Dec 28,2022 07:38

రాష్ట్రంలో ఏ మూల కార్మిక సమస్య తలెత్తినా నేనున్నానని సిఐటియు పలికింది.ప్రతి చోటా కార్మికుల హక్కుల కోసం పోరాడింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కార్పొరేట్లు, బహుళజాతి సంస్థల పక్షాన చేరాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ పేరుతో ప్రభుత్వ యంత్రాంగాన్ని, కార్మిక శాఖలు, ఫ్యాక్టరీ డిపార్ట్‌మెంట్‌, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ వంటి సంస్థలను పని చేయకుండా నిర్వీర్యం చేస్తున్నది. యజమానులకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు జరిపే ఏకైక మార్గమే కార్మిక వర్గానికి మిగిలింది. ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగించినా ''ఐక్యత - పోరాటం'' నినాదంతో ముందుకెళ్ళడమే ఏకైక పరిష్కారం.

స్వాతంత్య్రం ముందు నుంచి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మార్చి 4 లేబర్‌ కోడ్‌లు తెచ్చింది కేంద్ర బిజెపి ప్రభుత్వం. కార్మికులను బానిసలుగా మార్చి నిర్బంధంగా పని చేయించుకుని దోపిడీని తీవ్రం చేయడానికి ప్రయత్నిస్తున్నది. పెట్టుబడిదారీ విధానం అత్యంత లాభాలు గడించే దశ (క్రోనీ కాపిటలిజం) కాలంలో ఉన్నాం. అతి తక్కువ జీతాలిచ్చి అతి ఎక్కువ పని చేయిస్తున్నారు. అత్యాధునీకరణతో పరిశ్రమల్లో ఉపాధి రహిత ఉత్పత్తి సాగుతున్నది. యస్‌.ఇ.జెడ్‌ ల పేరుతో కార్మిక చట్టాలు అమలు చేయకుండా కార్మికులతో చౌకగా (చీప్‌ లేబర్‌) పని చేయిస్తున్నది. 2006లో 20 వేల మందితో స్థాపించిన బ్రాండెక్స్‌ కంపెనీలో నెల జీతం నేటికీ రూ.10 వేల లోపే. ఒక వైపున కోవిడ్‌ కష్టాల్లో కార్మికులు కూరుకుపోయారు. పనులు పోయాయి. ఉన్న జీతాలు తగ్గాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి వైద్యానికి అప్పులు చేయవల్సి వచ్చింది. ఆపదలోని కార్మికవర్గాన్ని ప్రభుత్వాలు ఆదుకోలేదు. నెలకు రూ. 7,500 కనీస సహాయం ప్రతి అర్హులైన పేదలకు ఇవ్వాలని ఆందోళన చేసినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇదే అదునుగా కార్మికులపై దాడులు తీవ్రతరం చేశాయి. ఈ ఆపద కాలంలో సిఐటియు శక్తిని మించి రూ. 5 కోట్లు వసూలు చేసి కోవిడ్‌ బాధితులను ఆదుకోవడానికి కృషి చేసింది. మందులు, కిట్లు పంచింది. కోవిడ్‌ సెంటర్లు నడిపింది. నిత్యావసర సరుకులు పంచింది. అన్నింటిని మించి వలస కార్మికుల ఆకలి తీర్చడానికి, వారిని గమ్యాలకు చేర్చడానికి కృషి చేసింది. కోవిడ్‌ కాలంలో అంగన్‌వాడీ, ఆశా, వైద్య కార్మికులను 'సైనికులుగా' పొగిడిన మోడీ ... చనిపోయిన వారికి నేటికీ నష్టపరిహారం ఇవ్వలేదు.కొత్త యాప్‌లతో వీరిపై పని భారం పెరిగింది. కోవిడ్‌ కాలంలో కూడా మున్సిపల్‌, బిల్డింగ్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌, విద్యుత్‌ కార్మికులు పోరాడి తమ హక్కులను నిలబెట్టుకున్నారు.
          ఢిల్లీ చుట్టూ లక్షలాది మంది పాల్గొన్న రైతాంగ ఉద్యమం తర్వాత ... ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవడానికి...దేశంలోకెల్లా జరుగుతున్న భారీ పోరాటం విశాఖ ఉక్కు ఉద్యమం. నేటికి సుమారు 2 సంవత్సరాల నుంచి నిరంతరం సాగుతున్న ఉద్యమం ఇది. బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీల సభ 2020 ఫిబ్రవరి 18న స్టీల్‌ ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. జాతీయ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులతో స్టీల్‌ ప్లాంట్‌ గ్రౌండ్‌లో భారీ సభ, 10 వేల మందితో పది కిలోమీటర్ల మానవహారం, యువతీయువకుల 5కె వాక్‌ లాంటి భారీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 'విశాఖ స్టీల్‌ను అమ్మనివ్వం' అనే ఏకైక నినాదంతో యావత్తు కార్మికులు, అధికారులు 'కాంట్రాక్టు కార్మికుల పోరాట కమిటీ'ని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో పోరాటం నడిపించడంలో సిఐటియు చొరవ తీసుకుంది. ఢిల్లీ నుంచి కిసాన్‌ మోర్చా నాయకులను రప్పించి విశాఖ బీచ్‌లో భారీ సభ నిర్వహించింది. కేంద్ర బిజెపి ఒకవైపున దేశ భక్తిని జపిస్తూ మరో వైపున విశాఖ స్టీల్‌ను దక్షిణ కొరియాకు చెందిన 'పోస్కోకు' కట్టబెట్టాలనే ప్రయత్నాలను అడుగడుగునా చేస్తున్నది. దీనిని అడ్డుకోవడంలో సిఐటియు ముందున్నది. విశాఖ స్టీల్‌కు మద్దతుగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ కోటి సంతకాల ఉద్యమం సాగింది. ఇది ప్రజల ఉద్యమంగా మారింది.
