
మహోన్నతమైన, మహోజ్వలమైన పోరాటం. వివిధ జాతులు, మతాలు, కులాలు, ప్రాంతాలు, సంస్కృతులు, జీవన విధానాలకు చెందిన ప్రజలు పోరాటంలో పాల్గొన్నారు. జాతీయ కాంగ్రెస్‌తో పాటు, విప్లవకారులు, కార్మిక ఉద్యమాలు, కమ్యూనిస్టులు, రైతాంగ ఉద్యమాలు, సంఘ సంస్కరణోద్యమాలు ఆ మహత్తర పోరాటంలో పాల్గొన్నాయి. అనేకమంది ప్రాణ త్యాగాలు చేశారు. వేలాదిమంది ఉరితీయబడ్డారు. కాల్చి చంపబడ్డారు. ఇప్పుడు 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రోద్యమం ఆశించిన లక్ష్యాలు సాధించామా ? లేదా ? రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలు, ఆదర్శాలు ఏమిటి ? రాజ్యాంగ స్వాతంత్య్రాన్ని సాధించిన మనం ఆర్థిక, సామాజిక స్వాతంత్య్రాలు సాధించామా ? ఇవన్నీ సమీక్షించుకోవలసిన సమయం ఇది. ఇలాంటి పరిస్థితికి భిన్నంగా.. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనని వారు 'అమృతోత్సవాలు' అంటూ జరపడం హాస్యాస్పదం.. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం..

జాతీయోద్యమంలో పాల్గొనని ఆర్.ఎస్.ఎస్. రాజకీయ రూపమైన భారతీయ జనతాపార్టీ నరేంద్రమోడీ నాయకత్వంలో గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండి ప్రస్తుతం జాతీయోద్యమ, రాజ్యాంగ లక్ష్యాలకు విఘాతం కలిగిస్తూ భారత దేశ భిన్నత్వానికి, బహుళత్వానికి ప్రమాదం కలిగించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది. దేశ సమగ్రతను, రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత పౌర సమాజం, మేధావులు, విద్యావంతులు, లౌకికవాదులు, అభ్యుదయ వాదులు, వామపక్ష వాదులపై పడింది.

రాజ్యాంగ లక్ష్యాలపై దాడి
అరవై దేశాల రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేసి డాక్టర్ అంబేద్కర్ నాయకత్వంలో ఉన్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగ పీఠికలు, రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలు వివరించారు. సమాఖ్య విధానం (ఫెడరిలిజం), లౌకిక విధానం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆర్థిక-సామాజిక న్యాయం, మొదలైన అంశాలను రాజ్యాంగ లక్ష్యాలుగా పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసంస్కరణలకు వ్యతిరేకంగా కేశవానంద భారతి వేసిన కేసులో 1973లో సుప్రీంకోర్టు పై అంశాలను రాజ్యాంగ ఆశయాలుగా పేర్కొన్నది.
సమాఖ్య విధానానికి విఘాతం..
నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత సమాఖ్యను (ఫెడరిలిజం) దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నది. జిఎస్‌టి ప్రవేశపెట్టి, రాష్ట్రాల ఆర్థిక వనరులు దెబ్బతీసినది. రాష్ట్రాలకు దాదాపు మూడు లక్షలకోట్ల రూపాయలు చెల్లించాలి. మూడు వ్యవసాయ చట్టాలు కేంద్రం చేయటం రాష్ట్రాల హక్కులు హరించటమే. రాష్ట్రాలతో సంప్రదించకుండానే ఎన్‌ఇపి-2020 (నూతన విద్యావిధానం) ప్రకటించింది. ఆర్థిక సంఘం సిఫార్సులను సక్రమంగా అమలు చేయటం లేదు. నీతి ఆయోగ్‌కు ఎటువంటి చట్టబద్ధత లేదు. దాని ద్వారా రాష్ట్రాలపై కేంద్రం స్వారీ చేస్తున్నది. రాష్ట్రాలలో ప్రభుత్వాలను రకరకాల కుట్రలతో కూల్చివేస్తున్నది. తమకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు సక్రమంగా కేటాయించటం లేదు. భారత సమాఖ్య దెబ్బతింటే దేశ సమగ్రత ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుంది.

