Jul 24,2022 07:38

సినీనటులపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌, పుకార్లు సర్వసాధారణమైపోయింది. వ్యూస్‌ కోసం కొందరు తమకు తోచిన విధంగా రాసేస్తుంటారు. అలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు ఒక్కప్పటి స్టార్‌ హీరోయిన్‌ సోనాలి బింద్రె. ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతో పేరుతెచ్చుకున్న ఆమె ఆ మధ్యన క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఆ మహమ్మారితో పోరాడి, అమెరికాలో చికిత్స అనంతరం 'ది బ్రోకెన్‌ న్యూస్‌' అనే వెబ్‌సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు..

sonali


సోనాలి బింద్రె.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు. తెలుగులో ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా ఉన్నారు. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశారు. సోనాలి బింద్రె తెలుగులో 'మురారి', 'ఖడ్గం', 'ఇంద్ర', 'మన్మథుడు', 'శంకర్‌దాదా ఎంబీబీఎస్‌' వంటి పలు హిట్‌ చిత్రాల్లో నటించారు. హిందీలో కూడా పలు హిట్‌ సినిమాలు చేశారు. 2013లో హిందీలో వచ్చిన 'వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై దొబార' చిత్రంలో అతిథిగా కనిపించారు. సోనాలి బింద్రే 2018లో క్యాన్సర్‌ బారిన పడి, న్యూయార్క్‌లో చికిత్స అనంతరం కోలుకున్నారు. 'ది బ్రోకెన్‌ న్యూస్‌' అనే వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ఈ వెబ్‌ సిరీస్‌ జీ5లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సోనాలి బింద్రె ఇటీవల తనపై వస్తున్న పుకార్లను ఖండించారు. కేవలం టీఆర్పీల కోసమే సోనాలి బింద్రె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, అందుకే ఆమె మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యిందంటూ బాలీవుడ్‌ మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆఫర్స్‌ కావాలంటూ దర్శక-నిర్మాతలకు ఆమె విజ్ఞప్తి చేసుకుంటుందంటూ బి-టౌన్‌లో గుసగుసలు వినిపించాయి.
ఆ అవసరం లేదు..
తాజాగా సోనాలి బింద్రె ఈ వార్తలను కొట్టి పారేశారు. తను ఆర్థికంగానూ, అన్ని విధాలుగానూ బాగున్నానని, ఆఫర్స్‌ కావాలని అడుక్కోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. 'నాకు డబ్బు సమస్య ఉందంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అలాగే తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్లో రాబోయే ఎన్టీఆర్‌ 30 సినిమాల్లో తాను నటిస్తున్నట్టు వస్తున్న వార్తలు సైతం నిజం కాదని వెల్లడించింది. ప్రస్తుతం నేను ఎలాంటి సినిమాలకూ సంతకం చేయలేదు. మంచి కథ, పాత్ర నచ్చితే తప్పకుండా చేస్తాను' అని తెలిపారు.
అత్యంత కష్టమైన దశ అదే..
క్యాన్సర్‌తో పోరాడి, మనోధైర్యంతో చికిత్స తీసుకొని ఆ మహమ్మారి నుంచి బయటకు వచ్చి, ఎంతో మందిలో ఆమె ఆత్మవిశ్వాసాన్ని నింపారు. క్యాన్సర్‌తో తను చేసిన పోరాటాన్ని, తన జీవితాన్ని అది ఎలా మార్చేసిందో ఇటీవల సోనాలి గుర్తు చేసుకున్నారు. 'క్యాన్సర్‌ బారిన పడి కోలుకున్న వారి జీవితాలు.. క్యాన్సర్‌కి ముందు క్యాన్సర్‌కి తర్వాత అన్నట్లు ఉంటాయి. మనిషి తన జీవితంలో ఏదో ఒక దానివల్ల పాఠాలు నేర్చుకోవాలి. నేను దీని (క్యాన్సర్‌) నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నానని భావిస్తున్నాను. ఇది లక్ష్యం కాదు. ఇది ఒక ప్రక్రియ. మన జీవిత ప్రయాణం ఎప్పుడూ ఆగిపోకూడదు. క్యాన్సర్‌తో పోరాడి, దాని నుంచి బయటపడినందుకు కృతజ్ఞతతో ఉన్నాను. ట్రీట్‌మెంట్‌ తీసుకున్న రోజులు నా జీవితంలో అత్యంత కష్టమైన దశ. నేను ఆస్పత్రిలో చేరినప్పుడు వైద్యులు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నన్ను ఇంటికి పంపుతామని చెప్పారు' అంటూ సోనాలి తన ట్రీట్‌మెంట్‌ రోజులను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఓ వైపు నటిస్తూనే.. సామాజిక మాధ్యమాల్లో క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ ఎందరికో మనోధైర్యం నింపుతున్నారు.

sonali 3

పేరు : సోనాలి బింద్రె బేల్‌
పుట్టిన తేదీ : జనవరి 1, 1975
పుట్టిన ప్రాంతం : ముంబై
చదువు : గ్రాడ్యుయేషన్‌
హాబీస్‌ : కుక్కింగ్‌, రైటింగ్‌, ట్రావెలింగ్‌
భర్త : గోల్డీ బేల్‌
పిల్లలు : రన్‌వీర్‌ బేల్‌
తల్లిదండ్రులు : జీత్‌ బింద్రె, రూప్‌సీ బింద్రె
తోబుట్టువులు : గాంధాలీ పరన్‌జపి