
విద్య, వైద్యం, ఆకలి, నిరుద్యోగం వంటి విషయాలను ఎన్‌డి టి.వి చర్చించడం మోడీ బృందానికి రుచించడంలేదు. 2014లో జాతీయ భద్రత నెపంతో ఎన్‌డి టీవీని ఒక రోజు నిషేధించింది మోడీ ప్రభుత్వం. ఆ వెంటనే ఇ.డి, ఐ.టి దాడులు జరిగాయి. 2017లో బ్యాంక్‌ను మోసం చేశారనే అభియోగం కూడా మోపారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలే పత్రికా స్వేచ్ఛను నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రభుత్వాలను నిలదీసేవాటిని సామ దాన భేద దండోపాయాల తో లొంగదీసు కుంటున్నారు.
పత్రికా స్వేచ్ఛను నిలబెడుతూ, తమ ఉనికిని చాటుకుంటూ...ప్రభుత్వాలను నిలదీస్తున్న జాతీయ మీడియా చానళ్ళ మీద, వాటి యాజమాన్యాల మీద ప్రభుత్వ ప్రత్యక్ష, పరోక్ష దాడులు తీవ్రమైనాయి. ఇప్పటికే 95 శాతం జాతీయ మీడియా చానళ్లు మోడీ అస్మదీయుల చేతుల్లో ఉన్నాయి. గతంలో 'కారవాన్, ఎన్‌డి టివి' లాంటి కొన్ని వార్తా సంస్థలను దేశద్రోహ సంస్థలుగా కూడా ప్రకటించాయి. యూట్యూబ్ న్యూస్ మీడియాకు సంబంధించిన వారిని సైతం అతి చిన్న కారణాల మీద అరెస్టు చేస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు అందిస్తున్న మహమ్మద్ జుబేర్ జైల్లో ఉన్నాడు. వినోద్ దుబే, కరణ్ థాపర్, రవీష్ కుమార్ లాంటి వారెందరో మానసిక భౌతిక దాడులకు గురయ్యారు. ప్రభుత్వ అడ్డగోలు చర్యలను జాతీయ స్థాయిలో ప్రజలకు విమర్శనాత్మకంగా అందిస్తూ మన్ననలు పొందిన ఏకైక మీడియా సంస్థగా పేరొందిన ఎన్‌డి టివి పై చేస్తున్న అనాగరిక, ఆధిపత్య దాడి పత్రికా స్వేచ్ఛకు ఆఖరి మేకుగా అనిపిస్తున్నది.
ఇప్పటికే దేశ వనరులను, రోడ్డు, రైలు, నౌకా, వాయు రవాణా వ్యవస్థలను, విద్యుత్ వాణిజ్య రంగాలను తన గుప్పిట్లో పెట్టుకున్న అదానీ ఎన్‌డి టీవీని స్వాధీనపరుచుకున్నాడు. దుర్మార్గం ఏమిటంటే ఆ సంస్థ వ్యవస్థాపకులతో సంప్రదించడం గానీ, యాజమాన్యానికి తెలియచేయడంగానీ జరగకుండా ఆర్థిక చట్రంలో ఇరికించి దోపిడీ చేశారు. వాటాదారులకు గానీ అందులో పని చేసే సిబ్బందికి గానీ తెలీకుండానే 29.18 శాతం వాటాను అదానీ సొంతం చేసుకున్నాడు. దీనికి తోడు సంస్థలోని మరో 26 శాతం (రూ.493 కోట్లు) షేర్లు అమ్మడానికి సిద్ధపడి, దీనిని స్థాపించి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రముఖ జర్నలిస్టులు ప్రణరు రారు, రాధికా రారు దంపతులను నిలువునా మోసం చేశారు. దీని వెనుక ఉన్న భయంకరమైన ఆర్థిక, రాజకీయ కోణం దుర్మార్గమైనది.
అదానీ మోడీల స్నేహ బంధం జగద్వితమే. బొగ్గును కూడా వదలని జంట ఇది. మన దేశంలో బొగ్గు వనరులకు కొదవ లేదు. కానీ విదేశాల్లో అదానీకి ఉన్న బొగ్గు గనుల నుండి 10 శాతం బొగ్గు కొనుగోలు చేయాల్సిందిగా కోల్ ఇండియాను ఆదేశించింది ప్రభుత్వం. మన దేశంలో బొగ్గు ధర తక్కువ. విదేశీ బొగ్గు ధర మనతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ. అయినా 20 మిలియన్ టన్నుల విదేశీ బొగ్గు దిగుమతికి ఆర్డర్ చేసి అందులో 17.3 మిలియన్ టన్నుల బొగ్గును అదానీ కి విదేశాల్లో ఉన్న బొగ్గు కంపెనీ నుండి కొనడానికి ఈ ప్రభుత్వం సాహసించిందని బ్లూమ్ బెర్గ్ రిపోర్ట్ చెపుతున్నది. ప్రతిష్టాత్మక విశాఖ ఉక్కు బొగ్గు లేక అతలాకుతలమై అదానీ చేతిలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న విషయం మనకు తెలుసు. 2022 జూన్ లో శ్రీలంకలో 500 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్‌ను అదానీ కి ఇమ్మని ప్రధాని సిఫారసు చేయడం, అది బయటపడి మోడీ పరువు పోవడం కూడా జరిగింది. ఈ వ్యవహారం క్రోనీ కేపిటలిజానికి పరాకాష్ట. దేశంలోని 6 ప్రధాన ఎయిర్ పోర్టులను ప్రైవేట్‌పరం చేయడానికి నిర్ణయించి ఆ కాంట్రాక్టులను అదానీకే ఇవ్వడాన్ని ఏమనాలి ?
