Oct 21,2022 07:14

దేశంలో ఇటీవల కాలంలో హిందీ, హిందూ, హిందుస్తాన్‌ పేరుతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలి. ఇవి ప్రాంతాల మధ్య విబేధాలు, విద్వేషాలు పెంచుతాయి. వీటి కారణంగా దేశంలో మాతృభాషలు ఉనికిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. హిందీ ఒక్కటే అధికార భాష కాదు. దీనిని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని శాసనమండలిలో పిడిఎఫ్‌ పక్ష నేత విఠాపు బాలసుబ్రమణ్యం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం హిందీని రుద్దే ప్రయత్నాల నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రజాశక్తి ప్రతినిధి పి.బాలకృష్ణకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...

                                                ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పాటిస్తోన్న భాషా విధానం ఏమిటి ?

దేశంలో ప్రభుత్వ భాషా విధానం దాని రాజకీయ దృక్పథంతో ముడిపడి ఉంది. హిందీ, హిందూ, హిందూస్తాన్‌ అనేవి అందులో విభాగాలు. దీనికనుగుణంగా హోం శాఖ ఓ భాషా విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. సెప్టెంబర్‌ 14ను హిందీ దివస్‌గా కేంద్రమే పూనుకొని దేశమంతా నిర్వహిస్తోంది. హిందీ తెలిసిన ఉద్యోగులు ఎంత మంది? ఎన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు హిందీలో జరుగుతున్నాయి? ఏం జరగడం లేదు? ఏ కార్యకలాపాలు హిందీలో జరుగుతున్నాయి? అనే లెక్కలను ప్రతి శాఖలో తీసుకోవడం మొదలుపెట్టారు. జాతీయ స్థాయి సమీక్షలు హిందీలోనే జరుగుతున్నాయి. హిందీ యేతర రాష్ట్రాల అధికారులను అవమానిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నేతలందరూ హిందీలో ప్రసంగిస్తున్నారు. మన్‌కీ బాత్‌, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లాంటి హిందీ నినాదాలను జనం గుండెల్లో ముద్ర పడేలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంగ్లీష్‌ కనుమరుగయ్యేలా చర్యలు తీసుకోవడం మొదలైంది. హిందీలో మాట్లాడనందుకు రాజ్యసభ సభ్యురాలు కనిమొళిని విమానాశ్రయంలో ''నువ్వు భారతీయురాలివేనా?'' అని ప్రశ్నించారు. హిందీ రానివారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడం మొదలైంది. హిందీతో పాటు సంస్కృతానికి ప్రాముఖ్యత పెంచుతున్నారు. ఇంగ్లీష్‌ను, ప్రాంతీయ భాషలను దూరం పెడుతున్నారు. అధిక సంఖ్యాక జాతీయవాదంలో భాగమిది.
 

                                                ఇటీవల కేంద్రం మరింత దూకుడు ప్రదర్శిస్తున్నట్లుంది ?

అవును, అమిత్‌షా నాయకత్వాన పార్లమెంట్‌ ప్యానల్‌ ప్రస్తుత భాషా విధానాన్ని మొత్తంగా తిరగతోడే దుర్మార్గానికి సిద్ధపడింది. ఏవి భారతీయ భాషలు? ఏది అధికార భాష? ఏది కామన్‌ భాష? ఏది అనుసంధాన భాష? అనేవన్నీ తిరగతోడి రాష్ట్రపతికి గత నెలలో 112 సిఫార్సులను సమర్పించింది. వీటి ప్రకారం కేంద్ర ఉన్నత విద్యాసంస్థలన్నింటా హిందీ మీడియమే ఉండాలి. వైద్యం, సాంకేతిక, సాంకేతికేతర సబ్జెక్టులన్నీ కూడా హిందీలోనే బోధించాలి. కేంద్రీయ విద్యాలయాల్లో ఇంగ్లీష్‌ స్థానే హిందీ మాద్యమంలో ఉండాలి. ఉద్యోగ నియామక పరీక్షలు హిందీలోనే జరగాలి. 11 హిందీ రాష్ట్రాల్లో కోర్టు కార్యకలాపాలు హిందీలోనే నడవాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ హిందీ తప్పనిసరి. కేంద్ర శిక్షణా శిబిరాలు, ఐఎఎస్‌, ఐపిఎస్‌ శిక్షణా తరగతులు ఇక హిందీలోనే నడుస్తాయి. ఇంగ్లీష్‌ నైపుణ్య పరీక్షల విధానాన్ని కేంద ప్రభుత్వ ఉద్యోగులకు తొలగిస్తున్నారు. కామన్‌ భాషగా ఇక హిందీ ఉంటుంది. దీనికి అనుగుణంగా ఇంజినీరింగ్‌, ఐఐటి సంస్థల్లో సర్వే జరిపారు. హిందీ ప్రాంతాల్లో రాజకీయంగా మరింత నిలదొక్కుకోవడం కూడా కేంద్రం లక్ష్యంగా కనిపిస్తుంది.
 

