Sep 03,2022 10:35

హైదరాబాద్‌ : పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన కార్యక్రమంలో భాగంగా ... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో పర్యటించిన సంగతి విదితమే. కామారెడ్డి కలెక్టర్‌ జితేశ్‌ పాటిల్‌తో మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవర్తించిన తీరుపై కెటిఆర్‌ ట్విటర్‌లో స్పందిస్తూ విమర్శలు గుప్పించారు.

కామారెడ్డి కలెక్టర్‌ జితేశ్‌ పాటిల్‌కు మంత్రి కెటిఆర్‌ అండగా నిలిచారు. కలెక్టర్‌తో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవర్తించిన తీరు తనను భయపెట్టిందన్నారు. బిజెపి నాయకుల ప్రవర్తనతో ఐఎఎస్‌ అధికారులు భయపడుతున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంలో కలెక్టర్‌ గౌరవప్రదమైన ప్రవర్తనకు కెటిఆర్‌ అభినందనలు తెలిపారు. కష్టపడి పనిచేసే ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ అధికారులను ఇలాంటి రాజకీయ నేతలు నిరుత్సాహపరుస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

మంత్రి నిర్మలా సీతారామన్‌ కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో ప్రధాని మోడి ఫొటో ఎందుకు పెట్టలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే మోడీ ఫొటోను పెట్టాలని కలెక్టర్‌ను నిర్మలా సీతారామన్‌ ఆదేశించారు. కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి రవాణా, గోదాం ఖర్చులను భరిస్తూ కేంద్రం ప్రజలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తోందని.. అలాంటప్పుడు రేషన్‌ దుకాణాలపై ప్రధాని మోడి ఫొటో ఎందుకు పెట్టడం లేదంటూ కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను నిలదీశారు.