పారిస్ : ఫ్రెంచ్ కమ్యూనిస్టు వార్తా పత్రిక 'ఎల్ హ్యూమనైట్' కార్యాలయంలో ఇటీవల దొంగలు పడి దాదాపు సమాచార సాంకేతిక పరికరరాలన్నిటినీ ఎత్తుకుపోయారు.120 ఏళ్ల చరిత్ర కలిగిన పత్రిక ఇటీవల డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించేందుకు అధునాతనమైన ఐటి పరికరాలను ఫ్రాన్స్, ఇతర దేశాల నుంచి వచ్చిన సంఘీభావ నిధుల సహకారంతో సమకూర్చుకుంది. పత్రిక ప్రతి యేటా నిర్వహించే భారీ సాంస్కృతిక ఉత్సవాల కోసం సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో ఈ చోరీ జరిగింది. అగంతకులు కార్మిక యూనిఫారమ్ ధరించి, అయిదు అంతస్తుల భవనంలో మొదటి అంతస్తులోని కిటికీని పగల గొట్టి లోపలికి ప్రవేశించి వీడియో ప్రొడక్షన్ యూనిట్, టెలికాన్ఫరెన్సింగ్ పరికరాలు, సెల్‌ఫోన్లు, ఇతర సాధనాలతోబాటు 50 కంప్యూటర్లను ఎత్తుకెళ్లినట్లు పత్రిక డైరక్టర్ ఫాబియన్ గే చెప్పారు. దీని వల్ల ఒక రోజు ప్రచురణ ఆగిపోయింది. రోజూ లక్ష కాపీలను ప్రచురించే పత్రిక ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసినప్పటికీ, అది రావడానికి సంవత్సరాలు పడుతుంది. ఈ లోగా తక్షణ ఖర్చులకు కూడా నగదు కొరత వుండడంతో అంతర్జాతీయ సంఘీభావ నిధి కోసం అప్పీలు చేసింది. దీనిని దొంగతనంగానే చూడరాదు, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఫ్రెంచ్ కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి ఫాబ్రియాన్ రస్సెల్ వ్యాఖ్యానించారు.