
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక భారీ బహిరంగ సభలో హిందీలో చెప్పిన కథ...నా తెలుగు పాఠకులకు అందిస్తున్నాను. అది ఇలా సాగుతుంది... ''ఎవడో రాజుగారికి చెప్పాడు. దేశంలోని నోట్లు రద్దు చేరు. దేశంలో లంచగొండితనం, తీవ్రవాదం లేకుండా పోతారు అని. అంతే, ఒక రోజు సాయంత్రం రాజు గారు టి.వి లోకి వచ్చి నోట్లు రద్దు చేస్తున్నానని ప్రకటించాడు. ఏమయ్యిందీ? బ్యాంకుల ముందు పెద్ద పెద్ద క్యూలు కనిపించాయి. క్యూలలో ఎంతో మంది చచ్చిపోయారు. చిన్నా, చితక వ్యాపారాలన్నీ మూలపడ్డాయి. మరొకనాడు మరొకరెవరో వచ్చి రెండు వేల రూపాయల నోట్లు తీసుకురా అని చెప్పాడు. రాజుగారు తీసుకొచ్చారు. నాలుగేళ్ళ తర్వాత కొందరెవరో రెండు వేల నోట్లు రద్దు చేయమని అడిగారు. రాజు గారు అలాగే చేశారు. రాజు గారికి తెలివి లేదు. చదువు లేదు. ఎవడో వచ్చి చెప్పాడు. రైతుల బతుకులు తెల్లగా చేయడానికి నల్లచట్టాలు తెమ్మని. అవివేకపు రాజుకు ఆలోచించే శక్తి లేదు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చాడు. దేశంలోని రైతులందరూ రోడ్లమీదకొచ్చి ఆందోళనలు చేశారు. బుద్దిహీనుడైన రాజు నిర్ణయంతో 750 మంది రైతులు మరణించారు. ఒక సంవత్సరం తర్వాత రాజు తన మూర్ఖత్వం పక్కనపెట్టి, విధిలేక రైతు చట్టాలు రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
రాజు తన మిత్రులను బాగా చూసుకునేవాడు. రాజు స్నేహితుడొకరు రూ. పది వేల కోట్లు దొంగతనం చేశాడు. రాజు అతణ్ణి విదేశాలకు పంపి రక్షించుకున్నాడు. రాజుగారికి మరొక ప్రియ మిత్రుడున్నాడు. రాజుగారు మొత్తం విమానాశ్రయాలను అతనికి అమ్మేశాడు. నౌకలు, పోర్టులూ అమ్మేశాడు. రాజుగారికి మరో ప్రియమైన ఫ్రెండున్నాడు. అతను అంతర్జాతీయ క్రీడారంగంలో ఎన్నో పతకాలు గెల్చుకుని వచ్చిన, మహిళా క్రీడాకారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. రాజు అతణ్ణి చట్టానికి అప్పగించాల్సింది. కానీ, మహిళల్ని అవమాన పరిచిన మిత్రుడి గూర్చి ఒక్కమాట మాట్లాడలేదు.
ఆరో తరగతి చదివిన అహంకారి రాజు కథ ఇది! ఈ సువిశాల దేశంలోని ఒక మారుమూల గ్రామంలో ఓ రోజు ఓ పిల్లవాడు పుట్టాడు. జ్యోతిషుడొకడు చెప్పాడు తిమ్మిని బమ్మి చేసి ఎలాగైనా వీడు చాలా పెద్దవాడైపోతాడని! వాడికి చదువు మీద ధ్యాస ఉండేది కాదు. ఆరో తరగతిలో ఉండగా పాఠశాల రిజిస్టర్‌లో అతని పేరు కొట్టేశారు. అయితే ఊరికి కూతవేటు దూరంలో ఒక రైల్వేస్టేషన్ ఉండేది. ఈ పిల్లవాడు ఆ స్టేషన్‌లో చారు అమ్ముతుండేవాడు. ఎలాగైతేనేం ఆ పిల్లవాడు ఆ దేశానికి సమ్రాట్ అయిపోయాడు. రాజు చదువుకోలేదన్న విషయం మెల్లమెల్లగా దేశమంతా తెలిసిపోయింది. రాజుగారు నొచ్చుకున్నారు. వెంటనే ఓ యం.ఎ. డిగ్రీ సృష్టించుకున్నారు. యం.ఎ. డిగ్రీ అబద్దపుదని-ఎవరికీ తెలియగూడదనుకున్నాడు. ఎన్ని విషయాలు రహస్యంగా ఉంచుదామనుకున్నా అన్నీ దేశ ప్రజల్లో చర్చనీయాంశాలైపోయాయి.
