Mar 04,2023 10:51

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :  పేదవారే కాదు మధ్యతరగతి ప్రజలూ పెరిగిన ధరలతో కుదేలవుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతోపాటు ఇంటి అద్దెలు, విద్యుత్‌ ఛార్జీలు, సొంతింటి కలిగిన వారికి ఆస్తి పన్నులు, విద్య, వైద్యంలో పెరిగిన ఖర్చులు, కూరగాయలు, పాలు ఇతర నిత్యావసర ధరలతో అన్ని తరగతుల ప్రజలూ విలవిల్లాడుతున్నారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆదాయాలు లేకపోవడంతో కుటుంబ పోషణ కోసమే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి.
         ఉల్లిపాయలు కిలో రూ.30, టమోటా రూ.40, మిర్చి రూ.60, బెండకాయలు రూ.60 ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఇంటికి రోజుకు కేవలం కూరగాయలకే రూ.100లకు పైగా ఖర్చవుతోంది. వీటితో పాటు వంటనూనె లీటరు రూ.170 నుంచి రూ.190 వరకూ పెరిగింది. మేలు రకం బియ్యం కిలో రూ.50 నుంచి రూ.60 వరకూ ఉంటుంది. కందిపప్పు, మినపప్పు, పెసర పప్పులదీ అదే దారే. కీలకమైన వంటగ్యాస్‌ ధరను ప్రజలు భరించలేనంతగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెంచుకుంటూపోతోంది. ప్రస్తుతం గ్యాస్‌ రీఫిల్‌ సిలిండర్‌ ధర రూ.1152 అయ్యింది. డెలివరీ బారు ఖర్చుతో కలుపుకుంటే రూ.1200 అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.112, రూ.100 నుంచి ఏమాత్రం దిగువకు రాని పరిస్థితి ఉంది. అలాగే ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రిస్కిప్షన్‌ ప్రకారం మందులు కొనుగోలు చేయాలంటే గుండె ఆగినంత పనవుతోంది. షుగర్‌, బిపిలకు సంబంధించిన మందుల ధరలు ఇటీవల కాలంలో రెట్టింపయ్యాయి. యాంటి బయాటిక్స్‌ మందుల ధరలు కూడా బాగానే పెంచేశారు.
         విద్యుత్‌ ఛార్జీలను ఒక పద్ధతి లేకుండా పెంచేస్తున్నారు. కస్టమర్‌, ఫిక్సడ్‌, ఓవర్‌లోడ్‌, ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో రెండు నెలలకోసారి ఏదో ఒక రూపంలో భారీగా వసూలు చేస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగక పోవడంతో చిరు ఉద్యోగులు జీవించడానికే నానా అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులే కాదు ప్రభుత్వంలో పనిచేసే చిరుద్యోగుల జీవన ప్రమాణాలు ఇటీవల కాలంలో దారుణంగా తయారయ్యాయి. ప్రతినెలా కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండటంతో ఇటీవల ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ధరల నియంత్రణపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.