ప్రమాదంలో లౌకికవాదం..
భారతదేశ సమగ్రత, ప్రజాస్వామ్య భద్రత లౌకికవాదంతో ముడిపడి ఉన్నది. రాజ్యాంగం మనదేశాన్ని లౌకిక రాజ్యంగా పేర్కొన్నది. అయితే హిందూ-ముస్లింల మధ్య అగాధాన్ని సృష్టించి, మెజారిటీ హిందూ మత పార్టీగా ఉండాలని బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తున్నది. జమ్మూకాశ్మీర్ 370వ ఆర్టికల్ రద్దు చేసింది. మైనారీటీలపై, దళితులపై దాడులు చేస్తూ మతపరమైన విభజన సృష్టిస్తున్నాయి. సిఎఎ వంటి చట్టాల ద్వారా మత ఆధారిత పౌరసత్వం కోసం పావులు కదుపుతున్నాయి. పాఠ్యపుస్తకాలను, సిలబస్‌ను మత ఆధారిత అంశాలుగా మారుస్తున్నారు. మత సామరస్యాన్ని దెబ్బతీసి లౌకికవాదం బలహీనపడే విధంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం బాహాటంగా ప్రయత్నాలు చేస్తోంది. మతపరమైన విభజన లౌకిక వాదానికి, దేశ సమగ్రతకు నష్టదాయకం.

భావ ప్రకటనా స్వేచ్ఛ..
రాజ్యాంగం ప్రాథమికహక్కుల ద్వారా ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించింది. సంఘాలను ఏర్పాటు చేసుకోవటానికి ఉద్యమాలకు అవకాశం కల్పించింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాల ద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. భిన్న ఆలోచనలు కలిగిన గౌరీలంకేష్, దబోల్కర్, కల్బుర్గి, గోవింద్ పన్సారీ వంటి మేధావులను హతమార్చారు. భిన్నాభిప్రాయాలను సహించలేని పరిస్థితులు, అసహన పరిస్థితులు దేశంలో ఏర్పడ్డాయి.

ఏమి చేయాలి ?
డెబ్బై ఐదేళ్ల స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ప్రజలు, పౌర సమాజం, దేశ సమగ్రతను, స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతిజ్ఞ పూనాలి. ప్రస్తుత మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, సామాజిక విధానాలను వ్యతిరేకించాలి. మతతత్వ శక్తుల నుండి దేశాన్ని సంరక్షించుకోవడానికి సిద్ధపడాలి. జాతీయోద్యమ నాయకులు, విప్లవకారులు ఆశించిన ఆర్థిక, సామాజిక స్వాతంత్య్రాన్ని సాధించుకోవడానికి పౌర సమాజం పూనుకోవాలి.

