహిళల మస్తిష్కాలను ట్యూన్ చేశారు. 'స్త్రీకి ఆపాదించిన ఆకర్షణ, మృదుత్వం అనే భావాలను తుత్తునియలు చేయాలి' అంటాడు మావో.

- హక్కుల కోసం పోరాటం..
ఆ ఊబి నుంచి బయటపడే ప్రయత్నం ఇప్పుడిప్పుడే జరుగుతోంది. ఈ బంధనాలు, కట్టుబాట్లను దాటే ధైర్యం ఇప్పుడిప్పుడే అలవడుతోంది. ఆంక్షల హద్దులను చెరిపేసి, తమ ఉనికిని, తమ వ్యక్తిత్వాన్ని, తమ స్థానాన్ని గుర్తించి- ఈ సమాజంలో తన హక్కులను, తన భాగస్వామ్యాన్ని ప్రశ్నించడం ప్రారంభించింది నేటి మహిళ. ఇది మహిళలు మాట్లాడటం ప్రారంభించిన శతాబ్దం. నిర్లక్ష్యం చేయకూడని వారుగా ఎదిగామని ఉద్ఘాటిస్తున్న నిశ్శబ్ద విప్లవం. 'దర్శనం, శ్రవణం/ రసన, సువాసన వెదజల్లడం/ అనుభవంతోపాటు/ విచక్షణాజ్ఞానం సైతం/ పుష్కలంగా వుంది మాకు' అని ఓ ఆధునిక కవయిత్రి ధైర్యంగా ప్రకటిస్తోంది.
మహిళా దినోత్సవం అంటే కచ్చితంగా నేడు జరుగుతున్నది కాదు. స్త్రీని వస్తువుగా మార్చినట్లుగానే... వారికోసం నిర్దేశించిన రోజును కూడా తమ వ్యాపారానికి లాభసాటైన ఈవెంట్‌గా మార్చుతున్నారు. వాస్తవానికి మహిళలు తమ హక్కులు, స్వేచ్ఛ కోసం చేసిన పోరాటాలను, భవిష్యత్ పోరాటాల కోసం వేసుకున్న ప్రణాళికలను మననం చేసుకోడానికి ఉద్దేశించినదీ దినం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదటి సోషలిస్టు విప్లవంలో భాగమైన విప్లవ క్రమాన్ని ప్రారంభించిన శ్రామిక మహిళలను సత్కరించుకునే రోజు.
- కేవలం ఉత్పత్తి సరుకుగానేనా..?
వర్గ చైతన్యంలేని కార్మికులకు వర్గ చైతన్యం కల్పిస్తున్నాం. వయోజన విద్య పేరుతో నిరక్షరాస్యులకు చదువు చెబుతున్నాం. మహిళల విషయానికొచ్చేసరికి- 'హౌస్ వైఫ్' అనే అందమైన ట్యాగ్ తగిలించి, ఇంటికే పరిమితం చేస్తున్నాం. ఇంటి పని, పిల్లల పెంపకం బాధ్యత మహిళలదే అన్నట్లుగా చూస్తున్నారు. చివరకు ఎంతమంది పిల్లల్ని కనాలి, ఎలా పెంచాలి అనేది కూడా పురుషులే నిర్ణయిస్తారు. ఇంటి చాకిరీ ఒక్కటే కాదు- స్త్రీలు పనిచేసే ఏ రంగంలోనైనా ఆమె సంపాదనకు విలువలేదు. ఆమె సంపాదన ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించేది కూడా పురుషులే. 'బూర్జువాకి తన భార్య కేవలం ఒక ఉత్పత్తి పరికరంలా కనిపిస్తుంద'ని చెబుతోంది కమ్యూనిస్టు మ్యానిఫెస్టో. కొద్దిమంది గడపదాటి బయటికొచ్చినా... వంటింటి భారం, పిల్లల బాధ్యత భుజాన తగిలించుకొని రావాల్సిందే. ఆరోగ్యం సహకరించకపోయినా అయ్యగారి సేవలో తరించాల్సిందే. 'టాబ్లెట్ వేసుకున్నావా?' అని అడగటానికి బదులు... 'ఇంకా కాఫీ పెట్టలేదా?' అనే పురుషపుంగవులు మన మధ్య చాలామందిమే వున్నాం. ఇది తరతరాల అణచివేత. ఈ అణచివేత నుంచి 'రేపటి మహిళ' విముక్తం కావాలి. మల్లెతీగకు పందిరిలా తాను నిలబడటానికి తోడుండాలి తప్ప... మర్రిచెట్టు కాకూడదు. శతాబ్దాలుగా స్త్రీలను బానిసలుగా మార్చి... ఇప్పటికీ సేవలు చేయించుకుంటున్న అపరాధభావం తొలగిపోవాలంటే, వారిని చైతన్యదీప్తులుగా వెలగనివ్వాలి. వారి ప్రతి అడుగులోనూ తోడవ్వాలి. 'గనిలో వనిలో కార్ఖానాలో' అని శ్రీశ్రీ అన్నట్లుగా అన్నింటా ఆమె నిలవాలి. మహిళ బతుకుని బీభత్సం చేస్తున్న మతోన్మాద ధూర్తత్వాన్నీ, మార్కెట్ కౌటిల్యాన్ని ఎదుర్కోడానికి పురుష సమాజం ఆలంబన కావాలి.
