Sep 28,2023 15:48

మథుర : ఉత్తరప్రదేశ్‌లో మథుర రైల్వే స్టేషన్‌లో ఓ ప్యాసింజర్‌ రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకొచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అయితే తాజాగా ఈ ఘటనకు గల కారణాలు వెలుగోకి వచ్చాయి. రైల్వేలో సహాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది. దీంతో మొత్తంగా ఐదుగురిని రైల్వే అధికారులు సస్పెండ్‌ చేశారు. ఇక, ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. ఇక, ఈ ఘటన తర్వాత విచారణ చేపట్టిన అధికారులు.. సచిన్‌కు నిర్వహించిన బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో 47 ఎంజీ/100 ఎంఎల్‌ రీడింగ్‌లో అతను మద్యం సేవించినట్లు తేలిందని నివేదిక పేర్కొంది. అతనిని వైద్య పరీక్షల కోసం పంపామని అక్కడ మద్యం సేవించిన ఖచ్చితమైన స్థాయిని తెలుసుకోవడానికి అతని రక్త నమూనాను తీసుకుంటామని ఆగ్రా రైల్వే డివిజన్‌ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి సచిన్‌ సహా ఐదుగురిని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ తేజ్‌ప్రకాష్‌ అగర్వాల్‌ సస్పెండ్‌ చేశారు. ఆ నలుగురిలో హర్భజన్‌ సింగ్‌, బ్రజేష్‌ కుమార్‌, కుల్జీత్‌ సాంకేతిక సిబ్బంది కాగా గోవింద్‌ హరి శర్మ లోకో పైలట్‌.