వాచాతి గాథ విచిత్రమైనది. అత్యాచార నిందితులకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించింది. న్యాయానికి అడుగడుగునా అడ్డం పడింది. అంతేగాక బాధితులను బెదిరించారు. లొంగదీసుకొనే ప్రయత్నం చేశారు. తప్పుడు కథనాలు ప్రచురించారు. అయినా సరే... బాధితులు కాని, వారికి అండగా నిలబడిన ప్రజా సంఘాలు కాని వెనకడుగు వేయలేదు. నిజాయితీ పరులైన అధికారులు, స్వార్థ చింతన లేని న్యాయవాదులు, ఆధిపత్య భావజాలం లేని న్యాయమూర్తులు, అడుగడుగున అన్ని విధాల అండగా నిలిచిన వ్యక్తులు, సంస్థలు ఈ విజయ సాధనలో భాగస్వామలయ్యారు.
రాజ్యం యొక్క పశుత్వానికి, నిరంకుశ దోపిడీకి చిహ్నం వాచాతి. ఈ నిరంకుశ దాడిని ప్రతిఘటించింది అమాయకులైన వాచాతి ప్రజలు. తమ ఆత్మగౌరవం కోసం ఎర్రజెండా అండతో పట్టుదలగా, నిజాయితీగా సాహసో పేతంగా పోరాడిన తీరును మనం అభినందించకుండా ఉండలేం. గత నెల 29వ తేదీన మాద్రాస్ హైకోర్టు 215 మంది ప్రభుత్వ (పోలీసు, రెవెన్యూ, అటవీ) ఉద్యోగులకు శిక్ష ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పు...పోరాడే శక్తులకు, అణగారిన వర్గాలకు ఉత్తేజాన్నిచ్చింది. దేశంలో మనువాద కార్పొరేట్ శక్తుల పాలనలో కోర్టులు కూడా అందుకనుగుణంగానే తీర్పులు ఇస్తున్న నేపథ్యంలో వాచాతి గ్రామ ప్రజలు సాధించిన ఈ విజయం అపురూపమైనది.
వాచాతి ఓ చిన్న ఆదివాసీ గ్రామం. తమిళనాడులోని సిథాలి కొండల్లో మైదాన ప్రాంతాలకు సుదూరంగా వుంటుంది. ''మలయాళి'' అనే ఆదివాసీ తెగ అక్కడ నివాస ముంటుంది. 1992 జూన్ 20 వాచాతి ప్రజలకు ఓ పీడకల. రాజ్యం తన బలగాలతో దాడి చేసింది. అటవీ అధికారులు, పోలీసు అధికారులు, ఐదుగురు రెవెన్యూ ఉద్యోగులు కలిసి వాచాతి ప్రజలపై విరుచుకు పడ్డారు. మూకుమ్మడిగా దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్లు ఊరి మధ్య ఉన్న రావి చెట్టు దగ్గరకు ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఇళ్ళను ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి బంగారం, డబ్బు దోచుకున్నారు. తినే ఆహార ధాన్యాలను నట్టింట పోశారు. పెట్రోల్ చల్లి తినడానికి పనికి రాకుండా చేశారు. కూల్చిన ఇళ్ళ శిథిలాల్లో కలిసిపోయాయి. పశువులను, మేకలను లారీలకు ఎక్కించుకున్నారు. తిన్నవి తినగా మిగిలినవి అమ్ముకున్నారు. కనీవినీ ఎరుగని బీభత్సాన్ని సృష్టించారు. అంతటితో ఆగలేదు.