ఒకసారి దేశంలో ఒక మహమ్మారి ప్రవేశించింది. ఫలితంగా జనం ఎక్కడికక్కడ చచ్చిపోతున్నారు. ఒకడెవడో వచ్చి సాయంత్రం వేళ చప్పట్లు చరిపించమని, ప్లేట్లు మోగించమని సలహా ఇచ్చాడు. రాజుగారు టి.వి లో కనపడి దేశ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఆ చప్పళ్ళు మహమ్మారి వినిపించుకోలేదు. పైగా దేశం విడిచిపోలేదు. డాక్టర్ల అవసరం, మందుల అవసరం, ఇంజక్షన్ల అవసరం, వ్యాక్సిన్ల అవసరం ఉంటుందని దేశ ప్రజలకు తోచింది. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నారు. దేశంలో జరుగుతున్న అన్యాయాల గూర్చి రాసిన రచయితలను, జర్నలిస్టులను, హేతువాదులను వెతికి వెతికి పట్టుకుని చంపించాడు. లేదా జైళ్ళలో వేశాడు. రాజుగారికి లేదా ఆయన సహచరులకు వ్యతిరేకంగా తీర్పులు చెప్పిన జడ్జిల్ని చంపించేవాడు. లేదా రాజ్యసభ సీట్లిచ్చి నోరు మూయించేవాడు.
ఓ రోజు భోరున వర్షం కురిసింది. ప్రకృతి విలయతాండవం చేసింది. అందులో ఆకాశవాణి పలికింది... ఇంత గొప్ప దేశంలో ఉన్న ప్రజలారా! మీరు రాజు గారి లాగా చదువురాని వారు కాదు. తెలివీ, వివేకం లేనివారు కాదు. ఎందుకు ఉపేక్షిస్తున్నారూ? మీరంతా వివేకవంతులు. అహంకారి రాజును దింపేయండి! అంది. అంతే!! ప్రజలు మేల్కొన్నారు. తిరగబడ్డారు. ఐకమత్యంతో రాజును ఎదిరించారు. రాజు దిగిపోయాడు. ఉత్తుత్తి 'అచ్ఛే దిన్' కాదు, నిజంగానే మంచి రోజులొచ్చాయి!''
***
భారత ప్రధాని ఇటీవలి అమెరికా పర్యటనను నిరసిస్తూ వాషింగ్టన్ డి.సి రోడ్ల మీద పెద్ద ఎత్తున పలు నిరసన కార్యక్రమాలు జరిగాయి. అందులో అమెరికా అధ్యక్ష భవనం సమీపంలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో భారత జర్నలిస్ట్ నిరంజన్ టక్లే ఉపన్యాసం ఇలా సాగింది... ''నేను ఇండియాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా 25 ఏళ్ళకు పైగా పనిచేశాను. నా చివరి ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ఒక జడ్జి-జస్టిస్ లోయా ఎలా హత్య చేయబడ్డాడూ? అనేది. ఆ విషయం ఎందుకు చెపుతున్నానంటే, ఇండియాలో జర్నలిజం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మీరు అర్థం చేసుకుంటారని! అది 2017లో ఇండియాలో అతి పెద్ద సంచలనాత్మకమైన కథనం! నేను ఇప్పుడు ఈ సమావేశానికి ఎందుకొచ్చానంటే... అమెరికా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని, మానవ హక్కుల్ని పరిరక్షిస్తుందని, ప్రెస్‌కు, మీడియాకు పూర్తి స్వేచ్ఛనిస్తుందనీ విన్నాను. మరి వీటన్నిటినీ తొక్కిపెట్టి దుర్మార్గ పాలనను అందిస్తున్న భారత ప్రధానికి అమెరికా ప్రభుత్వం ఎందుకు స్వాగతం పలుకుతోందో మీ అందరికీ అర్థం కానట్టే, నాకూ అర్థం కావడం లేదు. 2002లో, గుజరాత్‌లో జరిగిన మారణకాండకు కారకుడు నరేంద్ర మోడీ. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఒకటిన్నర నెలలుగా మణిపూర్‌లో మానవహననం జరుగుతోంది. జాతుల మధ్య విద్వేషాలు చెలరేగిపోయి మనుషులు హత్య చేయబడుతున్నారు. ఇళ్ళూ, వాకిళ్ళూ కాలిపోయి అనాథలై ప్రజలు రోడ్డున పడుతున్నారు. అయినా భారత ప్రధాని దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడడు. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న వాస్తవాలు తెలుసుకుంటే ఎవరూ హర్షించరు. అలాంటిది, అమెరికా ప్రభుత్వం స్వాగతించడం, ఆయనగారు యు.ఎస్. కాంగ్రెస్ జాయింట్ సెషన్‌లో ఉపన్యసించడం అవసరమా? ఆయనకు ఎలాగూ సిగ్గులేదు. ఆహ్వానం పలుకుతున్న అమెరికా ప్రభుత్వానికైనా ఉండాలి కదా ?
ఇదిగో చూడండి. జడ్జి హత్య గురించి నేను రాసిన పుస్తకం ఇదే (హు కిల్డ్ జడ్జ్ లోయా). ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్‌షా ఒక నేరస్థుడు-అని తీర్పు చెప్పిన సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జిని నిర్దాక్షిణ్యంగా అమిత్ షా చంపించాడు. ఆ తరువాత 15 రోజులకు వచ్చిన కొత్త జడ్జి తీర్పుకు సంబంధించిన ఒక్క పేపరు కూడా చూడకుండా అమిత్ షా నిర్దోషి అని తీర్పు ఇచ్చాడు. ఇండియాలో న్యాయ వ్యవస్థ ఎలా పని చేస్తోందో ఎత్తి చూపడానికే అన్ని వివరాలు సేకరించి నేను ఈ పుస్తకం రాశాను. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. స్వేచ్ఛకు, మానవ హక్కులకూ వ్యతిరేకం.
వివేచన లేని ఒకానొక మనిషి నా దేశానికి ప్రధానిగా ఉన్నాడని ఇక్కడ వాషింగ్టన్ డి.సి.లో వైట్‌హౌస్ దగ్గరలో నిలబడి చెప్పుకోవడానికి నేను సిగ్గు పడుతున్నాను. నేను తిరిగి ఇండియాకు వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాక ఏమవుతుందో నాకైతే తెలియదు. కానీ, పోరాడడానికి సిద్ధపడే మళ్ళీ నేను నా దేశానికి వెళతాను. భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి మానవీయ విలువల్ని పరిరక్షించుకోవడానికి భారతీయులంతా ఏకం కాక తప్పదు-చదువు, నైతికత, క్రమశిక్షణ ప్రపంచ జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఏవీ లేని ఈ ప్రస్తుత పాలకుల్ని దింపేసే వరకు భారతీయులెవరూ నిద్రపోరు. అనునిత్యం పోరు సల్పుతూనే ఉంటారు - జైహింద్!'' అని ముగించారు నిరంజన్ టక్లే !
రోఫెల్‌గాంధీ పేరుతో సోషల్ మీడియాలో వచ్చిన ఒక కవితా చరణం ఈ విధంగా ఉంది...''డిగ్రీ న పూఛో ఫకీర్‌కి / కరియే బస్ గుణోంక జాప్ / చర్చా కరే ఎగ్జామ్ కి / చాహే ఖుద్ రహే అంగూఠా ఛాప్'' (దేశ ప్రధాని మణిపూర్ అల్లర్ల విషయంలో పార్లమెంట్‌కు ముఖం చాటేసి, పూనా వెళ్ళి తిలక్ అవార్డు స్వీకరించిన సందర్భంగా..).
/ వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త /
డా|| దేవరాజు మహారాజు