Nov 05,2023 12:52

దుర్మార్గం, అహంకారం మూర్తీభవించిన వ్యక్తి భూషయ్య. తప్పుడు పత్రాలు సృష్టించి పేదల భూములను దోచుకున్నాడు. వారితోనే ఆ భూముల్లో పనిచేయించుకుని కోట్లు గడించాడు. ఆ పేదలు మాత్రం పేదరికంలోనే మగ్గుతున్నారు. భార్య కాంతం పూర్తిగా అతనికి భిన్నం. 'మనకెందుకండీ పేదల భూములు! వారి బాకీ తీరిందిగా.. వాళ్ళ భూములు వాళ్ళకు ఇచ్చేయండి. మనకు ఉన్నది చాలు' అని చూస్తూ ఊరుకోలేక చెప్పి చూసింది. అతను వినలేదు. కళ్ళు ఎర్ర చేసేవాడు. ఆమె భయపడి మారు మాట్లాడేది కాదు.
బయట వాలు కుర్చీలో చుట్ట తాగుతూ కూచున్నాడు భూషయ్య. ఒక కాలు రంగడు, మరో కాలు రంగడి కొడుకు వత్తుతున్నారు. భూషయ్య కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నాడు.
'అయ్యా' అంటూ నసిగాడు వల్లప్ప. కళ్ళు తెరవకుండానే.. 'ఊ' అని మూలిగాడు. పనిమనిషి వల్లప్ప భార్యనే. 'అయ్యా కాఫీ' అంది.
వల్లప్ప చేతులు కట్టుకుని భయంగా నిలుచున్నాడు. అడుగు అని సైగ చేసింది వల్లప్ప భార్య.. తలూపాడు వల్లప్ప.
'కాఫీ బాగుందే నువ్వే చేశావా?' అన్నాడు వెకిలిగా చూస్తూ.
'కాళ్ళు పట్టడం ఆపి పైకి లేచారు తండ్రీ కొడుకు.
కాంతం పిలిస్తే లోపలికి వెళ్ళింది వల్లప్ప భార్య.
'రేపు వరినాట్లు వేయాల. మీరిద్దరూ రావాల' అన్నాడు హుకుం జారీ చేస్తూ.
'అట్లనే అయ్యా' తల ఆడిస్తూ వెళ్ళారిద్దరూ.
భూషయ్య పైకి లేచి పంచ సర్దుకుని, మెడలో పులిగోరు సవరించుకుంటూ 'ఇప్పుడు చెప్పరా.. ఏంది పని?' అన్నాడు.
'పట్నం పోవాలయ్యా. హాస్టల్లో పిల్లాడు చదువుతున్నాడు. వాడికి దీపావళి అంటే మహా ఇష్టం. బస్సు ఛార్జీలకు, ఓ రెండు కాకర పూలు, భూ చక్రాలు తీసుకోవాల. కొంచెం డబ్బు కావాల' తల గోక్కుంటూ అన్నాడు.
అ మాట వినగానే గట్టిగా నవ్వాడు భూషయ్య. 'అప్పు ఇంకా తీరలేదు. మళ్ళీ డబ్బులా?' అన్నాడు.
'అందుకే కదయ్య.. నా భార్యను కూడా మీ ఇంటిలో పనికి పెట్టా' అన్నాడు.
'అది సరేరా.. ఇప్పుడు ఐదు వేలు ఓ వారంలో నాకు ఇవ్వాలి.. లేకపోతే మీ కుర్రాడిని మా గొడ్లు కాయడానికి పంపాలి తెలిసిందా?' అన్నాడు.
'వారం అంటే ఇవ్వలేనయ్య ఓ నెలలో ఇస్తాను' అన్నాడు.
ఇంతలో వల్లప్ప భార్య వచ్చి 'అయ్యా టిఫిన్‌కు రండి' అని, అడిగావా అని సైగ చేసింది.
అది చూశాడు భూషయ్య. 'ఏందిరో ఇద్దరూ సైగలు చేసుకుంటున్నారు' అన్నాడు.
'వారం అయితే కష్టమయ్యా' అని వెళ్ళబోతుండగా..'డబ్బు అవసరం ఉన్నప్పుడు సరే అనాలి. ముందు డబ్బు ఇప్పించుకో' అంది వాడి భార్య. భార్య, భర్త మాట్లాడుకోవడం చూశాడు భూషయ్య.
'వారంలో ఇస్తాను' అని మాట ఇచ్చాడు.
'వారంలో ఇవ్వకపోతే మీ వాడిని పనికి పంపివ్వాలి, తెలుసా' కటువుగా అన్నాడు.
వెంటనే జేబులో చేయి పెట్టి, ఐదు వేలు తీసిచ్చి, నోటు రాయించుకున్నాడు. అది ముందుగానే తయారుచేసుకున్న నోట్‌. అందరికీ ఇలాంటివే ఇచ్చి, వాళ్ళతో సంతకం పెట్టించుకుంటాడు. సరిగ్గా అదే జరిగింది వల్లప్ప విషయంలో.
'వడ్డీ తెలుసుగా' అన్నాడు మీసం మెలేస్తూ. తెలుసన్నట్టు తలూపాడు వల్లప్ప.