బాధితులలో ఒకరైన జయ కోర్టుకు చెప్పిన సాక్ష్యం వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. 17 సంవత్సరాల జయ 5వ తరగతి వరకు చదువుకుంది. సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చి వంటకు సిద్ధమవుతున్న జయను జుట్టు పట్టుకొని లం...లం...డీ అంటూ బూతులతో ఊరి మధ్యకు లాక్కెళ్ళారు. అక్కడకు లాక్కురాబడ్డ జనంలో నుంచి అమ్మాయిలను ఎర్ర చందనం దుంగలు లారీలు ఎక్కించాలంటూ దూరంగా తీసుకెళ్ళారు. ఓ కుంట దరిదాపుల్లోకి తీసుకెళ్ళి ముగ్గురు వ్యక్తులు ఆమెను అత్యాచారం చేశారు. పరుగెత్తడానికి, తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 'నీలాంటి అందమైన ఫిగరు కనిపిస్తే వదులుతామా...!' అంటూ ఆటబొమ్మ మాదిరి నీచంగా ఆమెపై దాడి చేశారు. ఆమెతో పాటు మరో 17 మంది అమ్మాయిలను లారీ ఎక్కించి తాలుకా కేంద్రమైన హరూర్‌లో ఉన్న అటవీ కార్యాలయానికి తీసుకెళ్ళారు. ఓ చిన్న గదిలో పెట్టి తలుపు వేశారు. యూరిన్‌కి వెళ్ళాలని అడిగితే 'మా ముందే పొయ్యి...అన్నీ మేం చూసినవే కదా...' ఇదీ వారి తీరు. బయటకు వెళ్ళనివ్వకుండా కొట్టడం, తిట్టడంతో బట్టల్లోనే యూరిన్ పడిపోయింది. ఆ రాత్రి మరింత ఘోరానికి పాల్పడ్డారు. ఊరిపెద్ద పెరుమాళ్ పైబట్టలు లాగేశారు. లో దుస్తులతో ఆ మహిళల ముందుకు తీసుకొచ్చారు. ఆ దుస్తులను తీసేయమని అమ్మాయిలను అడిగారు. అందుకు తిరస్కరించడంతో వారిని కొట్టారు. అంతటితో ఆగక అమ్మాయిల దస్తులు లాగేయమని ఆ పెద్దను హింసించారు. అమ్మాయిలకు చీపుర్లు ఇచ్చి కొట్టించేందుకు పూనుకున్నారు.
తెల్లవారిన తర్వాత పురుగులున్న జావ తాగమని ఇచ్చారు. తాగలేమంటే బలవంతంగా తాగించేసరికి వాంతులయ్యాయి. నేల మీద రాలిన టేకు ఆకుల మీద తాము తిని పారేసిన ఎముకలతో కూడిన అన్నాన్ని వడ్డించి తినమన్నారు. రెండు రోజులు వారికి నరకాన్ని చూపించారు. మొత్తం 90 మంది మహిళలు, 20 మంది పిల్లలు, 10 మంది మగవారిని బందీలుగా తెచ్చిన అటవీ అధికారులు వారిని ఎర్రచందనం దొంగలుగా దుంగల ముందు పెట్టి ఫోటోలు తీసి జైలుకు పంపారు.
ఈ ఘోరమైన దాడిని గిరిజన సంఘం వెలుగులోకి తెచ్చింది. జులై 7న తమిళనాడు లోని గిరిజన సంఘం సిథారి కొండ జాతుల సభను నిర్వహించింది. ఆ సభలో పాల్గొన్న కొందరు గిరిజనులు వాచాతిలో జరిగిన దుర్మార్గాన్ని సభ దృష్టికి తెచ్చారు. అందులో పాల్గొన్న గిరిజన సంఘం నాయకులు బాషా, కృష్ణమూర్తి, రాష్ట్ర నాయకుడు షణ్ముగం దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాన్ని వెల్లడించారు. దానితో గిరిజన సంఘం జులై 13న హరూర్ తాలుకా కేంద్రంలో ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్‌కు మెమురాండం ఇచ్చింది. మాజీ ఎం.ఎల్.ఏ, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి రైతు, మహిళా సంఘాల బృందం జులై 14న ఆ గ్రామానికి మొదటిసారిగా వెళ్లింది. గ్రామంలో ఒక్క మనిషి కనిపించలేదు. అధికారులచేత నాశనం చేయబడ్డ ఒక్కొక్క ఇంటిని చూసుకుంటూ ఫోటోగ్రాఫర్ని తిరిగి తెచ్చుకొని ఫోటోలు తీశారు. భయపడవద్దు, సహాయం చేయడానికి వచ్చామని చెప్పగా చెట్ల చాటు నుంచి ముందుకు వచ్చింది ఓ యువతి. ఆ అమ్మాయి పేరు సాలా. ప్రజా సంఘాల బృందం వచ్చిన కారుకి ఉన్న ఎర్రజెండాను చూసిన సాలా వారి దగ్గరకు రావడానికి సాహసించింది. ఆ తర్వాత అడవిలో దాక్కున్న 49 మంది చిన్నగా వారి ముందుకు వచ్చారు. ముందురోజు గిరిజన సంఘం నిర్వహించిన ప్రదర్శన చూసిన, ఉపన్యాసాలు విన్న సాలా ఇతర గిరజనులకు నమ్మకాన్నిచ్చింది. పైగా మాజీ ఎమ్మెల్యే అన్నామలైని కూడా వారెరుగుదురు.
