ఎండ భగభగా మండుతోంది. చెట్టన్నీ ఎండిపోతున్నాయి. అప్పుడు దారి పక్కన ఉన్న మామిడి చెట్టు, వేపచెట్టుతో ఇలా ఆవేదనగా చెప్పుకొచ్చింది..
ఈ మనుషులకు దయ అనేది లేదు. అప్పటి ప్రజలైతే మనం ఎండిపోకుండా నీరు పోసేవారు. ఇప్పటి ప్రజలు అలా కాదు. మనల్ని నరికేసి, వాళ్ళ అవసరాలకు వాడుకుంటారేగానీ మన పట్ల జాలి, దయ లేదు. మనల్ని నాటడానికి ఇష్టపడరు. మనల్ని రంపాలతో, గొడ్డళ్ళతో నరికిపారేస్తారు. మనల్ని నరికివేసేటప్పుడు మనకెంత బాధ ఉంటుందో మనుషులకేం తెలుసు? అదే ఈ మనుషులకు ఏదైనా బాధ వస్తే ఎంత బాధపడతారు? అలాగే మనకూ బాధ కలుగుతుంది కదా..! వీరికెందుకు అర్థం కాదు? ఎవరైనా మనల్ని నరుకుతుంటే ఎందుకు నరుకుతున్నావు అని అడగడానికి మనకు నోరు లేదు కదా! ఎవరైనా మనల్ని విరిచేస్తే ఎందుకు మమ్మల్ని విరిచేస్తావు అని అడగలేము. ఇలా చేయకూడదు, ఇది తప్పు అని మనుషులు ఎప్పుడు తెలుసుకుంటారు? కానీ కొందరు మాత్రం మనకు నీరు పోసి, నరకకుండా కాపాడుతున్నారు. వారికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. పచ్చగా ఉండి నీడనిస్తే, ఊళ్లో మనుషులందరూ మన నీడ కింద కూర్చుని మాటలు చెప్పుకుంటారు. మన కింద పిల్లలు కూడా ఆడుకుంటారు. ఇప్పుడు మనం ఎండిపోతే ఎవరూ రావడం లేదు. పచ్చగా ఉన్నప్పుడు మన కొమ్మల మీద పక్షులు గూళ్ళు కట్టుకునేవి. మన విలువ ఈ మనుషులకు ఎప్పుడు తెలుస్తుందో.. ఏమో..!
సందేశం : మనిషికొక చెట్టు నాటుదాం. జీవకోటికి ప్రాణదాతలవుదాం.
ఎం. సౌందర్య, 7వ తరగతి, జెడ్‌పిహెచ్‌ఎస్
శాంతిపురం, చిత్తూరు జిల్లా