Mar 07,2023 07:54

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విశాఖపట్నంలో శుక్ర, శని వారాల్లో రెండు రోజులపాటు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌- 2023)ను ఆర్భాటంగా నిర్వహించింది. రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపారాల స్థాపనకు 378 ఒప్పందాలు కుదిరాయని, రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని, ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. సమ్మిట్‌కు ముఖేష్‌ అంబానీ, అదానీ గ్రూపు ప్రతినిధులు, బిర్లా వంటి వారు హాజరైనప్పటికీ ఉత్తర భారతదేశానికి చెందిన పలు కార్పొరేట్‌ల హాజరు, స్పందన నామమాత్రం. ఇతర దేశాల నుంచి విదేశాంగ రాయబార కార్యాలయాల ప్రతినిధులు వచ్చారు తప్ప పెద్దగా విదేశీ కంపెనీలేవీ సమ్మిట్‌ వైపు కన్నెత్తి చూడలేదు. ఎంబసీ నుంచి వచ్చిన వారు ప్రభుత్వ ప్రతినిధులు అవుతారు తప్ప కంపెనీల ప్రతినిధులుగా భావించలేం. కాగా కుదిరాయంటున్న ఎంఒయులలో ఇప్పటికే పైప్‌లైన్‌లో ఉండి అనుమతులు సాధించినవి, స్థాపించిన సంస్థల విస్తరణకు సంబంధించినవి కూడా ఉన్నాయి. కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించడం కొస మెరుపు !
            సుదీర్ఘ తీరం, అపార ఖనిజ, సహజ వనరులు కలిగిన ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలకు అనుకూలం. విభజన తర్వాత పారిశ్రామికీకరణ లేని రాష్ట్రంగా ఎ.పి. ఉంది. కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఆ పని చేస్తే ఎవ్వరూ వద్దనరు. నాలుగేళ్లపాటు ఊరికినే ఉండి, సరిగ్గా ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వం సమ్మిట్‌ అనడంపైనే తంటా. అందుకే ప్రచారం కోసమే ఈ హంగామా అనిపిస్తుంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కాన్సెప్టును నయా-ఉదారవాదం ప్రముఖంగా ముందుకు తెచ్చింది. ఆ విధానాలను భుజానికెత్తుకున్న కేంద్ర బిజెపి సర్కారు దానికి పట్టం కట్టింది. దీనిలో కార్పొరేట్లకు దోచిపెట్టడమే పని. ఉద్యోగ కల్పన, శ్రామికుల హక్కులు, చట్టాలు ఇవేమీ ఉండవు. అప్పనంగా భూములు ధారాదత్తం చేస్తారు. అపరిమితమైన రాయితీలిస్తారు. సహజ వనరులను అర్పిస్తారు. తనిఖీలు నిల్‌. ఇటువంటి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల కోసం సమ్మిట్‌ నిర్వహించినట్లయితే యువతకు, రాష్ట్రానికి ఒనగూడేదేమీ ఉండదు. కార్పొరేట్లకు ఇచ్చిన భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందుతారు. పరిశ్రమ పెట్టరు. రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేస్తారు. విశాఖకు త్వరలో కార్యనిర్వాహక రాజధాని వచ్చేస్తుందని ముఖ్యమంత్రి సమ్మిట్‌ వేదికపై పునరుద్ఘాటించారు. వాస్తవానికి ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌కు, పరిశ్రమలకు సంబంధం ఉండదు. ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పరిశ్రమలు పెడతారు. మాటికీ విశాఖ- రాజధాని అనడం ఆ ప్రాంతంలో రియల్‌ బూం పెంచడానికి పనికిరావచ్చు.
           రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉంటే పరిశ్రమలు పెట్టడానికి కొంతైనా ముందుకొస్తారు. హోదా కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసింది లేదు. విభజన చట్టంలో పొందుపర్చిన విశాఖ మెట్రో, రైల్వే జోన్‌ వాటిని కేంద్రం విస్మరించింది. ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని అమ్ముతోంది. సమ్మిట్‌లో వీటిపై మాట్లాడే నాథుడే లేడు. కానీ విశాఖను అభివృద్ధి చేస్తామని సమ్మిట్‌ వేదికపై కేంద్ర మంత్రులు వల్లించడం, అందుకు రాష్ట్ర పెద్దలు చప్పట్లు కొట్టడం విడ్డూరం. అంతర్జాతీయ ఆర్థిక నేరగాడు అదానీ గ్రూపునకు రాష్ట్ర ప్రభుత్వం ఎర్ర తివాచీ పరిచి పోర్టులు, విద్యుత్‌ ప్రాజెక్టులు సకలం ఇచ్చి వేల ఎకరాలను ధారాదత్తం చేస్తోంది. ఆ ఒప్పందాలను రద్దు చేసి భూములు స్వాధీనపర్చుకోవాలన్న నిరసనలు వెల్లువెత్తగా, విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు భూములివ్వడం ప్రభుత్వ వైఖరిని తెలుపుతుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి సమ్మిట్‌లు నిర్వహించింది. వచ్చిన పెట్టుబడులు చాలా తక్కువ. అక్కడక్కడ భూములకు ఫెన్సింగ్‌లు వేశారంతే. ఇప్పుడూ అదే పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే కార్యాచరణపై సర్కారుకు చిత్తశుద్ధి ఉండాలి. నిజానికి విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన పరిశ్రమలు, లభించిన ఉపాధిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటిస్తే బాగుండేది. ఎంఒయులపై పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ అన్నారు సిఎం. గతంలోనూ ఇలాంటి కమిటీలున్నాయి. పెట్టుబడులు రాకుండా కేవలం ఒప్పందాలకే పరిమితం అయితే సమ్మిట్‌ కేవలం ప్రచారార్భాటానికేననుకోవాల్సి వస్తుంది.