Mar 21,2023 07:34

         శాసన మండలి మూడు పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైసిపి ఓటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చిన ప్రజా తీర్పుగా భావించవచ్చు. అనర్హులను ఓటర్లుగా నమోదు చేయించడం, డబ్బు వెదజల్లడం, అధికార దుర్వినియోగం, దొంగ ఓట్ల వంటి అక్రమాలకు పాల్పడ్డప్పటికీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఘోర పరాజయం తప్పలేదు. విద్యావంతులు వివేకంతో ఓటు వేసి వైసిపికి బుద్ధి చెప్పారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, ఇతర కష్ట జీవుల సమస్యలను పరిష్కరించడంలో, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో ప్రభుత్వం వైఫల్యం చెందిన ఫలితమే ఈ తీర్పు. కాగా గ్రాడ్యుయేట్లలో గూడు కట్టుకున్న వ్యతిరేకతను సర్కారు సుతరాం గుర్తింపజాలకుంది. ఎంఎల్‌సి ఎన్నికలను చిన్న ఎన్నికలుగా కొట్టిపారేస్తున్నారు పార్టీ నేతలు. తామిచ్చే పథకాల కేటగిరిలో పట్టభద్రులు లేనందున తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చిందని, అసలు ఈ ఫలితాలు తమకు హెచ్చరిక కానే కాదని విశ్లేషణలకు దిగుతున్నారు. ఎన్నికల మొదట్లో అధికారపక్షమే 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా అభివర్ణించింది. రిఫరెండంగా బరిలోకి దిగింది. తీరా ఫలితాలొచ్చాక ఈ ఎన్నికలు అసలు తమకు లెక్కలోనే లేవని మాట మార్చి మడమ తిప్పింది.
         ప్రభుత్వం పట్ల ప్రజాభిప్రాయం సేకరించడానికి ఇప్పుడు జరిగిన పట్టభద్రుల ఎన్నికలు విస్తృత నమూనా. ఉత్తరాంధ్ర, రాయలసీమ, పాక్షిక దక్షిణాంధ్ర ప్రాంతాలు, తొమ్మిది జిల్లాలు, 108 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఎన్నికలు జరిగాయి. ఏడు లక్షల పైచిలుకు ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరందరూ ప్రజల్లో భాగమే. ప్రజల నాడి పట్టుకోడానికి ఇది పెద్ద శాంపిల్‌. అయినప్పటికీ ప్రజా తీర్పును వైసిపి చులకన చేయడం తగదు. ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లల్లో రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటు వంటిని పట్టించుకోకుండా మూడు రాజధానులను భుజానికెత్తుకుంది. ప్రతిపక్షాలను, ప్రజాసంఘాలను, ప్రశ్నించేవారిపైనా అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు ఒడిగట్టింది. తీవ్ర నిర్బంధ చర్యలు అమలు చేసింది. ఇటువంటి చర్యలను విద్యావంతులు తమ ఓటు ద్వారా నిరసించారు. గ్రాడ్యుయేట్స్‌ ఎన్నికల ఫలితాలను ప్రభుత్వం పట్ల తిరుగుబాటుగా, ప్రతిఘటనగా చూడాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 50 శాతం ఓట్లు సాధించిన వైసిపి ఈ ఎన్నికల్లో 35 శాతానికి దిగజారింది. అధికారపార్టీ కంటే టిడిపికి 7 శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎన్నికలు జరిగిన రెండు టీచర్స్‌ స్థానాల్లో వైసిపి గట్టెక్కడానికి అనర్హులను ఓటర్లుగా అనుమతించడం, ప్రైవేటు స్కూళ్ల ఉపాధ్యాయులను నానా రకాలుగా ప్రభావితం చేయడం, చివరికి బెదిరింపులకు పాల్పడడం కారణాలు. అలాగే ఉపాధ్యాయ నియోజక వర్గాల్లో వైసిపి ఓటమి పట్ల టిడిపి ఆసక్తి చూపలేదు. ఇది రాజకీయ వైఫల్యమే !
           రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి ఈ ఎన్నికల్లో విద్యావంతులు గట్టి గుణపాఠం చెప్పారు. ఆ పార్టీ పోటీ చేసిన అన్ని చోట్లా చెల్లని ఓట్ల కంటే తక్కువ ఓట్లు రావడం ప్రజల్లో బిజెపిపై ఉన్న ఆగ్రహానికి నిదర్శనం. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, గ్రాడ్యుయేట్స్‌, ప్రజల సమస్యలపై అలుపెరగకుండా, నిస్వార్ధంగా పని చేసిన పిడిఎఫ్‌ అభ్యర్ధులు ఓడిపోవడం ప్రజా ఉద్యమాలకు, రాష్ట్ర పురోగతికి నష్టం. రెండు పోట్ల గిత్తల నడుమ పోరులో లేగదూడ నలిగిపోయిన చందం పిడిఎఫ్‌ ఓటమి. అయినప్పటికీ ఉద్యమాలను, పోరాటాలను మరింత సంఘటితం చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఎన్నికలు వెల్లడిస్తున్నాయి. పట్టభద్రుల తీర్పుతోనైనా ప్రభుత్వం తన విధానాలపై పునరాలోచించాల్సి ఉంది. కానీ అంగన్‌వాడీల చలో, జీవో నెం.1 రద్దు కోరుతూ ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆందోళనల నేపథ్యంలో రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న నిరంకుశ చర్యలు ప్రభుత్వ నిర్బంధ వైఖరిలో జడత్వాన్ని సూచిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకం మరింతగా ఐక్య పోరాటాల్లోకి వస్తేనే ప్రభుత్వ మెడలు వంచడం సాధ్యమవుతుంది.