అదే సమయంలో- మహిళలు సైతం చైతన్యవంతులుగావాలి. వండి పెట్టడంలోనే తమ జీవిత సాఫల్యమని, కుటుంబమంతటికీ సేవలు చేయడానికే తాను పుట్టానని, ఇంతకంటే ఈ జీవితానికి కావాల్సిందేముందనుకొనే భావననుంచి బయటపడాలి. స్త్రీ-పురుషులు సమానులుగా వుండే వ్యవస్థ రావాలి. కుటుంబమైనా, సమాజమైనా ప్రగతిపథంలో నడవాలంటే స్త్రీ చోదక శక్తిగా మారాలి. 'ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుంది' అన్న గురజాడ వారి ఆకాంక్షను మరింత ముందుకు తీసుకెళ్లాలి. మనుధర్మాలను మంటబెట్టి, మేము నేటి మహిళలం కాదు... రేపటి మహిళలం అని మరోచరిత్రను లిఖించాలి. 'రేపటి మహిళలు' అనేది ఈ ఏడాది అంతర్జాతీయ మహిళాదినోత్సవం థీమ్ మాత్రమే కాదు. ఈ తరం బాలికల నుంచి మహిళల వరకూ రేపటితరానికి వారధులు కావాలి. 'రేపటి మహిళలు'గా నిలవాలి. ఈ వికలాంగ ప్రపంచానికి ఊతకర్రలా మారాలి. ఆమె గొంతుకను నలుదిక్కులా ప్రకటించాలి. ఆమె పలుకుల ప్రతిధ్వని విశ్వానికి వినిపించాలి. అలాంటి నిజమైన సమానత్వాన్ని ఆకాంక్షించే భర్తలందరికీ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు'.

- చరిత్ర..
మహిళల మానసిక, సామాజిక, ఆరోగ్య శ్రేయస్సును లక్ష్యంగా ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 'మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకుంటారు. ఒక్కో ఏడాది ఒక్కో థీమ్‌తో నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది (2023) థీమ్- 'రేపటి మహిళలు'. ఇది ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా మహిళల విజయాలను గౌరవించడానికి అంకితమైన రోజు.
మహిళా దినోత్సవానికి వందేళ్లు దాటిన గొప్ప చరిత్ర ఉంది. 1908లో తక్కువ పని గంటలు, మెరుగైన ప్యాకేజీ, ఓటు హక్కు కోసం న్యూయార్క్‌లో 15 వేల మంది మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించారు. మహిళల డిమాండ్లతో అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909లో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. 1910లో సోషలిస్ట్ ఇంటర్నేషనల్ కోపెన్ హాగన్ సమావేశంలో మహిళా దినోత్సవానికి అంతర్జాతీయ హోదా ఇచ్చారు. క్లారా జెట్కిన్ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యమించిన దీక్షాపథం ఇది. తొలిసారిగా మహిళా దినోత్సవాన్ని 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారు. 1913లో రష్యాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజును అధికారిక సెలవు రోజుగా ప్రకటించారు.
- తొలి మహిళలు
- కార్నేలియా సొరాబ్జీ భారత తొలి మహిళా అడ్వకేట్. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో న్యాయవిద్యను అభ్యసించిన మొదటి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు.
- భారతీయ తొలి మహిళా ఇంజనీరు అయ్యలసోమయాజుల లలిత. 1943లో ఇంజనీరింగ్ పట్టా పొంది, 1944లో ఇంజనీరుగా బాధ్యతలు చేపట్టారు.
- 1962లో జన్మించిన కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ.
- జస్టిస్ ఫాతిమా బీవి 1989లో భారత తొలి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
- అన్నా చాందీ 1959లో భారత తొలి మహిళా హైకోర్టు జడ్జిగా నియామకం అయ్యారు.
- 1908లో జన్మించిన ఇషా బసంత్ జోషి భారతీయ మొదటి మహిళా ఐఎఎస్ అధికారిణి. ఆమె పుస్తకాలు ఈషాజోషి పేరుతో ప్రచురించబడ్డాయి.
- కిరణ్ బేడీ భారతదేశపు మొదటి మహిళా ఐపిఎస్ అధికారిణి. జులై 16, 1972న ఐపీఎస్‌గా కెరీర్ ప్రారంభించారు.
- 1831లో జన్మించిన సావిత్రీబాయి పూలే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు.
- 1882లో కోల్‌కతా విశ్వవిద్యాలయం నుంచి బిఎ గ్రాడ్యుయేట్ పొందిన మొదటి భారతీయ మహిళ చంద్రముఖి బసు.
- మదర్ థెరిసాగా ప్రసిద్ధి చెందిన మెరీ థెరిసా బోజాక్షియు 1979లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.
- రాజాబాబు కంచర్ల
94900 99231