Apr 20,2023 16:02

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : ఈపియఫ్‌ ఫించన్‌ దారులకు అందరికీ కనీస పెన్షన్‌ నెలకు రూ.9 వేల ఇవ్వాలని ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు కె.సుధాకరప్ప అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంఘం ప్రతినిధి బృందం కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుధాకరప్ప మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 77 లక్షల మంది ఈపీఎఫ్‌ పెన్షన్‌ దారులు ఉన్నారన్నారు. గత ఎనిమిది ఏళ్లుగా ఈపీఎఫ్‌ పెన్షన్‌ దారులకు కనీస పెన్షన్‌ రూ.9,000 ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ధర్నాలు, వినతి పత్రాలు సమర్పించామన్నారు. ఇంతవరకు బిజెపి ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించు కోవడంలేదని తెలిపారు. గడిచిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సమావేశంలో ఈ విషయం లేవనెత్తారని, ఎటువంటి స్పందన లేదని తెలిపారు. ఎన్నికల ముందు కనీస పెన్షన్‌ రూ.3000 పెంచుతామని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ చెప్పినా, ఇంతవరకు ఎటువంటి అమలుకు నోచుకోలేదని తెలిపారు. ప్రస్తుతం ఇచ్చే వెయ్యి లోపు పెన్షన్‌ మెడికల్‌ ఖర్చులకు కూడా ఏమాత్రం సరిపోక ఫించన్‌ దారులు అనేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే సాధారణ పెన్షన్‌ 2,750/- రూపాయలు ఉందని, ఈపీఎఫ్‌ ఫించన్‌ మాత్రం వెయ్యి రూపాయల లోపు ఉందని, ఇది చాలా అన్యాయమని, ఇపియఫ్‌ ద్వారా జమ అయిన వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్నా పెన్షన్‌ ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని వారు ప్రశ్నించారు. వచ్చే పార్లమెంటు సమావేశంలో చర్చకు పెట్టి నెలకు కనీస పెన్షన్‌ రూ.9000 ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కర్నూల్‌ పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు సమావేశంలో ఈ సమస్యను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్తానని తగిన న్యాయం చేయడానికి కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో జె శంకర్‌ రావు, బి.మోహన్‌, కె.నరసింహులు, కె.జగదీష్‌, చెన్నకేశవులు, యు.సుధాకర్‌, కె.మహేష్‌, యస్‌ షేక్షావలి, తదితరులు ఉన్నారు.