           విశాఖ ఎల్‌.జి పాలిమర్స్‌లో (7.5.2020) స్టెరైన్‌ లీక్‌ అయి 15 మంది చనిపోయారు. 10 వేల మంది ప్రజలు స్టెరైన్‌ ప్రభావానికి గురయ్యారు. యాజమాన్యం కాలం చెల్లిన ట్యాంకుల్లో స్టెరైన్‌ నిల్వ చేయడం, ఉష్ణోగ్రతను నియంత్రించకపోవడం, కనీసం ప్రమాదం జరిగిన వెంటనే అలారం కూడా మోగించకపోవడం లాంటి ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన 6 కమిటీలు ఏకగ్రీవంగా తమ నివేదికల్లో పేర్కొన్నాయి. చనిపోయిన వారికి కోటి రూపాయలు, గాయపడిన వారికి రూ. 10 లక్షల నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఎల్‌.జి దక్షిణ కొరియా డైరక్టర్లు నెల రోజులు విశాఖ సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు సుమోటోగా కేసును విచారించి యాజమాన్యంతో రూ. 50 కోట్లు హైకోర్టు వద్ద డిపాజిట్‌ చేయించింది. నేటికీ రాష్ట్ర ప్రభుత్వం వైద్యం, ఇతర విషయాలపై చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదు. దీనికి వ్యతిరేకంగా 2021 జూన్‌ 6న సిఐటియు ఆధ్వర్యంలో 'చలో పాలిమర్స్‌' పిలుపునిచ్చింది. వందలాది మంది పాల్గొన్నారు. పోలీసులు వంద మందికి పైగా అరెస్టు చేసి కేసులు పెట్టారు. బహుళజాతి సంస్థకు చెందిన దక్షిణ కొరియా దేశంలోని ఎల్‌.జి కంపెనీ ఎదురుగా అక్కడి ప్రజలు విశాఖ బాధితులకు సంఘీభావంగా నిరసనలు తెలిపారు.
          కనీస వేతనం, ఎనిమిది గంటల పని, బోనస్‌, ఇతర కార్మిక చట్టాలు అదానీ పోర్టులో అమలు కావడం లేదు. యాజమాన్యం కార్మికుల సంఖ్య తగ్గించాలని, కరోనా పేరుతో అక్రమ తొలగింపులు చేపట్టింది. కార్మిక చట్టాల అమలు,
           ఉద్యోగ భద్రత, బకాయిల సాధన డిమాండ్లతో కార్మికులు నిరంతర పోరాటాలు చేస్తున్నారు. చలో పోర్టు, చలో కలెక్టరేట్‌, కలెక్టరేట్‌ వద్ద 34 రోజులు నిరవధిక ధర్నా, పోర్టు గర్జన, కుటుంబ సభ్యులతో సామూహిక నిరసన, పోర్టు గేటు వద్ద 16 రోజుల శిబిరంతో పాటు ప్రత్యేక నాటిక రూపకల్పన, ఫోటో ఎగ్జిబిషన్‌, వీడియో డాక్యుమెంటరీ, 7,500 పోస్టర్లు, 90 వేల కరపత్రాలు, గోడల మీద రాతలు, ఫ్లెక్సీలతో ప్రచార కార్యక్రమాల ద్వారా కార్మికుల పోరాటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, నిర్వాసితులు, మత్స్యకారుల మద్దతు కూడగట్టి ప్రచారం చేసినందు వల్లనే ఈ ఉద్యమం ఎంతో కాలం కొనసాగుతూ ఉన్నది. 2022 ఆగస్టు 8 నుండి 16 వరకు సాగిన కార్మిక పోరాట ఫలితంగా జీతాలు పెరిగాయి. బోనస్‌ చెల్లించారు. ఇది కార్మికుల విజయం. నెల్లూరు జిల్లా దామోదర సంజీవయ్య జెన్‌కో విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని, ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని గత 400 రోజులుగా ఈ ఉద్యమం కొనసాగుతోంది. 2020 జనవరి 21న రాష్ట్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యాన అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు 'థర్మల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కమిటీ'గా ఏర్పడి వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నాయి.
           రాష్ట్రంలో ఏ మూల కార్మిక సమస్య తలెత్తినా నేనున్నానని సిఐటియు పలికింది. ప్రతి చోటా కార్మికుల హక్కుల కోసం పోరాడింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కార్పొరేట్లు, బహుళజాతి సంస్థల పక్షాన చేరాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ పేరుతో ప్రభుత్వ యంత్రాంగాన్ని, కార్మిక శాఖలు, ఫ్యాక్టరీ డిపార్ట్‌మెంట్‌, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ వంటి సంస్థలను పని చేయకుండా నిర్వీర్యం చేస్తున్నది. యజమానులకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు జరిపే ఏకైక మార్గమే కార్మిక వర్గానికి మిగిలింది. ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగించినా ''ఐక్యత - పోరాటం'' నినాదంతో ముందుకెళ్ళడమే ఏకైక పరిష్కారం.

/వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు/
సిహెచ్‌. నరసింగరావు

సిహెచ్‌. నరసింగరావు