లాస్‌ఏంజెల్స్ : వినోద రంగంలో దిగ్గజ కంపెనీలకు వ్యతిరేకంగా పదివేల మంది అమెరికన్ రచయితలు, నటీ నటులు చేపట్టిన చారిత్రాత్మక సమ్మె కొనసాగుతోంది. మూడేళ్లకొకసారి జరిగే కాంట్రాక్టు ఒప్పందంలో పెరిగిన ధరలకు అనుగుణంగా తమకు మొదటి సంవత్సరం 11 శాతం, రెండవ సంతవ్సరం 4 శాతం, మూడో సంవత్సరం 4 శాతం వేతన పెంపుదల ఉండాలని హాలీవుడ్‌కు చెందిన రచయితలు, నటీ నటులు, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్సు (ఎస్‌ఎజి-ఎఎఫ్‌టిఆర్‌ఎ) కోరుతుంటే, యజమాన్యాల అసోసియేషన్ (ఎఎంపిటిటిపి) మొదటి ఏడాది5 శాతం, రెండవ ఏడాది4 మూడవ ఏదాడి 3 శాతం మాత్రమే చెల్లిస్తానని మొండికేసింది. ప్రస్తుతం చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఈ సమ్మె వారాలు గడచి నెలల తరబడి సాగేలా ఉంది. ఈ సమ్మెను విఫలం చేయడానికి బైడెన్ ప్రభుత్వం అన్ని రకాలుగా దాడి చేస్తోంది. హాలీవుడ్ పరిశ్రమలో సమ్మెకు ఒక దేశం తరువాత ఒక దేశంలోని కార్మికవర్గం మద్దతు తెలుపుతున్నది. చలన చిత్ర, టెలివిజన్, మీడియా దిగ్గజ సంస్థలు తమ వర్క్‌ఫోర్స్(సిబ్బంది)ని గిగ్ వర్కర్ల స్థితికి కుదించివేసి, తమ లాభాలను గరిష్ట స్థాయికి పెంచుకోవాలని చూస్తున్నాయి. అమెజాన్ కంపెనీలో పని పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.కార్మికుల చేత యాజమాన్యం గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నది. కనీసం బాత్రూమ్‌కు వెళ్లి రావడానికి కూడా వీల్లేనంతగా పని ఒత్తిడి పెంచుతోంది. వేతనాల దగ్గరకొచ్చేసరికి అరకొర వేతనాలు చెల్లించి చేతులు దులిపేసుకుంటున్నది. లాస్‌ఏంజిల్స్ టైమ్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం హాలీవుడ్ టాప్ ఎగ్జిక్యుటివ్‌ల సగటు వేతనం 2021లో 28 మిలియన్ల డాలర్లు. అంటే రచయితల వేతనానికి దాదాపు 108 రెట్లు ఎక్కువన్న మాట. దీనికి వ్యతిరేకంగా న్యూయార్క్‌లోని నెట్ ఫ్లిక్స్ ప్రధాన కార్యాలయం ఎదుట 300 మంది నటీనటులు, రచయితలు పికెటింగ్ నిర్వహించారు. వీరికి రవాణా రంగ కార్మికులు హారన్ మోగిస్తూ తమ సంఘీభావం తెలియజేశారు.పాదచారులు కూడా వీరికి మద్దతుగా నిలిచారు. హాలీవుడ్‌లోని కార్పొరేట్ కంపెనీల దాడిని తిప్పికొట్టేందుకు అమెరికన్ రచయితలు, నటీనటులు సాగిస్తున్న పోరాటానికి సంఘీభావంగా లండన్, మాంఛెస్టర్‌లో కార్మికవర్గం ప్రదర్శనలు నిర్వహించింది.