వారు చెప్పిన విషయాలు, కళ్ళెదుట కనిపిస్తున్న ఘోరాలు మాటలతో చెప్పగలిగేలా లేవు. అధికారుల దుశ్చర్యలు చూసిన నాయకత్వం చలించిపోయింది. ఇంతటి ఘోరానికి పాల్పడిన వారిని వదిలి పెట్టకూడదని, వాచాతి ప్రజలకు న్యాయం కోసం తుది దాకా పోరాడాలని నిర్ణయించుకుంది.
సేలం జైలుకెళ్ళి మహిళలతో మాట్లాడారు. ఆ తర్వాత వారు కలెక్టరుని కలిసి జరిగిన ఘోరాలను వివరించారు. 'మీరు పిటిషన్ ఇచ్చాకే నాకు తెల్సింద'న్నారు కలెక్టరు (అది అవాస్తవమని తర్వాత రుజువైంది). న్యాయం చేస్తామని నమ్మబలికారు. కాని ఎటువంటి చర్యా తీసుకోలేదు. అప్పుడు గిరిజన సంఘం, సిపిఎం ప్రతినిధులు ముఖ్యమంత్రికి పిటిషన్ ఇచ్చారు. పత్రికలకిచ్చారు. ఒక్క 'తికధీర్' పత్రిక తప్ప ఈ వార్తను ఇతర పత్రికలేవీ ప్రచురించనే లేదు.
ముఖ్యమంత్రి, అధికారులందరూ ఇది తప్పుడు కథనమని తోసి పారేశారు. జులై 22న గిరిజన సంఘం ఆధ్వర్యంలో 1000 మంది ప్రజలతో హరూర్‌లో ఓ పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. జులై 28న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నల్లశివం, వరదరాజన్, పాపా ఉమానాథ్, ఇతర ప్రజా సంఘాల నాయకులందరూ ఆ గ్రామం సందర్శించారు. ఆ తర్వాత జిల్లా కేంద్రం ధర్మపురిలో కూడా పెద్ద సభ నిర్వహించారు. న్యాయ విచారణ చేయాలన్న ప్రజాసంఘాల డిమాండ్‌ను ఎఐడిఎంకె ప్రభుత్వం పట్టించుకోలేదు. గిరిజన సంఘం తరపున షణ్ముగం ఒక ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టులో ఫైల్ చేశారు. దీనిని స్వీకరించిన మొదటి మహిళా న్యాయమూర్తి ''విద్యావంతులైన ఉన్నతోద్యోగులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటే నమ్మలేమ''ని పిల్‌ను కొట్టేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నల్లశివం సెప్టెంబర్ 3న సుప్రీంకోర్టులో పిల్ ఫైల్ చేశారు. పార్లమెంట్‌లో లేవనెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు చేశారు. హరూర్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేశారు షణ్ముగం.
ఐద్వా నాయకులు మైథిలీ శివరామన్ ఎస్సీ, ఎస్టీ కమిషనర్ భామతికి పిటిషన్ ఇచ్చాక ఆమె వాచాతి గ్రామాన్ని సందర్శించారు. ప్రజాసంఘాలు వెలుగులోకి తెచ్చిన అన్ని విషయాలు వాస్తవాలేనని నిర్ధారించుకొని రిపోర్టు ఇచ్చారు. ఆ తర్వాతనే మద్రాస్ హైకోర్టు డిసెంబర్ 11న ఎంక్వైరీ కమిటీ వేసింది. కోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, మంచినీళ్ళు, ధ్వంసం చేసిన రేషన్ కార్డులు, రవాణా సదుపాయాలను పునరుద్ధరించింది.
ఆ తర్వాత సిబిఐ విచారణకు కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పును రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది. అన్ని ఆటంకాలను అధిగమించి విచారణ ప్రారంభించింది సిబిఐ. నిందితుల గుర్తింపు కోసం ఏర్పాట్లు చేయమని కోరితే మంత్రులు ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని నిలిపి వేయించారు. తిరిగి కోర్టుని ఆశ్రయించారు. చివరకు అక్టోబర్ 9న నిందితుల గుర్తింపు కార్యక్రమం జరిగింది. 11 మంది నేరస్తులను బాధిత మహిళలు గుర్తించారు. 'ఎవరైతే ఈ హీనమైన పనులు చేశారో వారిని మాత్రమే బాధితలు చూపించారు. ఆదివాసీలు, వారికి మద్దతుగా నిల్చిన కమ్యూనిస్టులు నిజాయితీ కల్గిన వారు. కక్షపూరితంగా వ్యవహరించలేద'ని డిపార్టుమెంట్‌లో నిజాయితీ కల్గిన అధికారులు కొంతమంది పేర్కొన్నారు. 1996 ఏప్రిల్ 23న సిబిఐ చార్జిషీటు దాఖలు చేసింది. నిందితులను అరెస్ట్ చేశారు. ఎఐడిఎంకె స్థానంలో అధికారంలోకి వచ్చిన డిఎంకె ముఖ్యమంత్రి కరుణానిధి... కోర్టు ఆదేశాలతో నిమిత్తం లేకుండా నిందితులను జైలు నుంచి విడుదల చేయించారు.
