Oct 08,2023 11:58

ఫ్యామిలీ సినిమాలు చేసే శ్రీకాంత్‌ అడ్డాల 'నారప్ప' సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత ఆయన ఏమి సినిమా చేస్తున్నాడు అనేది కూడా ప్రకటించకుండా సైలెంటుగా చేసిన సినిమా 'పెద్దకాపు1'. విరాట్‌ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ అనే కొత్త నటీనటులను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. దానికి తోడు ఈ సినిమాలో కన్నబాబు అనే ఒక పాత్రలో కూడా శ్రీకాంత్‌ అడ్డాల కనిపించడం సినిమా మీద ఆసక్తిని పెంచింది.
పేదరికంలో మగ్గిపోయిన ఓ వ్యక్తి పోరాటం. తనవాళ్ల కోసం నిలబడి, పెద్దలకు ఎదురుతిరిగిన ఓ సామాన్యుడు నాయకుడిగా మారే పరిణామక్రమమే ఈ సినిమా. తెరపై ప్రధానంగా పెదకాపు సంతకమే కనిపించినా.. ఇంకా చాలా పాత్రల ప్రయాణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అందరినీ సృష్టించిన ఆ దేవుడు ఒకరికి కష్టాలు, మరొకరికి సుఖాలు ఎందుకు ఇచ్చాడు? ఈ తారతమ్యాలు, విబేధాలు ఎందుకు? అనే సందేహం వచ్చి తీరుతుంది. అణగారిన కుటుంబాలు చీకటి నుంచి వెలుగులోకి, దుఃఖం నుంచి సంతోషంలోకి రావాలనుకుంటే యుద్ధం చేయాల్సిందే అనే సందేశాత్మక కథనం ఈ చిత్రం.
కథలోకి వెళితే..గోదావరి జిల్లాలో 1962లో అల్లర్లు చెలరేగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా భయంతో ఉన్న ఊరిని వదిలి, వెళ్లిపోతుంటారు. అలా వెళ్తున్న క్రమంలో ఓ పొలం వద్ద అప్పుడే పుట్టిన బిడ్డ కనిపిస్తుంది. ఎవరో పడేసి వెళ్లిన ఆ ఆడబిడ్డను ఓ అనామకురాలు చూసి.. ఆ బిడ్డని ఎవరికైనా అమ్మేసి రమ్మని కూతురు గౌరీకి చెబుతుంది. ఆమె ఆ పాపను ఓ చేటలో తీసుకొని, లంక గ్రామంలోని మాస్టర్‌ (తనికెళ్ల భరణి) కి అమ్మేస్తుంది.
కట్‌ చేస్తే.. అది 1982, మార్చి 29. రాష్ట్రంలో అప్పుడే ఒక కొత్త పార్టీ ఆవిర్భవించింది. దీంతో లంకలోని యువత ఆ పార్టీ కోసం పనిచేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఆ గ్రామంపై పెత్తనం కోసం ఓ వర్గానికి చెందిన సత్యరంగయ్య (రావు రమేశ్‌), బయ్యన్న (నరేన్‌) పోటీ పడుతుంటారు. హింసని ప్రేరేపిస్తూ.. తమ స్వార్థం కోసం జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. అదే గ్రామానికి చెందిన పెదకాపు (విరాట్‌ కర్ణ) తన అన్నయ్యతో కలిసి సత్య రంగయ్య వద్ద పనిచేస్తుంటాడు.
ఓ సారి సత్యరంగయ్య చేసిన హత్య కేసులో ఆయన తరపున పెదకాపు అన్నయ్య జైలుకు వెళ్తాడు. పోలీసుల అదుపులో ఉండాల్సిన ఆయన కనిపించకుండా పోతాడు. అసలు పెదకాపు అన్నయ్య ఏమయ్యాడు? పొలంలో పడేసిపోయిన ఆ ఆడబిడ్డ ఎవరు? ఆమెను పడేసి వెళ్లిందెవరు? స్వార్థ రాజకీయాల కోసం సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బయ్యన్న, సత్యరంగయ్యను పెదకాపు ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలేంటి? కొత్తగా వచ్చిన పార్టీ.. ఎమ్మెల్యే టిక్కెట్‌ ఎవరికి ఇచ్చింది? ఈ కథలో కన్నబాబు (శ్రీకాంత్‌ అడ్డాల), అక్కమ్మ (అనసూయ) ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే 'పెదకాపు 1' సినిమా చూడాల్సిందే. సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి పూర్తిస్థాయి రివెంజ్‌ డ్రామా అనే విషయాన్ని అనేక సార్లు చెబుతూనే వచ్చారు. ఇక సినిమా విషయానికి వస్తే.. నిజానికి ఇలాంటి ఘటనలు గతంలో చుండూరు, కారంచేడు వంటి ప్రాంతాల్లో జరిగాయి. కానీ వాటిని గోదావరి లంకల నేపథ్యంలో చూపించడం కొంత కన్విన్సింగ్‌ అనిపించలేదు. ప్రతీ చిన్న విషయాన్ని కూడా విశదీకరించి చెప్పే ప్రయత్నంలో సాగదీతగా అనిపించింది. మితిమీరిన రక్తపాతం అతిగా అనిపించినా, అప్పటి పరిస్థితులు ఇలాగే ఉండేవేమో అనిపించేలా తీశారు. ఇక సినిమా కథ, పాయింట్‌ బాగానే ఉన్నా స్క్రీన్‌ ప్లే విషయంలో కొంత తడబడ్డారు.
హీరో విరాట్‌ కర్ణకి తొలి సినిమా ఇది. అయినా విరాట్‌ తెరపై చాలా సహజంగా నటించారు. హీరోయిన్‌ ప్రగతి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అయినా ఉన్నంతలో చక్కగా నటించారు. సత్యరంగయ్య పాత్రలో రావురమేశ్‌ జీవించారనే చెప్పాలి. ఓ రకమైన మేనరిజంతో విలనిజాన్ని బాగా పండించారు. బయన్న పాత్రలో నరేన్‌ కూడా తన పరిధిమేర చక్కగా నటించారు. కన్నబాబు పాత్రలో శ్రీకాంత్‌ అడ్డాల నిజంగానే సర్‌ప్రైజ్‌ చేశారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

నటీనటులు : విరాట్‌ కర్ణ, ప్రగతిశ్రీవాస్తవ, బ్రిగిడాసాగా, ఈశ్వరీరావు,అనసూయ భరద్వాజ్‌, నాగబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ అడ్డాల, రావు రమేశ్‌, రాజీవ్‌ కనకాల, ఆడుకాలం నరేన్‌ తదితరులు
దర్శకుడు : శ్రీకాంత్‌ అడ్డాల
సంగీతం : మిక్కీ జే మేయర్‌
నిర్మాత : మిర్యాల రవీందర్‌ రెడ్డి