
దశాబ్దాల తరబడి మితవాద, నయా ఉదారవాద ప్రభుత్వాల నిరంకుశ పాలన కింద మగ్గిన కొలంబియాలో కొత్త శకం మొదలైంది. ఒక వామపక్ష నేత దేశ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం 212 ఏళ్ల కొలంబియా చరిత్రలో ఇదే మొదటిసారి. ఆయనతోబాటు నల్లజాతికి చెందిన ఒక మహిళ తొలిసారి ఉపాధ్యక్ష పదవిని చేపట్టనుండడం మరో విశేషం. జూన్ 19న జరిగిన రెండో రౌండ్ అధ్యక్ష ఎన్నికల్లో గుస్తావో పెట్రో, ఫ్రాంకియా మార్క్వెజ్ సాధించిన చారిత్రాత్మక విజయం కొలంబోకు మాత్రమే కాదు, యావత్ లాటిన్ అమెరికాకు ఎంతో స్ఫూర్తినిస్తున్నది. అదే సమయంలో ఈ ప్రాంతాన్ని తన పెరటి దొడ్డిగా భావించి, తన అభీష్టాన్ని బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఈ తీర్పు చెంపపెట్టు. కొలంబో రాజకీయాలు మితవాద, కన్జర్వేటివిజం నుంచి వామపక్ష, అభ్యుదయం వైపు మొగ్గుతున్నాయనడానికి ఈ ఫలితాలు ఒక సంకేతం. మే 29న జరిగిన మొదటి రౌండ్ ఎన్నికలకు, ఆదివారం జరిగిన రెండో రౌండ్ ఎన్నికలకు మధ్య ఓటింగ్ సరళిలో తేడాను పరిశీలిస్తే మితవాద శక్తుల పని పూర్తిగా అయిపోయిందనుకుంటే పొరపాటు. ఆర్గురు అభ్యర్థులు బరిలో నిలిచిన తొలి రౌండ్ ఎన్నికల్లో వామపక్ష ప్రగతిశీల 'హిస్టారికా పాక్ట్' కూటమి అభ్యర్థి పెట్రో 40.3 శాతం ఓట్లతో అగ్రగామిగా నిలిచాడు. ఆయన సమీప ప్రత్యర్థి, కొలంబియా ట్రంప్‌గా పేరొందిన రొడాల్ఫో హెర్నాండెజ్ 28.2 శాతం ఓట్లతో అనూహ్యంగా రెండో స్థానంలోకి దూసుకొచ్చాడు. పెట్రోకు ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తాడని మీడియా ప్రచారం చేసిన అధికార డెమొక్రటిక్ సెంటర్ (సి.డి) పార్టీ తరపున పోటీ చేసిన మితవాద నాయకుడు ఫెర్డినాండో గుటెరస్ 23.9 శాతం ఓట్లతో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ మద్దతు తనకు కలిసొస్తుందనుకున్న గుటెరస్‌కు అదే పెద్ద మైనస్ పాయింట్ అయింది. ఒకసారి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి రెండోసారి పోటీ చేయడాన్ని కొలంబియా రాజ్యాంగం నిషేధించడంతో డ్యూక్ రెండోసారి పోటీ చేయలేకపోయాడు. రెండో రౌండ్ ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి, మాజీ గెరిల్లా సాయుధ పోరాట యోధుడు పెట్రోను ఓడించడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారి, శత కోటీశ్వరుడు అయిన మితవాద నేత హెర్నాండెజ్ వెనక నానా గోత్రీకులు ఏకమయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలో బెదిరింపులకు దిగారు. ప్రచార బాకాలను ఉపయోగించుకుని పెద్దయెత్తున విష ప్రచారం చేశారు. అమెరికా నుంచి వచ్చిన డాలర్ మూటల సాయంతో ఎన్నికలను తొత్తడం చేసేందుకు యత్నించారు. చైతన్యయుతమైన కొలంబియా ప్రజలు వీటిని తుత్తునియలు చేస్తూ పెట్రోకు దన్నుగా నిలిచారు. కార్మికవర్గం, మైనార్టీలు, మహిళలు, మూలవాసులు, ప్రజాతంత్ర, అభ్యుదయ శక్తుల మద్దతు వుండబట్టే పెట్రో 50.48 శాతం ఓట్లతో గెలవడం సాధ్యమైంది. ప్రత్యర్థి హెర్నాండెజ్‌కు 47.3 శాతం ఓట్లు లభించాయి. వచ్చే నాలుగేళ్లలో పెట్రోకు ప్రతీఘాత శక్తుల నుంచి ముప్పు పొంచి ఉంది. లాటిన్ అమెరికాలో క్యూబా, వెనిజులా, అర్జెంటీనా, బొలీవియా, నికరాగ్వా, పెరూ, హోండూరస్‌లలో ఇప్పటికే వామపక్ష, అభ్యుదయ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. వాటి సరసన తాజాగా కొలబియా చేరింది. లాటిన్ అమెరికాలో అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌లో మరో మూడు మాసాల్లో జరిగే ఎన్నికల్లో లూలా డసిల్వాకే ప్రజలు పట్టం గట్టడం తథ్యమని ఎన్నికల సర్వేలన్నీ ఢంకా బజాయిస్తున్నాయి. లాటిన్ అమెరికా ఎర్రబారుతుండడం అమెరికాకు గుబులు పుట్టిస్తోంది. ఒకవైపు డాలర్‌కు ప్రత్యామ్నాయం రూపుదిద్దుకోవడం, మరో వైపు తన ఆదేశాలను ధిక్కరించే వారు పెరుగుతుండడం పట్ల అగ్రరాజ్యం కుతకుతలాడుతోంది. సామ్రాజ్యవాద కుట్రలను దీటుగా ఎదుర్కోవాలంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పెట్రో నడుం బిగించాలి. 42 శాతంగా ఉన్న పేదరికాన్ని పారద్రోలడం, డ్రగ్స్ మాఫియా పీచమణచడం, మానవ హక్కులను పరిరక్షించడం, 2016లో రివల్యూషనరీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా (ఎఫ్‌ఎఆర్‌సి)తో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని అమలు చేయడం వంటి ప్రజానుకూల విధానాలు చేపట్టాలి. బయట నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోడానికి లాటిన్ అమెరికాలోని వామపక్ష, ప్రగతిశీల ప్రభుత్వాలతో రద్దయిన దౌత్య సంబంధాలను పునరుద్ధరించడం, నయా ఉదారవాద విధానాలకు చెల్లు చీటీ ఇవ్వడం తక్షణం జరగాలి. ఆ దిశగా పెట్రో ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిద్దాం.