Mar 05,2023 09:45
  •  రూ.108 కోట్ల కాల్వ పనులకు గ్రహణం
  •  10 వేల ఎకరాల సాగుపై ప్రభావం

ప్రజాశక్తి - కడప ప్రతినిధి : అన్నమయ్య జిల్లాలోని ఝరికోన జలాశయ పనులు నిలిచిపోయాయి. 2006-07 సంవత్సరంలో రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండల పరిధిలోని బాహుదానది మీద 0.5 టిఎంసిల సామర్థ్యంతో నిర్మితమైన రిజర్వాయర్‌ 2014కు పూర్తి అయ్యింది. 2006 నుంచి నేటి వరకు సుమారు 17 ఏళ్లుగా జలాశయ ప్రధాన, కుడి, ఎడమ కాల్వల పనులు ముందుకు సాగిన దాఖాలాల్లేవు. ప్రధాన కాలువ 0 నుంచి 6 కిలోమీటర్లు, ఎడమ కాలువ 0 నుంచి 21 కిలోమీటర్లు, కుడి కాలువ 0 నుంచి 15 కిలోమీటర్ల పనులు నిలిచిపోయాయి. ఈ కాలువల ద్వారా జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలంలోని ఆరు పంచాయతీలకు, పీలేరు నియోజకవర్గంలోని కలికిరి తదితర గ్రామాలకు తాగు, సాగునీరు అందించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో ఈ పనులు నిలిచిపోయాయి. దీనికి తోడు సంబేపల్లి, సుండుపల్లి మండలాల పరిధిలోని 23 చెరువులకు సాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ఏడాదిన్నర కిందట రూ.44కోట్లతో ఎత్తిపోతల పనులకు టెండర్లు పిలిచారు. నార్‌ కన్స్‌స్ట్రక్షన్‌ సంస్థ ఈ పనులను దక్కించుకుంది. జలాశయం నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల మేర కాలవలను తవ్విన అనంతరం ఈ సంస్థ చేతులెత్తేసింది. ఇప్పటి వరకు పనిచేసిన రూ.38 లక్షలకు చెందిన బిల్లులకు నిధులు చెల్లించకపోవడంతో పనులను నిలిపివేసింది.
పదివేల ఎకరాలపై ప్రభావం
ఝరికోన రిజర్వాయర్‌కు కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల ఎకరాల సాగుపై ప్రభావం పడుతోంది. పనులు పూర్తయితే సుండుపల్లి మండల పరిధిలోని విఎన్‌.పాలెం, టి.సుండుపల్లి, బంగారుపల్లి, మడితాడు, పిఎన్‌ కాలువ, తిమ్మసముద్రం పరిసర ప్రాంతాల్లోని 4,900 ఎకరాల ప్రధాన ఆయకట్టు స్థిరీకరణకు నోచుకునే అవకాశం ఉంది. దీనికితోడు మరో ఐదు వేల ఎకరాల మెట్ట భూముల సాగుకు సంబంధించిన భూగర్భజలాలు అందుబాటులోకి రానున్నాయి.
పెండింగ్‌లో ఆర్‌ఇ
ఝరికోన పనుల రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌కు మోక్షమెప్పుడో తెలియడం లేదు. కాల్వపనుల్లో 40 స్ట్రక్షర్లు, యాడెక్ట్‌ క్రాప్స్‌, డ్రాప్స్‌, ఆఫ్‌ టేకింగ్‌ పాయింట్స్‌, యుటి, డ్రాప్స్‌ వంటి సాంకేతిక నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. గతంలో నిర్వహించిన ప్రయివేటు సంస్థ సర్వే అనంతరం రివైజ్డ్‌ ఎస్టిమేట్‌ కమిటీ మరో రూ.30 కోట్లకు పెంచి రూ.78 కోట్ల నుంచి రూ.108 కోట్లతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేసింది. ఝరికోన రిజర్వాయర్‌ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా 123 ఎకరాలను భూసేకరణ చేయాల్సి ఉంది.
పనులు నిలిచిన మాట వాస్తవమే
ఝరికోన జలాశయ పనులు నిలిచిన మాట వాస్తవమే. త్వరలోనే రూ.30 కోట్ల చెల్లింపులు చేస్తాం. మళ్లీ ప్రాజెక్టు పనులు పట్టాలెక్కిస్తాం.
- డి.వెంకటరామయ్య, నీటిపారుదలశాఖ ఇఇ, కడప.