
- రోజ్‌గార్ మేళాలు నేతి బీరకాయలో నెయ్యి చందమే
న్యూఢిల్లీ : నేతి బీరకాయలో నెయ్యి ఉండడం ఎంత వాస్తవమో మోడీ ప్రభుత్వం ప్రారంభించిన రోజ్‌గార్ మేళాలలో ఉద్యోగాల కల్పన కూడా అంతే వాస్తవం. ఈ సంవత్సరం లోగా పది లక్షల పోస్టులను భర్తీ చేయడమే లక్ష్యంగా చేపట్టిన 'మిషన్ రిక్రూట్‌మెంట్' ప్రక్రియ నిరుద్యోగ యువత ఓట్లకు గాలం వేయడం కోసమేనన్నది జగమెరిగిన సత్యం. ఓ వైపు ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తూ మరోవైపు ఇలాంటి మేళాలు జరపడం ద్వారా లక్ష్యం ఏ విధంగా నెరవేరుతుందో ప్రభుత్వానికే తెలియాలి. పైగా వివిధ శాఖలలో శాశ్వత నియామకాలకు స్వస్తి చెప్పి సిబ్బందిని అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించుకుంటూ కాలక్షేపం చేస్తోంది. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగాల సంగతి సరేసరి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. పేరుకు రోజ్‌గార్ మేళాలు అని చెబుతున్నప్పటికీ ఇవన్నీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆర్‌ఆర్‌బీ వంటి నియామక సంస్థలు చేపట్టినవే. అంటే సాధారణంగా జరిగే నియామక ప్రక్రియలకే ప్రభుత్వం ఓ కొత్త పేరు పెట్టి తానేదో నిరుద్యోగులను ఉద్ధరిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటోంది. దేశ రక్షణలో ఎంతో కీలకమైన త్రివిధ దళాలలో శాశ్వత నియామకాలకు మంగళం పాడిన కేంద్రం, అగ్నివీర్ పేరిట నిర్దిష్ట కాలపరిమితికి లోబడిన నియామకాలకు తెరతీసి నిరుద్యోగులతో ఆటలాడుతున్న విషయం తెలిసిందే. నిజానికి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలంటూ హామీ ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ఆ తర్వాత నిరుద్యోగుల ఊసే మరిచిపోయారు. తొమ్మిది సంవత్సరాల పాటు పోస్టుల భర్తీకి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వని మోడీకి ఇప్పుడు హఠాత్తుగా నిరుద్యోగులు గుర్తుకొచ్చారు. 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రాకుండా చూసుకునేందుకే ఇప్పుడు నిరుద్యోగులకు వల విసిరారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆరు రోజ్‌గార్ మేళాలు నిర్వహించింది. 4,30,546 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించామని చెబుతోంది. అయితే 2022 మార్చి నాటికి ఖాళీగా ఉన్న పది లక్షల పోస్టులను 18 నెలలలో భర్తీ చేయాలని ప్రధాని మోడీ గత సంవత్సరం జూన్‌లో అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం అక్టోబర్ 14న తొలి రోజ్‌గార్ మేళా జరిగింది. భర్తీ చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్న పోస్టులలో 1.38,986 పోస్టులు రైల్వేలకు చెందినవి. అయినప్పటికీ ఇంకా లక్షలాది పోస్టులు ఆ శాఖలో ఖాళీగానే ఉన్నాయి. సిగలింగ్ వ్యవస్థలో తగినంత మంది సిబ్బంది లేకపోవడం, ఉన్న వారిపై ఒత్తిడి పెరగడం వల్లనే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తపాలా శాఖలో 68,225 పోస్టులు, హోం శాఖలో 43,592 పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఫైనాన్స్ సర్వీసులలో 33.743 పోస్టులు, రక్షణ రంగంలో 18,635, రెవెన్యూ శాఖలో 14,952, ఉన్నత విద్యలో 11,536 పోస్టులు భర్తీ అయ్యాయి. ఈ నియామకాలలో ఎక్కువగా గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టులకు సంబంధించినవే.