Aug 26,2023 14:52

నియామె :   ఫ్రెంచ్‌ రాయబారి సిల్వైన్‌ ఇట్టే ను నైగర్‌ ప్రభుత్వం బహిష్కరించింది. ఆయన 48 గంటల్లో దేశాన్ని విడిచి వెళ్లాలని నైగర్‌ సైనిక ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నైగర్‌ విదేశీ వ్యవహారాలు మరియు సహకార మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నైగర్‌ జాతీయ ప్రయోజనాలను అడ్డుకునేలా ఫ్రెంచ్‌ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. వాటితో పాటు నైగర్‌ నూతన విదేశాంగ మంత్రిని కలవాలన్న ఆహ్వానాన్ని ఫ్రెంచ్‌ రాయబారి నిరాకరించినట్లు తెలిపింది.
ఈ ఉత్తర్వులపై ఫ్రెంచ్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. నైగర్‌ సైనిక ప్రభుత్వ ఉత్తర్వులను తాము ఆమోదించబోమని తెలిపింది. తమ రాయబారిని ఉపసంహరించుకోవాలని ఆదేశించే అధికారం నైగర్‌ సైనిక ప్రభుత్వానికి లేదని ప్రకటించింది.