Sep 24,2022 06:55

ఇప్పటివరకు 52.38 లక్షల రైతు, కౌలు రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం ఇస్తున్నామన్నారు. ఈ నాలుగు సంవత్సరాలలో పెట్టుబడి ఖర్చు రెట్టింపు అయింది. కాని వివిధ పంటల కనీస మద్దతు ధరలను ప్రభుత్వం 10 శాతం మించి పెంచలేదు. దాంతో రైతులు అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం జరిగితే సాయం అందించేందుకు రూ.2 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించారు. కాని గతంలో ప్రకటించిన ఆ నిధి ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఈనెల 21వ తేదీన అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై జరిగిన చర్చలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌.బి.కె) ప్రపంచ ఖ్యాతిని ఆర్జిస్తున్నాయని చెప్పారు. కాని అవి కనీసంగా 10 శాతం కూడా పని చేయడం లేదు. విత్తనాల సీజనులో మిర్చి విత్తనాలు గత సంవత్సరం కన్నా 4 రెట్లకు అమ్మాయన్నా, పత్తి విత్తనాలలో రకరకాల నకిలీ విత్తనాలను వ్యాపారులు అమ్ముకున్నారన్నా ప్రభుత్వం అంటే ఎలాంటి భయం లేనందునే. గత సంవత్సరం పంటలపై వచ్చిన తెగుళ్ళ భయం నేపథ్యంలో, వ్యాపారస్తులు అతి ప్రచారం చేసి రైతులకు మంచి విత్తనాలనే భ్రమ కల్పించి ఎక్కువ ధరకి అమ్ముతున్నా వ్యవసాయ అధికారులెవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.
          కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ కింద గ్రూపు ఏర్పడితే ఈ సంవత్సరం 2,000 డ్రోన్‌లు, యంత్ర సేవా కేంద్రాలు, వచ్చే రెండేళ్ళలో 10,778 ఆర్‌బికె డ్రోన్‌లు విస్తరిస్తామన్నారు. ఇలా ఏర్పడిన రైతు రథాలు, అధికార పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాల స్వచ్ఛంద గ్రూపులు గ్రామాలలో పెత్తందార్లకు లాభాలనిస్తున్నాయి. కాని పేద రైతులు, కౌలు రైతులపైన పెరిగిన అన్ని భారాలు వేస్తున్నారు.
          భూయజమానులు భయపడకుండా కౌలురైతులకు సిసిఆర్‌ కార్డులు ఇచ్చేందుకు సహకరించాలన్నారు గౌరవ ముఖ్యమంత్రి. కౌలు రైతుకు కార్డు రావాలంటే భూయజమాని సంతకం కావాలనే లిటిగేషన్‌ పెట్టింది జగన్‌ గారే కదా? భూయజమాని సంతకం అవసరం లేదని నిర్ణయం తీసుకోవచ్చు. కాని అలా చేయలేదు. పేదల పక్షాన మాట్లాడి ఆచరణలో పెద్దవాళ్ళకి పెట్టడం అంటే అదే మరి. ఇప్పటివరకు 52.38 లక్షల రైతు, కౌలు రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం ఇస్తున్నామన్నారు. ఈ నాలుగు సంవత్సరాలలో పెట్టుబడి ఖర్చు రెట్టింపు అయింది. కాని వివిధ పంటల కనీస మద్దతు ధరలను ప్రభుత్వం 10 శాతం మించి పెంచలేదు. దాంతో రైతులు అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం జరిగితే సాయం అందించేందుకు రూ.2 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించారు. కాని గతంలో ప్రకటించిన ఆ నిధి ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు.
         రైతుల ఆత్మహత్యలు ప్రతిరోజు 3 నుండి 5 వరకు జరుగుతున్నట్లుగా మీడియాలో వస్తున్నాయి. వెలుగులోకి రానివి ఇంకా ఎన్ని ఉంటాయో చెప్పలేం. ఈ మూడున్నర సంవత్సరాలలో కనీసంగా 5 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అంచనా. దీనిని రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభానికి ప్రతీకగా చూడాలి. వర్షాలు బాగా పడుతున్నా, పంటలు బాగా పండుతున్నా ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నట్లు? ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. కాని ఆ సహాయం 694 మందికి మాత్రమే చెల్లించారు. రూ.7 లక్షలు రానివారు వందల మంది ఉన్నారు. 13 రకాల సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవడానికే తల ప్రాణం తోకకి వస్తున్నది.