చరిత్రను చెరిపేయడమే !
19వ, 20వ శతాబ్ధాల గొప్ప సామాజిక-రాజకీయ సంస్కర్తలు తమ పూర్వీకులని, లేదా వారి వారసులమని తమని తాము చిత్రీకరించుకోవాలనీ ప్రయత్నిస్తున్నారు. అలా వారు అంచెలంచెలుగా గాంధీజీ, భగత్‌సింగ్, చంద్రశేఖర్ అజాద్ తదితర జాతీయ విప్లవకారులు, సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్, సర్దార్ పటేల్, స్వామీ వివేకానంద, బంకిం ఛటర్జీ బిపిన్ పాల్, అరవింద ఘోష్ తదితరుల వారసులుగా, అనుయాయులుగా చెప్పుకోవడానికీ ప్రయత్నించారు. కానీ వారు విఫలమయ్యారు. ఇంతకుముందే చెప్పినట్లు, జాతీయోద్యమ నాయకులు దాదాభాయి నౌరోజీ నుంచి గాంధీజీ వరకు అనేక విషయాల్లో పరస్పరం విభేదించుకున్నారు. సామాజిక-ఆర్థిక కార్యక్రమాలు, విధానాల మీదో లేదా వలసవాదంపై ఎలా పోరాడాలి లేక అహింస పాత్ర ఏమిటి..? సాయుధ పోరాటమా, రాజ్యాంగబద్ధ పద్ధతులే అనుసరణీయమా? వంటి అంశాల మీదో వారి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండేవి. అయినప్పటికీ వలసవాదం, మతతత్వం, కులతత్వాల వ్యతిరేక పోరాటం వారందరి ఉమ్మడి లక్ష్యంగా ఉండేది. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, లౌకికవాదం, స్వతంత్ర ఆర్థికాభివృద్ధి, పేదల అనుకూలత అంశాలపై వారందరి నడుమ మౌలికంగా ఏకాభిప్రాయం వ్యక్తమయ్యేది. ఈ విలువల విషయంలో వారెప్పుడూ రాజీపడలేదు. పరమత ప్రజల మీద విద్వేషం రగిల్చినంత కాలం, వలసపాలనను వ్యతిరేకించినంత కాలం.. ఆఖరుకు సరళ మతతత్వవాదులను సైతం తమతో కలుపుకుపోయారు. ఎప్పుడైతే మతాల మధ్య చిచ్చుపెట్టారో అప్పుడు అంటే 1937 తర్వాత మతతత్వవాదులను జాతీయోద్యమ పదవుల నుంచి బహిష్కరించారు.
నిజమైన జాతీయ నాయకులను తమ స్వంతం చేసుకునే పనిలో విఫలం కావడంతో.. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపీలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద, అధికారిక మీడియా మీద, ఎన్‌సీఈఆర్‌టీ మీద, పాఠ్యపుస్తకాల మీద తమ అధికారాన్ని వినియోగిస్తూ సావర్కర్, హేడ్గేవార్ వంటి వారిని గొప్ప జాతీయతావాద నాయకులుగా చెలామణి చేయాలని ప్రయత్నిస్తోంది.

ఆర్థిక, సామాజిక న్యాయం..
రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ఆర్థిక, సామాజిక న్యాయాన్ని ప్రస్తుత పాలకులు పూర్తిగా విస్మరించారు. ఆర్థిక సంస్కరణల వేగాన్ని పెంచి, లాభాలతో నడిచే పరిశ్రమలను సైతం ప్రైవేటీకరిస్తున్నారు. ఎల్‌ఐసి, విశాఖ ఉక్కు వంటి సంస్థలను ప్రైవేటీకరించటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. మానిటైజేషన్ పేరుతో మౌలిక రంగాలను అమ్మివేయటానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నది. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పేద ప్రజలకు, రైతులకు, అసంఘటితరంగ కార్మికులకు, సామాజిక వర్గాలకు నష్టదాయకం.

తెలుగుజాతికి నమ్మకద్రోహం !
ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే మార్కెట్, ఒకే పన్ను, ఒకే విద్యా విధానం, ఒకే ఆహారపుటలవాట్లు - ఇలా పైకి ఆకర్షణీయంగా కనిపించే నినాదాలతో హిందూత్వ - బిజెపి ప్రభుత్వం మన దేశంలోని వివిధ జాతుల, భాషల, సంస్కృతుల మధ్య ఉన్న వైవిధ్యాన్ని కాలరాయజూస్తున్నది. మనువాదాన్నే మన దేశ జీవన విధానంగా రుద్దడానికి ప్రయత్నిస్తున్నది. భిన్న మతాల నడుమ ఉన్న సామరస్యాన్ని నాశనం చేస్తున్నది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసి, అధికారాలన్నీ తన గుప్పెట్లో బిగించుకుంటున్నది. ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యడంలో కీలక భూమిక పోషించింది. దానిని సమర్ధించుకోడానికి 'ప్రత్యేక హోదా' ఆశ చూపింది. తర్వాత మొండిచెయ్యి చూపించింది. రాజధాని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, విభజన హామీలు, పోలవరం పునరావాసం, కడప ఉక్కు, రైల్వే జోన్ - ఇలా అన్ని విషయాల్లోనూ నమ్మించి, మోసం చేసింది. తాజాగా విశాఖ ఉక్కును అమ్మి తీరుతానని అడ్డగోలుగా ప్రకటించింది. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని సవాలు చేస్తోంది బిజెపి ఏకపక్ష పెత్తందారీ పాలన. అందుకే తెలుగు 'వాడితనాన్ని' డిల్లీ పాలకులకు రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది.

ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న హిందూత్వ..
కేవలం రైతులే కాదు, దేశంలో మెజారిటీగా ఉన్న యువత స్థబ్దత నుండి, రాజకీయ రాహిత్యం నుండి, పాలకవర్గ ప్రచార ప్రభావం నుండి బయటపడాలి. అందులో నుండి ఉద్యమాలబాట పట్టాలంటే వారిలో ఆత్మవిశ్వాసం పాదుకొల్పాల్సిన అవసరం చాలా ఉంది. హిందూత్వ శక్తులు ఎక్కిస్తున్న జాతీయతా భావం నిజానికి దేశంలోని వివిధ జాతుల, మతాల, ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంది. భిన్న భాషలను, భిన్న సంస్కృతులను బేఖాతరు చేస్తుంది. చివరికి ఏ తిండి తినాలో, ఏవిధంగా దుస్తులు ధరించాలో, ఏ సినిమా చూడాలో, ఎవరిని పెళ్ళాడాలో కూడా శాసిస్తుంది. దీనికి తలొగ్గడం అంటే మన యువత తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే. హిందూత్వ గురించి గొప్పగా చెప్పుకుంటూ మరోవైపు దేశాన్ని అమెరికన్ సామ్రాజ్యవాదులకు అప్పజెప్తున్న బిజెపి-ఆరెస్సెస్ ద్రోహాన్ని ఇటువంటి ఆత్మగౌరవ ఉద్యమమే బయటపెట్టగలదు. అందుకే నాడు స్వాతంత్య్ర పోరాటంలో వీరోచితంగా పోరాడిన అమరవీరులు మనకు స్ఫూర్తి కావాలి.


సంస్కృతులు.. సమానత్వం
సంస్కృతుల మధ్య సమానత్వం, పరస్పర గౌరవం ఉండాలి. ఒకటి ఎక్కువ మరొకటి తక్కువా కాదు. దేని ప్రత్యేకత దానిది. దేని విశిష్టత దానిది. కానీ, మన సమాజంలో అంతర్లీనంగానూ, బాహాటంగానూ ఒక లక్షణం ఉంటుంది. ఆధిపత్య సంస్కృతులు, అలవాట్లు.. ఆడంబరంగా, అట్టహాసంగా ప్రదర్శితమవుతాయి. వాటికి సహజంగా లేని 'ఉన్నతతత్వాన్ని' ఆపాదించుకొని- గొప్పవిగా ప్రాచుర్యం పొందుతాయి. అది గొప్ప అనుకునేవాళ్లు క్రమంగా దానిని అనుసరించటం, అనుకరించటం మొదలెడతారు. ఆ విధంగా ఆధిపత్య సంస్కృతి అన్నింటా నెమ్మది నెమ్మదిగా చొచ్చుకొస్తుంది. స్థానిక సంస్కృతి అంతే నెమ్మదిగా ప్రాముఖ్యాన్ని కోల్పోతూ ఉంటుంది. ముఖ్యంగా వేషభాషల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. స్వల్ప స్థాయీ చలనంతో సహజంగా జరిగే మార్పును మనం కాదనలేం. కానీ, అది బలవంతంగానో, మార్కెట్టు శక్తుల ప్రమేయంతోనో జరిగితే- అభ్యంతరకరం. తాము చెప్పింది తప్ప మరేదీ సంస్కృతి కాదని ఎవరన్నా విర్రవీగితే- అది ప్రమాదకరం. ఒక ప్రాంత సంస్కృతిని మరో ప్రాంత సంస్కృతితో తూకమేసి, సరిచేయాలనుకోవటం అరాచకవాదం. ఇక్కడే మనం గురజాడ మాటలను గుర్తు చేసుకోవాలి. 'దేశమంటే మట్టి కాదోరు. దేశమంటే మనుషులోరు' అన్న ప్రబోధాన్ని పాటించాలి. ఎప్పుడైనా సరే మనుషులు, వారి అభీష్టాలు ప్రధానం. తంతులూ తతంగాలూ, ప్రాంతాలూ, ప్రదేశాలూ తరువాత. కనిపించే సాటి మనుషుల కన్నా కనపడని నమ్మకాలూ, కాల్పనిక కథలూ ఎప్పుడూ ఎక్కువ కావు. పైగా, నమ్మకాలు అనేకమైనా.. ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు.. అన్నిచోట్లా ఒకే విలువతో చెలామణి కావు. ఆంధ్రా బ్రహ్మణులు సహజంగా చేపలను తినరు. అది మాంసాహారం. ఒడిశా, బెంగాలు బ్రాహ్మణులకు అవి ప్రియమైన శాఖాహారం. ఇక్కడ ఎవరి అలవాటు ప్రామాణికం? ఎవరి ఆచరణ అనుసరణీయం? అసలు ఈ ప్రశ్నలే అసంబద్ధం. ఎవరి అలవాటు వారిది. ఒకరి ఆహారపు అలవాటును మరొకరి ఆహారపు అలవాటుతో కొలత వేయటం - మన దేశ భిన్నత్వాన్ని అవమానించటమే! చాలామంది మేకమాంసం, కోడిమాంసం తిన్నట్టే- కొంతమంది గొడ్డుమాంసం తింటారు. కాదనే హక్కు ఎవరికీ ఉండదు. కానీ, కొన్నేళ్లుగా ఇదొక సమస్యగా మారింది. ఇంట్లో గొడ్డుమాంసం ఉందనే పేరిట మనుషులనే చంపేసే ఉన్మాద మూకల స్వైర విహారం సాగుతోంది. పాలకులు ఇలాంటి దుశ్చర్యలను అరికట్టకపోగా, నిందితులను అభినందించటం అప్రజాస్వామికం.