112

                                                                                 ***

బస్సులో వెళితే ఖర్చని ఏరుదాటి అడ్డం వెళుతున్నాడు. అడ్డదారిన వెళితే ఓ రెండు గంటల్లో వెళ్ళిపోవచ్చు. వచ్చేటప్పుడు బస్సులో రావచ్చని వాడి ఉద్దేశం. అలా ఆలోచించుకుంటూ కొండదారి గుండా వెళుతున్నాడు.
అక్కడే ఉన్న రమణ చూసి, 'ఏమి వల్లప్పన్నా పట్నం వెళుతున్నావా?' అడిగాడు ఏదో చుడుతూ.
'ఆ..' అంటూనే 'ఏందది రమణా?' అడిగాడు.
'భూషయ్యని చంపడానికి నాటు బాంబు చేస్తున్నాలే' అన్నాడు నవ్వుతూ.
అదిరిపోయాడు వల్లప్ప. 'నువ్వు చెప్పేది నిజామా?' అన్నాడు.
'అవును, మనతో తప్పుడు పత్రాలు రాయించుకుని మనను దోపిడీ చేస్తున్నాడు. దీపావళి రోజే వాడి పీడ విరగడ చేస్తాను. మా రంగడి మామ, అతని కొడుకు, నీ భార్య అతనికి ఊడిగం చేస్తున్నారుగా. నేను ప్రశ్నిస్తే నన్ను ఊరి నుంచి బహిష్కరించాడు. నీ కొడుకుని కూడా రానీ.. భూషయ్య కథ చూస్తాం' అన్నాడు.
'పెద్దోళ్ళతో మనకెందుకు? మన పని ఏదో మనం చేసుకుంటే పోలా' అన్నాడు.
'అలా చేసుకుంటూ పోతున్నాం గనుకే వాడి ఆటలు సాగుతున్నాయి. లేకపోతే పది రూపాయలు వడ్డీ తీసుకుంటాడా? వడ్డీలకు వడ్డీ కట్టి మోసం చేస్తూ మన భూములు కబ్జా చేసి, మనతోనే వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. అదేమని అడిగానని, ఇదిగో ఇలా నన్ను ఊరి నుంచి బహిష్కరించాడు. నువ్వు తెచ్చే టపాసులు వాడితోనే కాల్పించు. అందులో గుర్తు పట్టకుండా నా నాటుబాంబు పెడతా. ఈ బాంబుతో మీరే ప్రారంభం చేయాలి అని చెప్పు. తప్పక చేస్తాడు. వాడి పీడ విరగడ అవుతుంది. మనకు, మన ఊరికి స్వేచ్ఛ లభిస్తుంది' అన్నాడు.
'అందులో నా కొడుకు ఎందుకు?' అడిగాడు.
'పిచ్చి వల్లప్ప.. ముందు ఓ రెండు కాకరపూలు నీ కొడుకు కాల్చిన తరువాత నాటు బాంబు ముట్టియ్యమని, మీరందరూ దూరం జరగాలి. అప్పుడే వాడు నమ్ముతాడు. అందులో నీ కొడుకు చదువుకోవడం వాడికి ఇష్టంలేదు. గొడ్ల కాపరిగా మీ వాడిని ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాడు' అన్నాడు.
'మావాడు చదువుకోవాలి రమణ. ఇంకొక్క సంవత్సరం చదివితే వాడి చదువు పూర్తి అయిద్ది. ఈ భూషయ్య దగ్గరే నౌకరి అడుగుదామనుకుంటన్నా' అన్నాడు.
దానికి పగలబడి నవ్వాడు రమణ.
ఆశ్చర్యంగా వాడి వంక చూశాడు వల్లప్ప. 'మన ఊరిలో అక్షర జ్ఞానం నాకు, మీ కొడుక్కి తప్పితే ఎవరికీ లేదు. మా అయ్య తీసుకున్న రెండు వేల అప్పుకి వాడి దగ్గర పని చేస్తూ, అప్పు తీరినా, తీరలేదు అని మా అమ్మను కూడా పనిలో పెట్టుకున్నాడు. వాడి దగ్గరే పని చేస్తూ వాళ్ళు కాలం చేశారు. నేను చదువు మధ్యలో ఆపేసి వచ్చి అప్పు తీరింది కదా, నా భూమి నాకు ఇవ్వమంటే, కళ్ళు ఎర్ర చేసి నన్ను ఊరిలోకి రాకుండా చేశాడు. వాడు చావాల! మీ భూమి విముక్తి కావాల! వాడి చెర నుంచి నువ్వు, నీ భార్య విముక్తి పొందాల. త్వరగా వెళ్ళి నీ కొడుకు క్రాంతి గాడిని తీసుకురా' అన్నాడు.
వల్లప్ప ఆలోచించుకుంటూ వెళుతున్నాడు. రమణ చెప్పేది అంతా నిజమే. మంచి నీళ్ళు పారే భూమి కైవసం చేసుకున్నాడు. ఇళ్ళు స్వాధీనం చేసుకుని, రమణను తరిమేశాడు. మా క్రాంతి అలా కాకూడదు. అనుకుంటూ పట్నం చేరాడు.
 