      ఎరువుల ధరలు రెట్టింపు అయినాయి. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క మాట మాట్లాడలేదు. డీజిల్‌ చార్జీలు పెరిగినందన దుక్కి దున్నడం నుంచి ధాన్యం ఇంటికి వచ్చేదాక ఎకరానికి ఖర్చు గత 3 సంవత్సరాలలో 4-5 వేల రూపాయల వరకు పెరిగింది.
ఎవరు పంటలేస్తే వారి పేరు మీద ఈ-క్రాప్‌ నమోదు చేస్తామని ప్రభుత్వం ఎంత గొప్పగా చెప్పినప్పటికీ.... ఆచరణకొచ్చేసరికి అధికారులు పొలం యజమానులను బతిమాలినా కాని కావడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలన్నీ భూయజమానులకు అందుతున్నాయి. కౌలురైతులకు దక్కడం లేదు.
       ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను జిల్లాల వారీగా కార్పొరేట్‌ కంపెనీలకు కేటాయించేవారు. ప్రభుత్వ బ్యాంకులలో రైతులు రుణాలు తీసుకొనేటప్పుడు కమర్షియల్‌ పంటలకు 5 శాతం, వాణిజ్యేతర పంటలపై 2-3 శాతం దాకా రుణాల నుండి ప్రీమియం వసూలు చేసేవారు. ఏనాడూ పంటల బీమా రాక రైతులను ఈ బీమా స్కీము నుంచి మినహాయించమని కొంతమంది రైతులు కోర్టులను ఆశ్రయించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే బాధ్యత తీసుకొని పంటల బీమా కోసం కంపెనీ పెట్టడానికి ముందుకు వచ్చింది. రైతులందరూ సంతోషించారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల వారీగా, జిల్లాలవారీగా, మండలాల వారీగా విధివిధానాలను రూపొందించింది. 740 పేజీలతో రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ వెబ్‌సైట్‌లో వివరాలు ఉంచారు. కాని ఇంతవరకు కంపెనీ ప్రారంభం కాలేదు. కేంద్రం పర్మిషన్‌ ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఈ కాలంలో అనేక అవకతవకలతో పంటల బీమా అమలు జరిగినప్పటికీ...కార్పొరేట్‌ కంపెనీల నాటి కాలం కన్నా రైతాంగానికి కొంత మేలు జరిగింది. అయితే అమలైన వారికి పరిహారం సొమ్ము రాకపోవడమో లేక స్వల్పంగా చెల్లించడమో జరిగిన కేసులు కొన్ని వున్నాయి.
         ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కార్పొరేటు కంపెనీల కోసం పంటల బీమా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడింది. మళ్ళీ రాబందుల రాజ్యం రానున్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వాటా, తన వాటా కంపెనీలకు చెల్లిస్తుంది. కేంద్రం వాటా కూడా కంపెనీలకే చెల్లిస్తారు. ఇదే కార్పొరేట్‌ కంపెనీలకు దాసోహమవడం అంటే. దీనినే రైతుకు వెన్నుపోటు పొడవటం అంటారు. ప్రభుత్వ విధానం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అవుతున్నది.
           ఈ కాలంలో ఆర్‌.బి.కెలు వ్యాపారస్తులకు దళారీ కేంద్రాలుగా ఉన్నాయి. అనేక మంది స్థానిక అధికార పార్టీ నాయకులు అతి తక్కువ ధరకు రైతుల నుంచి ధాన్యం కొని ఆర్‌బికెల దగ్గర ప్రభుత్వ ధర ప్రకారం రికార్డు చేయిస్తున్నారు. ఆ విధంగా రైతాంగానికి అన్యాయం చేస్తున్నారు.
పండించిన ధాన్యాన్ని, ఇతర పంటలను ఎఫ్‌సిఐ మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీలు తప్పక కొనుగోలు చేయాలనేది ఏమీ లేదని, ప్రెవేటు సంస్థలు ఆ పని చేస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు. ఈ తీవ్ర సమస్య నుండి ఎలా బయటపడాలో అసెంబ్లీ వేదికలో చర్చించలేదు.
        ఈ సంవత్సరం ఎరువుల ధరలు...మరీ ముఖ్యంగా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు రెట్టింపు అయ్యాయి. రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా ఉంది. దీనికి కూడా ప్రభుత్వ స్పందన లేదు. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితులలో వ్యవసాయం ఉంది. 2019లో తను చేసిన వాగ్దానాలను 98.4 శాతం అమలు చేశామనేది అసత్యమో! సత్యమో! పాలకులే పరిశీలించాలి.

(వ్యాసకర్త ఎ.పి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు)
వి. కృష్ణయ్య

వి. కృష్ణయ్య