
- ప్రమాదంలో పర్యావరణం, ప్రజారోగ్యం !!
జులై 3 అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగు రహిత దినం సందర్భంగా... ప్లాస్టిక్ మహమ్మారిపై పోరును ఒక అత్యవసర ఉద్యమంగా చేపట్టాలి. పర్యావరణం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం, భావితరాలకు సురక్షితమైన జీవితం కోసం...ప్లాస్టిక్ బ్యాగులు, బాటిల్స్ తదితర వస్తువులను బహిష్కరించాలి. క్లాత్ బ్యాగులను వాడకాన్ని ప్రారంభించాలి. ఇందుకు అన్ని వర్గాల ప్రజలూ స్వచ్ఛందంగా పూనుకుంటేనే సాధ్యం.
నిత్య జీవితంలో ప్లాస్టిక్ వినియోగం విడదీయలేని స్ధాయికి చేరుకున్నది. ప్రతి నిత్యం మనకు నిత్యావసరాలైన కూరగాయలకు, కిరాణా సామాన్లకు, ఫ్యాన్సీ వస్తువులకూ మందులకు, ఎలక్ట్రానిక్స్ వస్తువులకు కూడా ప్లాస్టిక్ బ్యాగుల వాడడం మనకు అలవాటైపోయింది. తెలీకుండానే మన పరిసరాలు, భూమి, పర్యావరణం, ఆరోగ్యాలను తీవ్రంగా నష్టపరచుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ముందుగా పర్యావరణాన్నీ, ప్రజారోగ్యాన్నీ తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
1. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి 20 లక్షల ప్లాస్టిక్ బ్యాగులు వినియోగించబడుతున్నాయి. 2. మన దేశంలో ప్రతి పౌరుడు సగటున ఒక్క సంవత్సరకాలంలో 11 కేజీల ప్లాస్టిక్ (బ్యాగులు, బాటిల్స్, స్ట్రా వంటివి) వాడటం జరుగుతున్నది. 3. ప్లాస్టిక్ బాటిల్స్ భూమిలో కరిగిపోవడానికి 450 ఏళ్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు కరిగిపోవడానికి వెయ్యి సంవత్సరాలు పడుతుంది. 4. మొత్తం ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్‌లో కేవలం 9 శాతం మాత్రమే రీసైకిల్ చేయబడుతున్నది. 5. దాదాపుగా 14 ప్లాస్టిక్ బ్యాగుల ఉత్పత్తికి అవసరమయ్యే పెట్రోలియం నుండి ఒక మైలు దూరం వాహనం నడపటానికి అవసరమయ్యే గ్యాసును ఉత్పత్తి చేయవచ్చు. 6. ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పక్షులు, చేపలు, జంతువులు ప్లాస్టిక్ వల్ల చనిపోతున్నాయి. అంతరించిపోతున్న ప్రాణుల్లో దాదాపు 700 జాతులు ప్లాస్టిక్ వల్ల ప్రభావితమైనట్లు గుర్తించారు. 7. మనం తినే జలచరాల్లో (చేపలు, రొయ్యలు వంటివి) మైక్రోప్లాస్టిక్ అవశేషాలు ఉంటున్నట్లు శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో ఇప్పటికే వెల్లడైంది. 8. ప్లాస్టిక్ కాల్చినప్పుడు విడుదలయ్యే డయాక్సిన్స్, ఫ్యురాన్స్, మెర్క్యురి, పాలిక్లోరినేటెడ్ బైఫినైల్స్, పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ వంటి హానికరమైన రసాయనాలు మానవ ఆరోగ్యాన్నీ, మనం నివసించే భూమినీ, తాగే నీటిని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. 9. బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను పోసి కాల్చడం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 20 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తి అవుతోంది. దీని ఫలితంగా 60 లక్షల మంది మరణిస్తున్నారని తెలుస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం వల్ల దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. మనం తినే ఆహారం, తాగే నీటిలో సూక్ష్మ స్ధాయిలో ఉంటున్న ప్లాస్టిక్ పాలిమర్ అవశేషాల వలన క్యాన్సర్, చర్మవ్యాధులు, హార్మోన్లకు సంబంధించిన వ్యాధులు, సంతానలేమి, గుండెపోటు వంటి వ్యాధులు సోకుతున్నాయి. 10. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉల్లాసంగా, ఆహ్లాదంగా గడపడానికి సందర్శించే సముద్ర తీరాలలో (బీచ్‌లలో) పడవేసే వ్యర్థ పదార్ధాలలో 73 శాతం ప్లాస్టిక్ ఉంటున్నది. 11. ప్లాస్టిక్ బ్యాగులు, బాటిల్స్ వంటి ఉత్పత్తుల నుండి విడుదలయ్యే వ్యర్ధాలతో కలుషితమైన సముద్ర జలాల వలన సముద్రంలో విస్తారంగా ఉండి, ప్రపంచంలో పదిశాతం ఆక్సిజన్‌ను కిరణజన్య సంయోగక క్రియ ద్వారా అందిస్తున్న ప్రోక్లోరోకోకస్ అనబడే బ్యాక్టీరియా తీవ్రంగా దెబ్బ తింటున్నట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు. 12. శాస్త్రజ్ఞుల అధ్యయనం ప్రకారం 2050 సంవత్సరం నాటికి సముద్రాలలో చేపల కంటే ప్లాస్టిక్ పరిమాణం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి నదుల్లోనూ, సముద్రాల్లోనూ మన ఆహారం నిమిత్తం సేకరించే చేపల్లో ప్రతి మూడు చేపలలో ఒక్క చేప ప్లాస్టిక్ అవశేషాలు కల్గిఉన్నట్లు తెలుస్తోంది. 13. నేడు ప్రపంచ వ్యాప్తంగా సగటు మనిషి తినే ఆహారంలో ఒక వారానికి 5 గ్రాముల మైక్రోప్లాస్టిక్స్ కణాలను తింటున్నట్లు శాస్త్రజ్ఞుల అంచనా. 14. ప్రపంచ వ్యాప్తంగా 1974 సంవత్సరం నాటికి ప్లాస్టిక్ తలసరి వినియోగం 2 కేజీలు ఉండగా 2021 నాటికి 43 కేజీలకు చేరుకున్నది. ఈ వినియోగం నానాటికీ ఆందోళనకరంగా పెరుగుతున్నది. 2060 నాటికి ప్లాస్టిక్ తలసరి వినియోగం 123 కేజీలకు చేరనున్నట్లు అంచనా.