                                                                                     ***

ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనల్‌ చదువుతున్నాడు క్రాంతి. చురుకైన వాడు. డిగ్రీ ఇక పూర్తి అవుతుండగానే ఒక కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక అయ్యాడు. మా నాన్న వస్తే ఈ విషయం చెప్పాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
కళాశాలలో ఆరోజు వక్తృత్వపు పోటీలు జరుగుతున్నాయి. అంశం 'భూస్వాముల చెరలో పేదలు' అందరూ తమకు తోచినది చెబుతున్నారు. క్రాంతి వంతు వచ్చేసరికి సరిగ్గా కళాశాల గేటు దగ్గరకు చేరుకున్నాడు వల్లప్ప. క్రాంతి ఉపన్యాసం ఆకట్టుకునేలా ఉంది.
'మనను దోచుకునే భూస్వాములు వడ్డీలకి వడ్డీ గుంజుతూ, మన ఆస్తులను కైవసం చేసుకుని, పెద్దపెద్ద మేడల్లో విలాసవంతంగా జీవిస్తున్నారు. మనం పేదలుగానే ఉంటున్నాం. మన రక్తంతో వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. అటువంటి వాళ్ళను శాశ్వతంగా లేకుండా చేయాలి. మా ఊరి భూస్వామి అటువంటి వాడే. ఆయన చెర నుంచి మా ఊరి రమణ కుటుంబం కకావికలం అయింది. ఇక మనం మోసపోకూడదు. మనలో చైతన్యం రావాలి. వెట్టి చాకిరీ పోవాలి, భూ స్వాములకు చరమ గీతం పాడాలి. మన భూమిపై మనకే హక్కు.!' అని ఉపన్యాసం సాగుతోంది.
 

