Jul 20,2022 06:57

ప్రకృతి పగ పట్టినట్టు భారీగా కురిసిన వర్షాలొకవైపు, వాగులు, వంకలు పొంగిపొర్లడంతో గత మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని రీతిలో ఉగ్ర రూపం దాల్చిన గోదావరి మరొక వైపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 8 జిల్లాలను అతలాకుతలం చేశాయి. పెను విధ్వంసం సృష్టించాయి. ప్రాణ నష్టం లేకున్నా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఊళ్లకు ఊళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. లంక గ్రామాలు, పోలవరం ముంపు మండలాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చుట్టూ నీళ్లు ఉన్నా కానీ, తాగడానికి గుక్కెడు మంచినీళ్లు దొరకని పరిస్థితి. పాలు, మందులు, ఇతర నిత్యావసరాలు దొరక్క ముంపు ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. వెయ్యి రూపాయల గ్యాస్‌ బండ రెండు వేలు పలుకుతోంది. గర్భిణులు, పిల్లలు, వృద్ధుల అవస్థలు వర్ణనాతీతం. పశువుల మేత దొరక్క మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. ధవళేశ్వరం దిగువ ప్రాంతంలోని బొబ్బర్లంక ఆ చుట్టు పక్కల లంకల్లో తలదాచుకునే కృష్ణ జింకల మనుగడే ప్రశ్నార్థకంగా తయారైంది. విపత్తుల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన పాలకులు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోడానికి విడ్డూరపు వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ప్రకృతి సృష్టించిన విలయమిది మనమేం చేయగలమని మన రాష్ట్ర అమాత్యులొకరు సెలవిస్తే, పొరుగున ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కుట్ర సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. వీరి విన్యాసాలు ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేస్తున్న మోడీ సర్కార్‌ ధోరణి మరీ దారుణం. జాతీయ ప్రాజెక్టు పోలవరం కోసం సర్వస్వం కోల్పోయిన గిరిజనులను ఆదుకోవాలన్న స్పృహే కేంద్ర ప్రభుత్వానికి లేదు. పోలవరం నిర్వాసితులకు సకాలంలో పునరావాసం కల్పించడంలో నిర్లక్ష్యం, వర్షాలు వరదల్లో తడిసి ముద్దవుతూ చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురైన బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం... ఇలా అడుగడుగునా కేంద్రం వీరి జీవితాలతో చెలగాటమాడుతున్నది. ఎప్పుడో పూర్తికావాల్సిన పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఎండగట్టడం వల్లే ఆ ప్రాజెక్టు నత్తకే నడకలు నేర్పిస్తున్నది. పోలవరం నిర్వాసితులకు మొదట పునరావాసం కల్పించి, తరువాత ప్రణాళికా బద్ధంగా ప్రాజెక్టు పనులు చేపట్టి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే. వర్షాలు, వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతుంటే కేంద్రం దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా దులిపేసుకోవడం అత్యంత బాధ్యతారాహిత్యం. గతంలో హుదూద్‌, తిత్లీ, అసిని వంటి తుపానులు రాష్ట్రాన్ని కుదిపేసినప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం సరిగా స్పందించలేదు. గత వారం రోజులుగా వందలాది గ్రామాలు వరద నీటిలో చిక్కుకుంటే ప్రధాన మంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ ఇటు వైపు ఒక్కసారి కూడా తొంగిచూసిన పాపాన పోలేదు. రాష్ట్రపతి, ఉప రాష్ట్ర్రపతి ఎన్నికల్లోను, పార్లమెంటులో ప్రజా వ్యతిరేక చట్టాలు తెచ్చే సమయంలోను మోడీ ప్రభుత్వానికి గుడ్డిగా మద్దతు ఇచ్చే జగన్మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం కానీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కానీ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ఈ అన్యాయంపై పల్లెత్తు మాట కూడా అనకపోవడం విస్తు గొలుపుతోంది. రాష్ట్ర ప్రయోజనాల పట్ల, ప్రజల ప్రయోజనాల పట్ల బాధ్యత కలిగిన పార్టీలు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? వీటికి భిన్నంగా సిపిఐ(ఎం), ఇతర ప్రజాసంఘాలు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు తమ చేతనైన సాయం అందిస్తూ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. వరద తగ్గుముఖం పడుతున్నా ఇప్పటికీ చాలా లంక గ్రామాలు నీటిలో ఉన్నాయి. బాధితులకు అన్ని విధాలా సాయం అందుతోందని అధికార గణం నమ్మబలుకుతున్నప్పటికీ చాలా మందికి పప్పులు, ఉప్పులు, నూనె, ఉల్లిగడ్డలు వంటి నిత్యావసరాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. పశు దాణా కొరత తీవ్రంగా ఉంది. పారిశుధ్య లోపం వల్ల అంటువ్యాధులు, అతిసార వంటివి చోటుచేసుకునే ప్రమాదముంది. చాలా చోట్ల గోదావరి గట్లు, కాలవల గట్లు సరైన మరమ్మతులు లేక బలహీనంగా ఉన్నాయి. ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలి. బాధిత ప్రజానీకాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి. అదే సమయంలో జాతీయ విపత్తుల సహాయ నిధి నుంచి మనకు న్యాయంగా రావాల్సిన వాటాను రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయాలి.