
హిమాలయ సానువుల్లోని ప్రముఖ యాత్రా ప్రదేశం జోషీ మఠ్ కొత్త సంవత్సరంలో కొత్త ఉపద్రవాన్ని మోసుకొచ్చింది. తమ కాలికింది భూమి కంపించి కుంగడం ఉన్నపళంగా భూగర్భంలో నుంచి నీరు పైకి ఉబికి రావడం ఇళ్లు, భవనాల గోడలు నెర్రెలిచ్చడం పట్టణ ప్రజలను భీతిల్లజేస్తున్నాయి. వందల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి. జోషీమఠ్ విపత్తుపై యావత్ దేశం ఉలిక్కిపడ్డ దరిమిలా ఎట్టకేలకు ప్రధాని కార్యాలయం, ప్రధాని మోడీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి స్పందించాల్సి వచ్చింది. సాయం చేస్తామని మోడీ ప్రకటించారు. పిఎంఒ అత్యవసరంగా సమీక్ష చేసింది. సిఎం పుష్కర్‌సింగ్ ధామీ జోషీమఠ్‌ను సందర్శించారు. ఎన్‌ఆర్‌ఎస్‌సి, ఐఐఆర్‌ఎస్, జిఎస్‌ఐలను సమగ్రంగా అధ్యయనం చేయాలని కోరారు. ఐఐటి రూర్కీ, వాడియా సంస్థలు గతంలో చేసిన పరిశోధనల తాలూకు నివేదికలను సమర్పించాలన్నారు. కాగా విపత్తు నివారణ, సహాయ చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ సుప్రీం, ఢిల్లీ హైకోర్టులలో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
జోషీమఠ్ వైపరీత్యానికి భౌగోళిక పరిస్థితులు ఒక కారణం అయితే కార్పోరేట్ల లాభాపేక్ష మరో ప్రధాన కారణం. పట్టణం పురాతన శిలలపై నిర్మాణమైందని ఎప్పటికైనా ప్రమాదమని కొన్ని దశాబ్దాల కిందటే మిశ్రా కమిటీ హెచ్చరించింది. సమీపంలోని నదీ ప్రవాహాలు భూమి లోపలి పొరల్లో ఒత్తిడి పెంచుతున్నాయని, లోపలి పెద్ద పెద్ద బండరాళ్లు, గ్నిసిక్ శిలలు అధిక ఉష్ణోగ్రత కలిగి ఉంటాయని వెల్లడించారు. ఈ ప్రాంతం భూకంపాల ప్రమాదం ఎక్కువగా ఉండే సీస్మిక్ జోన్-5లో ఉంది. భౌగోళికంగా అంత సున్నితమైన జోషీమఠ్‌లో కొన్నేళ్లుగా అభివృద్ధి పేర జరుగుతున్న ప్రకృతి విధ్వంసానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత. పర్యాటక కార్యకలాపాలు పెరగడంతో జోషీమఠ్‌లో విచ్చలవిడిగా భారీ భవనాలు, హోటళ్లు, రోడ్ల విస్తరణ కోసం నిరంతరం భారీ యంత్రాలను ప్రవేశపెట్టారు. దగ్గరలోనే ఎన్‌టిపిసి భారీ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. అందుకోసం భారీ సొరంగం తవ్వుతోంది. నదీ ప్రవాహాలకు అడ్డంగా ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. వాటితోనే భూ ప్రకంపనలొస్తున్నాయని స్థానిక ప్రజలు ఎంతగా మొత్తుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. పద్ధతీ పాడూ లేని పట్టణీకరణ, డ్రైనేజి వ్యవస్థ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ ప్రకృతి విఘాత చర్యలు కార్పొరేట్ల దోపిడీ కోసమే. నిర్మాణాలకు పర్యావరణ అనుమతులివ్వాల్సింది కేంద్రం, కాగా పర్యవేక్షించాల్సింది రాష్ట్రం. రెండు ప్రభుత్వాలూ కార్పొరేట్ల దోపిడీకి భుజం కాస్తున్నాయి. ప్రభుత్వాలే విపత్తులకు కారణమవుతూ ప్రజలను బలి పెట్టడం పరమ కిరాతకం.
ప్రకృతి విధ్వంసం ఒక్క జోషీమఠ్‌కే పరిమితం కాదు. దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణ పర్యవసానం. నయా-ఉదారవాద విధానాల వలన విధ్వంసం హద్దులు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ మార్పులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా పర్యావరణంపై బేహారుల దండయాత్రలు ఆగట్లేదు సరికదా ఎక్కువవుతున్నాయి. భూ తాపంతో హిమాలయాలు కరగడం వలన గంగా, సింధూ, బ్రహ్మపుత్ర నదులు ఏ విధంగా ఉప్పొంగుతున్నాయో చూస్తున్నాం. ముంబయి, కర్ణాటక, కేరళలో భారీ వరదలకు పశ్చిమ కనుమల్లో అడ్డూ అదుపు లేని మైనింగ్, పట్టణీకరణే కారణమని నిపుణులు ఘోషిస్తున్నారు. ఢిల్లీలో గాలి కాలుష్యం, మన రాష్ట్రం సహా పలు చోట్ల అకాల వర్షాలు, కరువులు, డ్రై-స్పెల్స్ వాతావరణ గతి మార్పుల్లో కొన్ని ఉదాహరణలు. ఈ ఉత్పాతాలతో ప్రజలు అపార నష్టాల పాలవుతున్నారు. జోషీమఠ్ ఉదంతం పదేళ్లనాటి ఉత్తరాఖండ్ వరద బీభత్సాన్ని మరోసారి జాతికి జ్ఞప్తికి తెచ్చింది. ఉత్తరాఖండ్ మనుగడకు అక్కడి పవర్ ప్రాజెక్టులను తక్షణం నిలిపేయాలని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపినే అధికారంలో ఉంది. డబుల్ ఇంజన్ గ్రోత్ అని ఏకరువు పెట్టే బిజెపి జోషీమఠ్‌ను, ఉత్తరాఖండ్‌ను ఆదుకోవాలి. సహజ వనరులను పరిమితంగా మానవ వికాసానికి వాడుకోవాలి. లాభాల కోసం ప్రకృతిని చెరబడితే జోషీమఠ్ వంటి ఉత్పాతాలను చవిచూడాల్సి వస్తుందని ఏలికలు గుర్తెరగాలి.