                                                               ఇందంతా రాజ్యాంగ సమ్మతమేనా ?

ఇలా హిందీ లాంటి ఓ భాషను రుద్దే ప్రమాదం ఉందని గుర్తించి మన రాజ్యాంగ నిర్మాతలు ఎనిమిదో షెడ్యూల్లో మొదట 14 భాషలు చేర్చారు. అవి తర్వాత 22కు చేరాయి. అనుసంధాన భాషగా ఇంగ్లీషు కూడా కొనసాగించారు. మనకు జాతీయ (రాజ్య) భాష లేనే లేదు. అన్నీ అధికార భాషలే. అన్నింటికీ ఒకే ప్రతిపత్తి. మన రాష్ట్రాల ఏర్పాటే భాషా ప్రాతిపదికపై జరిగింది. 1960వ దశకంలో హిందీ వ్యతిరేక ఉద్యమం నడిచినప్పుడు హిందీయేతరులు కోరినంత కాలం ఇంగ్లీషు అనుసంధాన భాషగా కొనసాగుతుందని నెహ్రూ హామీ ఇచ్చారు. 1968, 1976 తీర్మానాలు కూడా ఇదే చెబుతున్నాయి. ప్రస్తుత 'హిందీ రుద్దుడు' పూర్తి రాజ్యాంగ వ్యతిరేక చర్య. మన ఫెడరల్‌ వ్యవస్థకే విరుద్ధం.

                              దేశంలో హిందీకున్న స్థానమేమిటి ? అది జాతీయ అవసరాలన్నింటినీ తీర్చగలదా ?

దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి హిందీ యేతర భాషలను మాతృభాషలుగా గలవారి సంఖ్యే ఎక్కువ. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌ అధికారికంగా గుర్తించిన 22 భాషల్లో హిందీ కూడా ఒకటి. అంతకుమించి ఎటువంటి ప్రత్యేకతను రాజ్యాంగం ఇవ్వనప్పుడు దేశంలో కామన్‌ లాంగ్వేజి హోదా హిందీకి ఎప్పుడు వచ్చిందో కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి. 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న భాషలు కాకుండా, 10 వేల మందికి తక్కువ కాకుండా ప్రజలు మాట్లాడే 100కు పైగా నాన్‌షెడ్యూల్డ్‌ భాషలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ రకాల సమూహాలకు 1,800 రకాల మాతృభాషలు వున్నాయని అంచనా! ఇవి కాకుండా గుర్తింపునకు నోచుకోని భాషలు, ప్రాంతాలను బట్టి మారే యాసలు కూడా ఉన్నాయి. 1961లో హిందీ మాట్లాడే వారి సంఖ్య 30.39 శాతం ఉండగా, 2011 నాటికి 43.63 శాతానికి పెరిగింది. ఇలా పెరగడానికి కారణం ఇతర భాషలను దెబ్బతీయడమే. స్వాతంత్య్రం వచ్చే నాటికి హిందీ రాష్ట్రాల్లో అవధి, భోజ్‌పురి, మైథిలి, మగథ వంటి భాషలను మాట్లాడే వారు అత్యధికులు ఉండేవారు. ఇవి చాలా సుసంపన్న సాహిత్యం కలిగినవి. తులసీదాస్‌ రామ్‌చరిత మానస్‌ను అవధి భాషలో రాశారు. వేటికవిగా విలసిల్లుతున్న ఇటువంటి భాషలన్నింటిని హిందీలో కలిపేశారు. అయినా, ఇప్పటికీ హిందీ యేతరలు దాదాపు 60 శాతం ఉండటం గమనార్హం. నేటికీ ఉత్తర ప్రదేశ్‌ గ్రామాల్లో బీహార్‌ హిందీని ఎవరూ అర్ధం చేసుకోలేరన్నది వాస్తవం. రాజ్యాంగంలోని 351వ ఆర్టికల్‌ హిందీకి ప్రాధాన్యత పెంచాలని చెబుతుంది. దీనిని సాకుగా తీసుకున్నారు. హిందీ మన ఆధునిక శాస్త్ర సాంకేతిక అవసరాలను తీర్చాలంటూ దానిని సంస్కృతీకరించేందుకు పూనుకున్నారు. కాలం చెల్లిన సంస్కృతంతో హిందీని సజీవం చేయాలని మొరటు ప్రయత్నం మొదలుపెట్టారు.
 