దేశభక్తి పేరిట అరాచకం..
చిత్రం ఏమిటంటే- చేసే వ్యాఖ్యలూ వ్యవహారాలూ, దాడులూ దౌర్జన్యాలూ 'దేశభక్తి' పేరుతో జరుగుతున్నాయి. దేశాన్ని రక్షించే పేరుతో నడుస్తున్నాయి. ఆవులకు ఒక ప్రత్యేకతా, పవిత్రతా ఆపాదించి.. మనుషులపై దాడులు, హత్యలూ జరుగుతున్నాయి. దేశభక్తి గురించి మాట్లాడుతూ భిన్నాభిప్రాయంపై దాడులూ దౌర్జన్యాలూ. మహిళల గొప్పతనం గురించి కీర్తిస్తూ.. కథలు కల్పిస్తూ.. స్త్రీలపై, వారి ప్రాథమిక హక్కులపై దాడులూ, అత్యాచారాలూ. వాళ్లకు రాజ్యాంగం కన్నా మనుస్మృతి ఎక్కువ. ఆధునిక సమాజపు ఆకాంక్షల కన్నా ఆటవిక యుగపు దౌర్జన్యాలపై మక్కువ. వారిది దేశాన్ని మనుషులతో చూడలేని అంధత్వం. దేశమంటే దేవాలయాలు, విగ్రహాలు, చరిత్రను రూపుమాపే కట్టడాలు.. వీరిది సారం లేని చరిత్రలూ అనుకొనేతత్వం. దేశాన్ని మనుషు లుగా చూసి, వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి.. వారిని కులాలుగా, మతాలుగా విడగొట్టే.. భావోద్వేగాలను రెచ్చగొట్టే కుతంత్రం! ఇలాంటి విధ్వంసం జరుగుతున్నప్పుడు స్వాతంత్య్రానికి అర్థం ఏముంది? కులమతాలకు అతీతంగా పౌరుడిని పౌరుడిగా గుర్తించాలన్న రాజ్యాంగం స్ఫూర్తి ఏంటి? మూకస్వామ్యపు ఉన్మాదం ఆ స్ఫూర్తికి బహిరంగంగానే తూట్లు పొడుస్తోంది. మనమిప్పుడు స్వాతంత్య్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని, చివరకు రాజ్యాంగాన్నీ కాపాడుకోవాల్సిన స్థితిలో ఉన్నాం. మాట్లాడే హక్కుని, పోరాడే హక్కుని మనమే రక్షించుకోవాలి.
కె.ఎస్. లక్ష్మణరావు
శాసనమండలి సభ్యులు,
9490098004