పదే పదే ప్రజలను సమీకరించడం, జరిగిన అన్యాయాన్ని, ప్రభుత్వ ధోరణులను విస్తృతంగా ప్రచారం చేస్తూనే ప్రతి అంశానికి రిటన్ పిటిషన్లు వేస్తుండడంతో 2011న కోర్టు తీర్పు వెలువడింది.
అది ఒక చారిత్రాత్మక తీర్పు. 215 మంది ప్రభుత్వ ఉద్యోగులను నిందితులుగా గుర్తించి శిక్షించాల్సిందిగా పేర్కొంటూ ఇచ్చిన తీర్పు. అయితే ఆ తీర్పు అమలు జరగలేదు. చివరికి 2023 సెప్టెంబర్ 29న హైకోర్టు తుది తీర్పు ప్రకటించింది.
వాచాతి గాథ విచిత్రమైనది. అత్యాచార నిందితులకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించింది. న్యాయానికి అడుగడుగునా అడ్డం పడింది. అంతేగాక బాధితులను బెదిరించారు. లొంగదీసుకొనే ప్రయత్నం చేశారు. తప్పుడు కథనాలు ప్రచురించారు.
అయినా సరే... బాధితులు కాని, వారికి అండగా నిలబడిన ప్రజా సంఘాలు కాని వెనకడుగు వేయలేదు. నిజాయితీ పరులైన అధికారులు, స్వార్థ చింతన లేని న్యాయవాదులు, ఆధిపత్య భావజాలం లేని న్యాయమూర్తులు, అడుగడుగున అన్ని విధాల అండగా నిలిచిన వ్యక్తులు, సంస్థలు ఈ విజయ సాధనలో భాగస్వామలయ్యారు.
అడవి బిడ్డలను అడవికి దూరం చేసే చట్టాల దుర్మార్గానికి ఈ తీర్పు చెంప పెట్టు. స్మగ్లర్లు, దొంగలకు అండగా వుంటూ సామాన్యులను, అమాయకులను బలి చేసే రాజ్యానికి ఇది ఓ హెచ్చరిక.
షణ్ముగం ఈ పోరాటంలో చివరికంటా నిలబడిన నేత. ఆనాడు వాచాతికి వెళ్ళాలంటే వారి చేతిలో ఉన్నది 10 రూపాయలు మాత్రమే. ప్రజల సహకారంతోనే ఇంతటి సుదీర్ఘ పోరాటానికి నిధులు సేకరించగల్గారు. బాధితులకు బెయిల్ తెప్పించడం నుండి వారి జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి అవసరమైన ప్రతిదీ ప్రజల సహకారంతోనే సాధ్యమైంది.
శత్రువుల మిత్రులను కూడగట్టడం కూడా పోరాటం నుంచే నేర్చుకున్నారు వాచాతి ప్రజలు. ఓ ఎస్సీ, ఎస్టీ కమిషనర్ సభ్యురాలితో సహా.... కొందరు సిబిఐ అధికారులు, పోలీసు, జైలు అధికారులు న్యాయం కోసం తమ వంతు సహకరించారు. పోరాటంతో సాధించిన విజయం ఇది. భన్వారీ కేసు, కీలన్వేణి, వాకపల్లి, కారంచేడు, చుండూరు లాంటి కేసులు ఎన్నో ఈ వ్యవస్థలో వెలుగులోకి వచ్చాయి. పోరాటాలు సాగాయి. పాక్షిక విజయాలు సాధించాము. కానీ, వాచాతి కేసు ఓ సంపూర్ణ విజయాన్ని అందించిన ప్రజల గాధ. పోరాట గాధ. నేడు ఆధిపత్య శక్తులను ఎదిరిస్తున్న వారికి వాచాతి విజయం ఆత్మవిశ్వాసాన్నిస్తుంది.
/ వ్యాసకర్త ఐద్వా రాష్ట్ర కార్యదర్శి /
డి. రమాదేవి