                                         పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సిఫార్సుల ప్రభావం ఎలా ఉంటుంది ?

స్థానిక భాషల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం లాంటివి దక్షిణాది భాషలే కాకుండా మరాఠీ, బెంగాలీ, ఒరియా లాంటివి చాలా సుసంపన్న ప్రాచీన భాషలు. ఆధునిక భారతీయ విధానంలో వాటి స్థానం వెలకట్టలేనిది. హిందీని రుద్దడం అనేది సాంస్కృతిక భిన్నత్వానికి సమాధి కడుతుంది. దీంతో జాతుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఇదే అన్నింటికన్నా ప్రమాదం. బిజెపికి కావాల్సింది కూడా అదే. ఇక హిందీ మాట్లాడేవారికే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తాయి. హిందీ ఉపాధి భాషగా మారుతుంది. ప్రాంతీయ భాషలవారు హిందీవారితో పోటీ పడలేరు. హిందీ ప్రాభల్యం కూడా ముదురుతుంది. ఫెడరల్‌ వ్యవస్థ బీటలు వారడంతో రాష్ట్రాల మధ్య బేధాలు తీవ్రమవుతాయి. కలహాలు ముదిరి అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తాయి. దేశ సమగ్రతకే ప్రమాదం తలెత్తుతుంది.
 

                                                           ఉపాధిపై దీని ప్రభావం ఎలా ఉంటుంది ?

వాస్తవానికి మెజార్టీ ఉద్యోగాలు రాష్ట్రాల్లోనే ఉంటాయి. రాష్ట్రాల్లోనే కేంద్ర కార్యాలయాలు, సంస్థలు కూడా స్థానిక అవసరాలు తీర్చాల్సి ఉంటుంది. ఇక ప్రయివేటు రంగం అంతర్జాతీయ సంస్థలతో ముడిపడి ఉంది. దీనికి ఇంగ్లీషు తప్పనిసరి. విదేశాల్లో చదవాలంటే ఇంగ్లీషు తప్పనిసరి. ఇలా చూస్తే మెజార్టీ ప్రజానీకానికి ఉపాధి కోసం హిందీ అవసరమే లేదు. కాని హిందీ రుద్దుడు ప్రభావం వల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో హిందీయేతరులు తీవ్రంగా నష్టపోతారు. తమిళనాడు, కేరళవారు పరిశోధనా రంగంలో ఎక్కువ ఉద్యోగాలు పొందుతున్నారు. ఇక ఇవి హిందీ వారికే వెళ్లిపోతాయి. ఈ విధానం ఇంగ్లీషును దెబ్బతీస్తుంది. దీంతో ఇంగ్లీషుతో ముడిపడే ఉద్యోగాలు దొరకవు. చైనా, జర్మనీ, జపాన్‌, కొరియాలలో లాగా మనకు దేశం లోపల గొప్ప ఉపాధి అవకాశాలులేవు. ఈ ఉపాధి సంక్షోభాన్ని, దీని పర్యవసానాలను తలచుకుంటేనే భయమేస్తుంది.
 

                                  'నూతన విద్యా విధానం' అమలులో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయా ?

అసలు నూతన విద్యా విధానమే ఈ రాజకీయ విధానంలో భాగం. అది చాలా స్పష్టంగా త్రిభాషా సూత్రానికి చెల్లు చీటీ ఇచ్చింది. ఉత్తరాది విద్యా సంస్థల్లో హిందీయేతర భాషల స్థానే సంస్కృతాన్ని ప్రతిష్టించి హిందీ తప్ప మిగిలిన భాషలన్నింటినీ నిర్వీర్యం చేసేందుకు పూనుకుంది. ప్రాంతీయ భాషల అభివృద్ధికి అందులో ఏ నిర్దిష్ట ప్రతిపాదనా లేదు. అది చెప్పుకోవాల్సిన భారతీయ వారసత్వం, జ్ఞాన సంస్థలు, జ్ఞాన సంపద లాంటివన్నీ సాంస్కృతిక భూమికగా గలవే తప్ప మరేమీ కావు. ఎవరేం చెప్పినా ఏం చేసినా ప్రస్తుత ప్రభుత్వంలో అన్నీ హిందుత్వ ఎజెండాలోని భాగంగానే ఉంటాయి.
 

