హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లుపై.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరిన వివరణపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గవర్నర్ లేవనెత్తిన ఐదు అంశాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని.. సంస్థ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కార్పొరేషన్ యథాతథంగా కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది. అలాగే కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేదని పేర్కొంది.ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పింఛన్లు, తదితరాలకు సంబంధించి ఎలాంటి అయోమయం లేదన్న ప్రభుత్వం.. ప్రభుత్వంలో తీసుకున్న తర్వాత కార్మికులతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించింది. వేతనాలు, భత్యం, కేడర్, పదోన్నతులకు ఎలాంటి సమస్య ఉండదని పేర్కొంది. ఈ మేరకు గవర్నర్ అడిగిన అన్ని అంశాలపై వివరణ ఇచ్చామని.. శాసనసభలో ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.