Oct 14,2022 07:00

గాంబియాలో 69 మంది పిల్లల మరణానికి భారత్‌లో తయారైన దగ్గు సిరప్‌లు కారణమని తేలడం మన దేశ ప్రతిష్టకు మాయని మచ్చ. హర్యానా లోని మెయిడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ స్వార్ధానికి, భారత, హర్యానా ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యానికీ ముక్కుపచ్చలారని పసివారు బలి కావడం అత్యంత విషాదకరం. పలువురు చిన్నారుల్లో కిడ్నీలు దెబ్బతినడానికి ప్రొమెథాజైన్‌ ఓరల్‌ సొల్యూషన్‌, కొఫెక్స్‌మలిన్‌ బేబీ కాఫ్‌ సిరప్‌, మాకోఫ్‌ బేబీ కాఫ్‌ సిరప్‌, మాగ్రిప్‌ ఎన్‌ కోల్డ్‌ సిరప్‌లు కారణమని, ఈ మందుల సరఫరా, వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని అన్ని దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) అప్రమత్తం చేసింది. పిల్లల మృతికి ఆ దగ్గు మందే కారణమని డబ్ల్యుహెచ్‌ఓ నిగ్గు తేల్చాకనే భారత ప్రభుత్వం, హర్యానా సర్కారు హడావుడి చేశాయి తప్ప అంతకుముందు మందుల నాణ్యత, ఫార్మా కంపెనీల్లో ప్రమాణాల పాటింపు విషయమై అవసరమైన తనిఖీలు చేయడంలేదని తేటతెల్లమవుతోంది. సోనెపట్‌ లోని సిరప్‌ తయారీ కేంద్రంలో తనిఖీలు చేపట్టిన అధికారులు ఆ సంస్థ 12 నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఉత్పత్తిని నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. డబ్ల్యుహెచ్‌ఒ అభ్యంతరం వ్యక్తం చేసిన ఈ ఔషధాలను పరీక్ష నిమిత్తం కోల్‌కతాలోని సెంట్రల్‌ డ్రగ్‌ ల్యాబ్‌కు పంపించామని, వివరాలు రావాల్సి ఉందనిని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. పోస్టుమార్టం వ్యవహారం షరా మామూలే !
        మెయిడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ తయారుచేసిన మందులలో ప్రమాదకర పదార్థాలున్నాయని గతంలో కేరళ, గుజరాత్‌ తదితర రాష్ట్రాలు ఫిర్యాదు చేెశాయి. నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్లు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వియత్నాం ప్రభుత్వం 2011లోనే ఈ కంపెనీపై నిషేధం విధించిందంటే అంతర్జాతీయంగానూ ఆ సంస్థ దుష్ట చరిత్ర స్పష్టమవుతోంది. అయితే గాంబియా పోలీసుల దర్యాప్తు అనంతరం వెలువరించిన ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ సిరప్‌లు అమెరికాకు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ద్వారా ఆ దేశంలోకి దిగుమతి అయ్యాయని తేలింది. కాబట్టి ఈ దారుణం వెనుక అమెరికన్‌ కంపెనీల లాభాపేక్ష కూడా ఉంది. అలాగే ఏదైనా అంతర్జాతీయ రాకెట్‌ కూడా ఉండవచ్చు. ఆఫ్రికా ఖండానికి ఎగుమతి చేసే మందుల నాణ్యత తక్కువగా ఉంటుందని సాధారణంగా చెబుతుంటారు. ఆ దేశాల్లోని డ్రగ్‌ కంట్రోలర్‌ వ్యవస్థ అంత పటిష్టంగా ఉండదనీ, ఏవైనా లోపాలు వెల్లడైనా పేద నిరుపేద దేశాలు కాబట్టి అంత గట్టిగా నిలెయ్యలేవనీ మోసకారి కంపెనీల భావన. ప్రాణాలు నిలబెట్టాల్సిన మందులను కేవలం లాభాల కోసం ప్రజల ప్రాణాలు తీసేలా తయారుచేయడం రాక్షసత్వమే !
            ఇంత తీవ్రమైన రీతిలో భారత ఫార్మా పరిశ్రమ ఒక విదేశంలో బోనులో నిలబడాల్సిన పరిస్థితి బహుశ ఇదే తొలిసారి అని నిపుణులు అంటున్నారు. ప్రపంచంలో మందుల పరిమాణం రీత్యా మూడవ స్థానంలోనూ, విలువ రూపంలో 14వ స్థానంలో భారత ఫార్మా పరిశ్రమ ఉంది. ఏటా నాలుగు వేల కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తి, వాణిజ్యం మన ఫార్మా రంగానిది. ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారు భారత దేశమే! జిడిపి పెరుగుదల ఆరు-ఏడు శాతం వున్నా ఫార్మా రంగ వార్షిక వృద్ధి రేటు 10-11 శాతం ఉంటోందంటే దేశంలో ఉపాధి కల్పనలోనూ, ఎగుమతులతో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలోనూ ఆ రంగానిది కీలక పాత్ర. కాబట్టి అటు ప్రజల ఆరోగ్య రక్షణకు, ఇటు ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటుగానూ, మరోవైపు అంతర్జాతీయ ప్రఖ్యాతికీ ఆలవాలంగావున్న ఫార్మా రంగం పట్ల మోడీ సర్కారు పర్యవేక్షణ వ్యవస్థల పనితీరు సరిగా లేదని విదితమవుతోంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ర్యాంకులు రావాలంటే వివిధ ప్రభుత్వ శాఖల అధికార్లు ఆకస్మిక తనిఖీలు చేయరాదన్న ప్రపంచ బ్యాంకు హుకుం ను తు.చ. తప్పక పాటించాలని ఆదేశించడంతో నిజాయితీపరులైన వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మందుల తయారీలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించేలా కేంద్రం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు సకల చర్యలూ చేపట్టాలి. భారతీయ చట్టాలు, నిబంధనలు ఎంతో ప్రామాణికమైనవని పేరుంది. వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడం ప్రభుత్వాల బాధ్యత.