
'కస్తూరి రంగ రంగా... నాయన్న కావేటి రంగ రంగా..' పదాలు పాడుకుంటూ పనులు చేసుకుంటుంది పేదరాసి పెద్దమ్మ. పేరుకు పేదరాసి కానీ అతిథులకు అన్నపూర్ణ. ఏ వేళప్పుడు ఎంతమంది వచ్చినా లేదనకుండా కమ్మగా కడుపునిండా తిండి పెడుతుంది. ఎవరైనా డబ్బులు ఇవ్వ జూపినా.. 'అన్నాన్ని అమ్ముకుంటావట్రా వెర్రి నాగన్నలారా' అని నవ్వుతూ పంపేస్తుంది. కాదని బలవంతపెడితే మళ్లీ వచ్చేటప్పుడు కాయో కసరో తెమ్మంటుంది.
ఓ రోజు దొడ్లోకి ఒంటెద్దు బండి వచ్చి ఆగింది. నడి వయస్కుడు ఇద్దరు పిల్లలు, చూలాలి భార్యతో సహా బండిలో నుంచి దిగాడు. వస్తూనే నాలుగు మూటల వెచ్చాలు తెచ్చాడు. 'పెద్దమ్మా! పసిపిల్లలు ఆకలితో ఉన్నారు. నోట్లోకి నాలుగు వేళ్లూ పంపమ్మా.'' అన్నాడు చేతులు జోడించి. 'ఓరోరి వెర్రినాగన్నా.. ఇంతోటి దానికి సరుకులు తీసుకురావాలట్రా? క్షణంలో వడ్డిస్తాను, ఇలా వచ్చి కూర్చోమను' అని సావిట్లో ఈతాకుల చాప పరిచింది.
తల్లీ పిల్లలు వచ్చి సాగోరే లోగా మట్టి ముంతలతో దబ్బాకు వేసిన చల్లని తరవాణీ అందించింది. 'పెరట్లో ఆనపకాయ, బచ్చలాకులు కోసుకురా నాన్నా..' అని పంపింది పెద్దమ్మ. తండ్రి వెనకాలే పిల్లలూ పరిగెత్తారు.
పెరట్లోకి వెళ్లిన పిల్లలు 'పెద్దమ్మా..పెద్దమ్మా' అని అరుచుకుంటూ వచ్చారు. 'ఏమైందర్రా! మీ నాన్నకు, మీక్కూడా పెద్దమ్మనేనా భడవల్లారా!' అంది నవ్వుతూ..
'మరే..మరే అక్కడ...అక్కడ..'
'ఏమైందర్రా..?'
'పెద్ద పంది వచ్చింది పెద్దమ్మా! మొక్కల చుట్టూ ఉన్న జాగాని ముట్టెతో దున్నేస్తోంది పెద్దమ్మా.' అన్నారు ఇద్దరూ ఒకేసారి.
'అదా' అంది నవ్వేస్తూ..
'దాని ఒళ్లంతా.. కాళ్లంతా.. బురద యాక్' అంది చిన్నది.
ఆనపకాయ తరుగుతూ చెప్పడం మొదలుపెట్టింది పెద్దమ్మ. 'ఒకప్పుడు పందులు, కుక్కలు అడవుల్లోనే ఉండేవి. మిగతా జంతువులతో పోటీపడి ఆహారం సంపాదించుకోవడంలో వెనకబడిపోయేవి. ఓ మారు అడవిలోకి కట్టెలు కొట్టుకోవడానికి ఒక మనిషి వెళ్లాడు. మధ్యాహ్నం తినగా మిగిలింది పడేశాడు. దాన్ని కుక్క, పంది రుచి చూశాయి. మనిషి దగ్గరుంటే రుచికరమైన ఆహారం తినొచ్చని అనుకున్నాయి. కట్టెలమోపుతో వెళ్తున్న మనిషిని వెంబడించాయి. ఇది గమనించి, బింకంగా ''ఎందుకు వస్తున్నారని?'' ప్రశ్నించాడు.
''అడవిలో ఆహారానికి కష్టంగా ఉంది. నీ దగ్గరే ఉంటూ నువ్వు చెప్పిన పని చేస్తాము. మాకు తిండి పెట్టు'' అని అడిగాయి.. ''సరే''నన్నాడు మనిషి.
మర్నాడు వాటిని పొలానికి తీసుకెళ్లాడు. పగలంతా పొలం దున్ని వస్తే సాయంత్రం వాటికి తిండి పెడతానన్నాడు. ''సరే'' నని పంది, కుక్క పొలాల్లోకి దిగాయి. పంది ఒక పక్క నుంచి పద్ధతిగా నేలను దున్నుకుంటూ వస్తోంది. కుక్క మొత్తం పొలామంతా ఒకసారి కలయ తిరిగేసింది. అతడు గొడ్డలి భుజానేేసుకుని, అడవికి వెళ్లిపోగానే.. కుక్క చెట్టునీడన నిద్రపోయింది. పంది పని చేసుకుపోతూనే ఉంది. సాయంత్రానికి దున్నడం పూర్తయింది. పొలాన్ని తృప్తిగా చూసుకుని, స్నానానికి వెళ్లింది. అప్పుడే లేచిన కుక్క. మళ్ళా పొలమంతా కలయ తిరిగి, ఒళ్లు.. కాళు..్ల బురదమయమయ్యాయి. మనిషి తిరిగొచ్చేసరికి రొప్పుతూ నిలబడింది కుక్క. ఒంటికి పట్టిన మురికంతా వదుల్చుకుని శుభ్రంగా కనపడింది పంది. పొలంలో చూసిన మనిషికి ఎక్కడ చూసినా కుక్క కాలి గుర్తులే. అప్పటి వరకూ పనిచేస్తున్నట్లు వగరుస్తూ ఉంది కుక్క. పైగా పొద్దున్న తాను వెళ్లేటప్పుడు ఎంత శుభ్రంగా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది పంది. కాబట్టి కుక్కే పని చేసింది, పంది పని చేయలేదని అనుకున్నాడు. కుక్కను ప్రేమగా ఇంటికి తీసుకెళ్లాడు. తన చేతులతో ఒళ్లంతా కడిగి, గిన్నెలో అన్నం పెట్టాడు. పొద్దున్న నుంచి పనిచేసి అలసిపోయిన పందికి చాలా బాధగా అనిపించింది. పైగా బయటకు తరిమేశాడు.. అదిగో అప్పటి నుంచి మురికిగా ఉంటే కడుగుతాడని బురదలో పొర్లుతోంది. తానే పొలమంతా దున్నానని నిరూపించుకోడానికి ఇలా పెరళ్లలోకి వచ్చి మొక్కల చుట్టూ దున్నుతుంది. కానీ పాపం మనిషి ఇప్పటికీ పందిని నమ్మలేదు.'
'అదర్రా కథ!' అని ముగించింది పెద్దమ్మ.
'పెద్దమ్మా.. కథ బాగుంది. భోజనం ఇంకా బాగుంది' అన్నారు తండ్రి, తల్లీ, పిల్లలు, చేతులు కడుక్కుంటూ.
కాశీవిశ్వనాథం పట్రాయుడు
9494524445