
ప్రజాశక్తి-బి.కొత్తకోట(అన్నమయ్యజిల్లా) : తంబళ్లపల్లి నియోజకవర్గం,బి.కొత్తకోట పట్టణం స్థానిక బైపాస్ రోడ్డులోని ఇంటి ముందు నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని అర్ధరాత్రి మూడు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు దగ్ధం చేశారు. అనంతరం ఇంటి తలుపు ముందర గోనెసంచులు, రబ్బర్లు వేసి పెద్ద ఎత్తున మంటలు పెట్టి పరారయ్యారు. ఒక్కసారిగా శబ్దాలు రావడంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూసి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కక్షపూరితంగానే తమ ఇంటిపై ఇంత దారుణానికి తెగబడ్డారని, ఇంతవరకు తమకు ఎవరితోనూ విభేదాలు లేవంటూ బాధితుడు కుటుంబ పెద్ద విష్ణు కుమార్ తెలిపారు. ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టిన దుండగులను అరెస్ట్ చేసి, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి బి.కొత్తకోట పోలీసులు విచారణ చేపట్టారు.