                                                                                      ***

వల్లప్పలో చలనం వచ్చింది. తన కొడుకు మాట్లాడటం చూసి. వాడు చెప్పింది, రమణ చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం అనుకున్నాడు. వెంటనే వెళ్ళి తనకు కావాల్సిన టపాసులు తీసుకుని, కళాశాల దగ్గరకు చేరుకున్నాడు. వక్తృత్వ పోటీలో క్రాంతి ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు అని ప్రిన్సిపాల్‌గారు ప్రకటించాడు. అందరూ క్రాంతిని అభినందిస్తుంటే వల్లప్ప కళ్ళు చెమర్చాయి. దూరం నుంచి తండ్రిని చూసి, దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు క్రాంతి.
'అందరూ బాగున్నారా..? అమ్మ బాగుందా నాన్న.. రమణ ఎలా ఉన్నాడు?' అని అడిగాడు.
వల్లప్ప తల దించుకుని 'ఏం చెప్పమంటావ్‌ మన బాకీ తీరలేదని మీ అమ్మను కూడా పనిలో ఉంచుకున్నాడు. ఇప్పుడు తెచ్చిన బాకీ చెప్పిన సమయానికి ఇవ్వకపోతే నిన్ను కూడా పశువులు కాయడానికి పెట్టుకుంటానంటున్నాడు' అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
క్రాంతి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలని మనసులో అనుకున్నాడు. ఇద్దరూ బస్టాండ్‌ చేరుకున్నారు. బస్సు దుమ్ము లేపుకుంటూ వాళ్ళ ఊరి దగ్గర ఆగింది. భూషయ్యపురం అన్న పేరు చూడగానే ఆవేశం కట్టలు తెంచుకుంది. పక్కనే పేడ ముద్ద కనపడితే తీసుకుని భూషయ్య అనే పేరు మీద కొట్టాడు. 'నాన్నా నువ్వు వెళ్ళు, నేను రమణను కలిసి, వస్తాను' అన్నాడు.
'జాగ్రత్త, వాడు కూడా కసి పెంచుకున్నాడు భూషయ్య మీద' అన్నాడు.
రమణ ఓ చెరువు గట్టున కూర్చొని నీళ్ళలోకి రాళ్ళు విసురుతూ ఉన్నాడు. క్రాంతి నీడ నీళ్ళలో కనపడగానే లేచి, అలింగనం చేసుకున్నాడు. వాడి కళ్ళల్లో నీళ్ళు.
'మా ఆస్తి మొత్తం రాయించుకున్నాడు. అదేమని అడిగితే ఇదిగో ఇలా బహిష్కరించాడు' అన్నాడు.
'ఈ ఆగడాలకు ఇక ముగింపు పలుకుదాం రమణ' అన్నాడు క్రాంతి.
'అదేరా రేపు మన ఊరి మైదానంలో ఆ భూషయ్య మన ఊరి వాళ్ళతో తెచ్చిన టపాసులు కాలుస్తుంటే మనం ఆనందించాలి. ఇది ఏటా వస్తున్న తంతే కదా! ఆ టపాసులలోనే నేను ఒక నాటు బాంబు మీ టపాసుల్లో కలిపేస్తాను. వాడు లక్ష్మి బాంబు అనుకుని కాలుస్తాడు. ఆ దెబ్బతో వాడి పీడ విరగడ అవుతుంది. మన ఊరికి స్వేచ్ఛ వస్తుంది' అన్నాడు.
'సరే' అన్నాడు క్రాంతి.
 