                                                        మన భాషా విధానం ఎలా వుండాలంటారు ?

రాజ్యాంగంలో పేర్కొన్న 22 భాషలకు సమాన ప్రతిపత్తి ఉండాలి. కేంద్రం వాటిని సమానంగా అభివృద్ధి చేయాలి. ఉద్యోగ, ఉపాధి పరిశోధనా రంగాల్లో ఆధునిక అవసరాలకు తగ్గట్టు వాటిని ఆధునికీకరించాలి. హిందీ ప్రాంతాల్లో హిందీయేతర భాష ఒకటి తప్పని సరిగా పాఠ్యాంశం కావాలి. దీనికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇంగ్లీషు స్థానాన్ని ప్రస్తుతం కదిలించాల్సిన అవసరం లేదు.హిందీ ఒక కామన్‌ భాషగా ఎదిగే అవకాశం మనలాంటి దేశంలో సాధ్యం కాదు. పాఠశాల విద్య తప్పనిసరిగా మాతృభాషలో జరగాలి. ఉన్నత విద్యా సంస్థల్లో ఇంగ్లీషు, స్థానిక భాషల్లో బోధన ఉండాలి. ఏ భాషలో నేర్చుకున్నా ఆధునిక జ్ఞానం అందేలా మన విద్యా సంస్థలు ఉన్నప్పుడు భాష ఒక సమస్య కాదు. ఈ రోజుల్లో వ్యవహారిక అవసరాలకు మరో భాష నేర్చుకోవడం ఇప్పుడు చాలా సులువైందని గుర్తించుకోవాలి. ఉద్యోగ అవకాశాలు దేశమంతా సమానంగా ఉండాలి. దీనికి కేంద్రం ఆదర్శంగా నిలబడాలి. భాషా బాహుళ్యం సాంస్కృతిక బాహుళ్యానికి పునాది అనేది మరిచిపోకూడదు. భాషా బోధనలు, ఆధునిక పద్ధతులు, పరికరాలు చాలా అవసరం.
 

                                  హిందీ రుద్దుడుకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలపై మీ స్పందన ?

తమిళనాడులో మాత్రమే 1960 దశకంలో హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగింది (నిజానికి తమిళ ఆత్మగౌరవ ఉద్యమం). ఈసారి దక్షణాది రాష్ట్రాలు, ఈశాన్య భారతం కూడా ఒకే గొంతుతో నిలదీస్తున్నాయి. బెంగాల్‌, మహారాష్ట్రలు కూడా వీటిలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మంచి పరిణామం. ఒక్క హిందీనే కాదు. కేంద్రం విద్యుత్‌ మీటర్ల నుండి కార్మిక చట్టాల దాకా రాష్ట్రాలపై రుద్దుతున్నది. దీంతో ఒకే గొలుసుగా ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాలు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం బాధాకరం. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం ఉన్నా హిందీని రుద్దడాన్ని ముఖ్యమంత్రి వ్యతిరేకించారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలో నిరసన తెలుపుతున్నారు. మన రాష్ట్రంలో ఒక్క వామపక్షాలు మినహా ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలేవీ నోరు మెదపక పోవడం ఘోరమైన విషయం. ఈ పరిస్థితుల్లో భాషా సాంస్కృతిక సంస్థలు, ప్రజాసంఘాలు, విద్యారంగ సంస్థలు, మేధావులు ముందు పీఠిన నిలబడి పోరాడాల్సి ఉంది. సామాజికోద్యమ సంస్థలన్నీ కలిసి పాఠ్య పుస్తకాలపై హిందుత్వ దాడిని ఎదుర్కోవడం మనకు ఆదర్శం కావాలి. తెలుగు నాట మరో భాష, సాంస్కృతిక పునరుజ్జీవనం అవసరమనిపిస్తుంది.