ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో వ్యవసాయ కూలీల రోజు వారి వేతనం కేరళలోనే అత్యధికంగా ఉంది. బిజెపి పాలిత మధ్యప్రదేశ్, గుజరాత్‌లో అత్యల్పంగా ఉంది. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేరళలో వ్యవసాయ కూలీ రోజు వారి వేతనం రూ.736.31 ఉందని, ఆ స్థాయిలో ఏ రాష్ట్రంలో కూడా లేదని తెలిపారు. రెండో స్థానంలో జమ్ముకాశ్మీర్‌లో రూ.532.03 ఉందని, హిమచల్‌ప్రదేశ్‌లో రూ.470.56, తమిళనాడులో రూ.450.69, హర్యానాలో రూ.400.88, పంజాబ్‌లో రూ.378.41, రాజస్థాన్‌లో రూ.359.28, ఆంధ్రప్రదేశ్‌లో రూ.349.32 ఉందని తెలిపారు. మిగతా రాష్ట్రాలన్ని ఆ తరువాతే ఉన్నాయి. ఉపాధి హామీ వేతనాలకు సంబంధించి కూడా హర్యానాలో రోజుకు రూ.331, గోవాలో రోజుకు రూ.315, కేరళలో రోజుకు రూ.311 వేతన నోటిఫై చేశారని తెలిపారు. ఏపి, తెలంగాణల్లో రూ.257 నోటిఫై చేసినట్లు చెప్పారు.
కుటుంబమంతా కష్టపడినా రూ.10 వేలే !
ఆంధ్రప్రదేశ్‌లో రైతు కుటుంబం నెలవారీ ఆదాయం రూ. 10,480, తెలంగాణలో 9,403 ఉందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో రైతు కుటుంబం నెలవారీ ఆదాయం రూ.10,218 ఉందని పేర్కొన్నారు. మేఘాలయంలో రూ.29,348, పంజాబ్‌లో రూ.26,701, హర్యానాలో రూ.22,841, అరుణాచల్ ప్రదేశ్‌లో రూ.19,225, జమ్ముకాశ్మీర్‌లో రూ.18,918, మిజోరంలో రూ.17,918, కేరళలో రూ.17,915 రైతు కుటుంబం నెలవారీ ఆదాయం ఉందని తెలిపారు.
రైతులకు పరిహారమా ! ఆ సమాచారం లేదు
రైతు ఉద్యమంలో మరణించిన రైతులకు పరిహారానికి సంబంధించిన సమాచారం కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వద్ద లేదని ఆ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రాజ్యసభలో సిపిఎం ఎంపి వి. శివదాసన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కనీస మద్దతు ధరకు సంబంధించి 2022 జూలైలో కమిటీ వేశామని తెలిపారు.
రైతు భరోసా కేంద్రాలతో సేవలన్నీ ఒకే చోట
రైతుల అవసరాలు తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బికెలు) వన్-స్టాప్ సొల్యూషన్‌గా పని చేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రాజ్యసభలో వైసిపి ఎంపి వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ముందుగా పరీక్షించిన వ్యవసాయ ఉత్పాదనల సరఫరా నుంచి వివిధ సేవలు, సామర్ధ్యం పెంపు చర్యలు, సాగుకు సంబంధించిన పరిజ్ఞానం ప్రచారం వంటి రైతాంగ అవసరాలన్నింటికి రైతు భరోసా కేంద్రాలు వన్-స్టాప్ సొల్యూషన్‌లా పని చేస్తున్నట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాలు అమలు చేసే పథకాలు, విధానాలను పరిగణలోకి తీసుకుంటూ వాటి ఆధారంగా పథకాల రూపకల్పన చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు.
ఏపిలోనే అత్యధిక కోర్టు ధిక్కారణ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక కోర్టు ధిక్కారణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో ఒక ఎంపి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో 2022 డిసెంబర్ 14 వరకు 28,469 కోర్టు ధిక్కారణ కేసులు పెండింగ్‌లో ఉంటే, ఒక్క ఏపిలోనే 11,348 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రెండో స్థానంలో పాట్నా హైకోర్టులో 6,554 కేసులు పెండింగ్‌లో ఉండగా, తెలంగాణలో 6,236 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏపిలో ఎన్నికలకు సంబంధించి 23 కేసులు, రిట్ పిటిషన్లు 110 పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణలో 39 ఎన్నికలకు సంబంధించిన కేసులు, 1,44,038 రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 16,42,371 రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించి 959 పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా, కార్మికులకు సంబంధించి పిటిషన్లు 1,240 పెండింగ్‌లో ఉన్నాయి.
ఏపిలో 1,740 గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్
ఆంధ్రప్రదేశ్‌లో 1,740 గ్రామాల్లో భారత్ నెట్ కింద బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం అమలులో ఉందని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసిన్ చౌహాన్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 13,420 గ్రామాలకు గాను, భారత్ నెట్ పథకం కింద 4,281 గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించామని తెలిపారు. 9,139 గ్రామాలకు భారత్ నెట్ కనెక్టివిటీ ఇంకా అందించలేదని తెలిపారు. 2022 డిసెంబర్ 13 నాటికి 1,740 గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం అమలులో ఉందని తెలిపారు.