మోడీ 2014లో గుజరాత్ సి.ఎం గా ఉన్నప్పుడు 45 వేల ఎకరాల భూమిని (చదరపు మీటరు ఒక రూపాయి చొప్పున) కారుచౌకగా అదానీకి లీజుకు ఇచ్చారనే ఆరోపణ ఉంది. 2017లో బ్యాంకులు అదానీకి చెందిన రూ.72,000 కోట్ల రుణ మాఫీ చేశాయి. 2018లో అదానీకి పెద్ద మొత్తంలో ఎన్‌పిఎ లు (నాన్ ప్రాఫిటబుల్ అసెట్లు) ఉన్నాయని బిజెపి నేత సుభ్రమణ్యస్వామి ఎద్దేవ చేశాడు. పన్ను మినహాయింపులు, వడ్డీ లేని లేదా అతి తక్కువ వడ్డీ లోన్లను అదానీ చేతిలో పెట్టిన సందర్భాలెన్నో. ఇవేమీ మనకు టీవీ లోనూ వార్తల్లోనూ కనబడవు. ఉన్నా ఎక్కడో మూల చిన్న వార్తగా జారిపోతాయి. అన్ని జాతీయ మీడియా ఛానళ్లలో మొత్తం హిందూ-ముస్లిమ్ మధ్య చిచ్చు పెట్టే వార్తలు ఉండాలని సొంత వార్తా సంస్థలకు సంకేతాలు ఇస్తారు.
ఈ నేపథ్యంలో విద్య, వైద్యం, ఆకలి, నిరుద్యోగం వంటి విషయాలను ఎన్‌డి టి.వి చర్చించడం మోడీ బృందానికి రుచించడంలేదు. ఒక న్యూస్ ఏజెన్సీ చేసిన సర్వే ప్రకారం ఎన్‌డి టి.వి హిందూ-ముస్లిం సమస్యలను అతి తక్కువ సంఖ్యలో చర్చించిందని, అవి కూడా మత సామరస్యత పెంపొందించే దిశగానే జరిగాయని నివేదించింది. కానీ 2014లో జాతీయ భద్రత నెపంతో ఎన్‌డి టీవీని ఒక రోజు నిషేధించింది మోడీ ప్రభుత్వం. ఆ వెంటనే ఇ.డి, ఐ.టి దాడులు జరిగాయి. 2017లో బ్యాంక్‌ను మోసం చేశారనే అభియోగం కూడా మోపారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలే పత్రికా స్వేచ్ఛను నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రభుత్వాలను నిలదీసేవాటిని సామ దాన భేద దండోపాయాలతో లొంగదీసుకుంటున్నారు. 2022 ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ప్రకారం 180 దేశాలలో భారత్ ది 150వ స్థానం అంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే అనేక మంది జాతీయ స్ధాయి జర్నలిస్టులు వీరి ఆగడాలను భరించలేక సొంత యూట్యూబ్ న్యూస్ చానళ్లు పెట్టుకుని తమ బాధ్యతను నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ వీరిని వదలడం లేదు. కానీ, ఎన్‌డి టి.వి ని లొంగదీసుకున్న విధానం అత్యంత హేయమైనది. ఇప్పుడు రెండే ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. అడిగినంత మొత్తం ఇచ్చి ప్రణరు రారు దీన్ని కొనుక్కోవచ్చు. అంత డబ్బే ఉంటే ఈ వ్యవహారం ఇంతవరకూ వచ్చేదే కాదుగా? రెండవది ఎవరైనా మరొక పెద్ద పారిశ్రామికవేత్త దీనిని సొంతం చేసుకోవచ్చు. కానీ అదానీని మించి ఆసియాలో మరో పెద్ద పారిశ్రామికవేత్త లేడు. ఉన్నా బయటకి వచ్చి మోడీతో ఢ కొనడు. ఈ మొత్తం వ్యవహారం ఒక కుట్రపూరిత పథక రచనగా జరిగిందని అర్ధమవుతున్నది. మున్ముందు ఎన్‌డి టి.వి కూడా గోడీ మీడియాగా మారుతుందా? ప్రణరు రారు, నిధి కులపతి, మనోరంజన్ భారతి, రవీష్ కుమార్, విష్ణు సోమ్, సాకేత్ ఉపాధ్యారు, శ్రీనివాసన్ జైన్ లాంటి నిబద్ధతగల జర్నలిస్టుల భవిష్యత్ ఏమిటి? అనేది కాలమే నిర్ధారిస్తుంది.
డా|| మాటూరి శ్రీనివాస్