                                                                                      ***

ఊరు ఊరంతా మైదానానికి చేరుకున్నారు. తెచ్చుకున్న టపాసులు ఒక కుప్పగా పోస్తున్నారు. పిల్లలు కాలుస్తాం అంటుంటే 'మనం కాల్చకూడదు. ఆ భూషయ్య గారే కాల్చాలి. మీరంతా అనదించాలి.. అంతే' అన్నాడు ఒక ముసలాయన.
భూషయ్య తెల్లటి బట్టలు, కండువా, వేసుకుని జీపులోనించి దిగాడు. వాడి వెంట కుడి, ఎడమల్లో వల్లప్ప, రమణ తండ్రి చేతులు కట్టుకుని నడుస్తున్నారు.
రమణ దూరం నుంచి చెట్టెక్కి చూస్తున్నాడు. భూషయ్య టపాసులు కాల్చడానికి సమాయత్తం అవుతుండగా పిల్లలు, పెద్దలు చప్పట్లు కొట్టారు. భూషయ్య మీసం మెలేస్తూ టపాసుల దగ్గరకు చేరుకుంటున్నాడు.
'ఇక మీరు వెళ్ళండి' అని సైగ చేశాడు. వల్లప్ప, రమణ తండ్రి జీపు దగ్గర నిలబడ్డారు. వల్లప్ప గుండె వేగంగా కొట్టుకుంటోంది. క్రాంతి, భూషయ్యను చూసి 'మొదలు పెట్టండి' అన్నాడు.
భూషయ్య, క్రాంతిని ఎగాదిగా చూసి, మీ బాకీ తీరలేదు, మీ నాన్న ఐదువేలూ కట్టకపోతే నువ్వే మా పశువులు కాయాలి, తెలిసిందా?' అన్నాడు.
తలూపాడు క్రాంతి.
అప్పుడే వచ్చారు కాంతం, క్రాంతి అమ్మ.
'బాగున్నావా బాబు' అంది కాంతం. ఆమె మాటలలో సౌమ్యం. 'ఈ రాక్షసునికి ఎలా భార్య అయిందో?' అనుకున్నాడు.
భూషయ్య, తన భార్య కాంతాన్ని, వల్లప్ప భార్యను జీపు దగ్గరకు వెళ్ళమని హుకుం జారీ చేశాడు. క్రాంతిని తన దగ్గరకు రమ్మని ఆజ్ఞాపించాడు. క్రాంతి, భూషయ్యని సమీపించాడు.
రాశులుగా పోశారు టపాసులు. రమణ బాంబును గుర్తుపట్టే విధంగా ఎర్ర పేపర్‌ చుట్టారు. ముందుగా ఓ రెండు రాకెట్స్‌ వదిలాడు భూషయ్య. తరువాత చిన్న చిచ్చు బుడ్లు వెలిగించాడు. ఆ కాంతిలో ఊరి జనం అంతా కనపడుతున్నారు. ఒక్కొక్కటి అందిస్తున్నాడు క్రాంతి. 'ఆ ఎర్ర కాగితం చుట్టిన బాంబు నువ్వు కాల్చు!' అన్నాడు భూషయ్య.
అదిరి పడ్డాడు రమణ. క్రాంతి గుండె కూడా స్పీడుగా కొట్టుకుంటోంది. 'నాకు, నాకు బాంబులు అంటే భయం అయ్యగారూ.. మీ ముందర కాల్చటం నాకు తగదు' అన్నాడు.
భూషయ్య మీసం తిప్పుతూ 'నీ స్థానం ఏమిటో గ్రహించావు. సరే ఆ ఎర్ర బాంబు నేనే పేలుస్తా దూరంగా ఉండు' అన్నాడు.
క్రాంతి చాలా వేగంగా ఊరి జనాలను, జీపు దగ్గర ఉన్న వాళ్ళను 'మీరంతా దూరం జరగండి, అది శక్తివంతమైన బాంబు. ఆ శబ్దం మీరు వినలేరు. దూరం జరగండి' అని అందరినీ అప్రమత్తం చేశాడు.
ఎర్ర బాంబును ముద్దు పెట్టుకుని కాల్చటానికి సిద్ధమైనాడు భూషయ్య. అందరి కళ్ళు వాడి మీదనే, క్రాంతి, రమణ కన్నార్పకుండా చూస్తున్నారు. 'అందరూ చెవులు మూసుకోండి' అని భూషయ్య ఆ బాంబును కాల్చాడు. అది పెద్ద శబ్దం చేస్తూ పేలింది. అంతే మరుక్షణం ఎగిరిపడ్డాడు భూషయ్య. ఆ బాంబు ధాటికి మిగతా టపాసులన్నీ టప, టప పేలాయి. కాంతం 'ఏమైందండి?' అని పరుగున వచ్చింది. అప్పటికే భూషయ్య మరణించాడు.
క్రాంతి, వల్లప్ప వచ్చారు. 'అయ్యగారూ' అని తట్టి లేపుతున్నారు. ఊహు చలనం లేదు. కాంతం కళ్ళల్లో కన్నీళ్ళు రావడం లేదు. ఎందరో అమాయక ప్రజలను చేసిన మోసం.. ఊరంతా చేసినందుకు అనుభవించాడు అనుకుని నిర్వేదంగా చూస్తున్నట్టనిపిస్తోంది.
భూషయ్య మరణించాడు అనే వార్త అందరికీ తెలిసింది. రమణ చెట్టు దిగి క్రాంతి దగ్గరకు వచ్చాడు. భూషయ్య శవం చుట్టూ ఊరి జనం మూగారు. రమణను కాంతం చూసి 'నీ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది' అంది.
రమణ ఆ మాటకు స్పందిస్తూ 'నా ఒక్క కుటుంబానికే కాదమ్మా, నాలా ఎందరో ఈ ఊరి జనాలకు మోసం జరిగింది. నేడు అతని పాపం పండి, దీపావళి రోజే మరణించాడు' అన్నాడు. కాంతం కల్పించుకుని మీ పత్రాలు, డబ్బులు, భూములు తీసేసుకోండి' అనగానే అందరూ చప్పట్లు కొట్టారు.
ఆ రోజే కాంతం ఎవరి భూమి వాళ్ళకు ఇచ్చేసింది. పత్రాలు చించేసింది. జనమంతా 'కాంతమ్మకూ జై! ఈ రోజే మనకు దీపావళి!!' అంటూ నినాదాలు చేశారు.
రమణ భూములు, ఆస్తి తిరిగి వచ్చింది.

కనుమ ఎల్లారెడ్డి
93915 23027