ఇంత ప్రమాదకరంగా పరిణమించి గాలి, నీరు, నేల, మానవ ఆరోగ్యాలను కబళిస్తున్న ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రభుత్వాల స్ధాయిలోనే కాకుండా ప్రజలందరూ వ్యక్తిగత స్ధాయిలో దీని ప్రాధాన్యతను అర్ధం చేసుకుని సరైన దృక్పథంతో స్పందించకపోతే రానున్న తరాలకు మనం మిగిల్చేది క్యాన్సర్లు, ఆస్తమా, గుండెపోటు వంటి అనారోగ్యమూ, కలుషితమైన నేల, నీరు, గాలి మాత్రమే. రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలదన్న సామెతలాగా మన దృక్పథం మార్చుకోకపోతే భూమిని వదిలి చంద్ర మండలం పోయినా మనకు తిప్పలు తప్పవు.
వ్యక్తిగతంగా మనమేం చేయవచ్చు?
1. టీ, కాఫీ తాగడానికి ప్లాస్టిక్ కప్పులు కాకుండా మట్టి, సిరామిక్, స్టీల్ కప్పులు వాడాలి. 2. కూరగాయలు, పండ్లు, కిరాణా సరుకులు తెచ్చుకునే ప్రతిసారీ క్లాత్ బ్యాగును తీసుకు వెళ్లాలి. 3. చికన్, మటన్, పాలు వంటి పదార్ధాలు కొనుక్కురావడానికి స్టీల్ క్యాన్, బాక్స్ వాడాలి. 4. బయటకు వెళ్లే ప్రతి సందర్భంలోనూ, ప్రయాణాలలోనూ మంచినీళ్ల కోసం స్టీల్ బాటిల్ తీసుకువెళ్లాలి. 5. బర్త్ డే లు, శారీ ఫంక్షన్లు, వివాహాలు, గృహప్రవేశాలు వంటి పలు సందర్భాలలో స్టీల్ గ్లాసులు మాత్రమే వాడాలి. 6. ఫంక్షన్లలో ఇచ్చే రిటన్ గిఫ్ట్‌లు ప్లాస్టిక్‌వి కాకుండా పర్యావరణానికి మేలు చేసే ...మొక్కలు, క్లాత్, జ్యూట్ బ్యాగులు వంటివి ఇవ్వాలి.
ఇప్పటికే అనేక దేశాలలో ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించడం జరిగింది. మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో ప్లాస్టిక్ వినియోగంపై జరిమానాలు కూడా విధిస్తున్నారు. అధికారికంగా తెలుగు రాష్ట్రాలలో కూడా 120 మైక్రాన్ల సైజు కంటే తక్కువ మందం కల్గిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించారు.
జులై 3 అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగు రహిత దినం సందర్భంగా...పర్యావరణ ప్రేమికులు, ప్రజారోగ్య ఉద్యమకారులు, అభ్యుదయవాదులు ప్లాస్టిక్ మహమ్మారిపై పోరును ఒక అత్యవసర ఉద్యమంగా చేపట్టాలి. పర్యావరణం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం, భావితరాలకు సురక్షితమైన జీవితం కోసం...ప్లాస్టిక్ బ్యాగులు, బాటిల్స్ తదితర వస్తువులను బహిష్కరించాలి. క్లాత్ బ్యాగుల వాడకాన్ని ప్రారంభించాలి. ఇందుకు అన్ని వర్గాల ప్రజలూ స్వచ్ఛందంగా పూనుకుంటేనే సాధ్యం.
(వ్యాసకర్త జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు,
సంగారెడ్డి జిల్లా)
డా|| కె.శివబాబు