Jun 25,2022 06:48

స్వాతంత్య్రం, సమ సమాజం, సామ్యవాద సాధనే జీవిత పరమార్ధమని ప్రబోధించిన మహనీయుడు ఉద్దరాజు రామం. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల వలస పాలనకు వ్యతిరేకంగా, స్వాతంత్రోద్యమాన్ని ప్రబోధిస్తూ...రహస్యంగా అచ్చయ్యే ''వీర భారతి' పత్రికను ఉద్దరాజు రామం రాత్రివేళల్లో సైకిల్‌ మీద 60 మైళ్లు తిరిగి గ్రామాలకు పంపిణీ చేసేవారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు పట్టణంలో ప్రింటయిన వీరభారతి పత్రికను రహస్యంగా గోదావరిలో పడవ మీద పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ రేవుకి చేర్చేవారు. ఆ పత్రికలు మొత్తం చించినాడ గ్రామంలోని కాంగ్రెసు కుటుంబం రుద్రరాజు వెంకట్రాజు గారి (ఆర్‌.యస్‌ గారి పెదతండ్రి) ఇంటికి చేర్చేవారు. అప్పటికి కాంగ్రెస్‌ వాలంటీర్లుగా పనిచేస్తున్న కా||పుచ్చలపల్లి సుందరయ్య, ఉద్దరాజు రామం తదితరులు వెళ్లి ఎవరికి కావలసిన పత్రికలు వారు కట్టలు కట్టుకుని తీసుకెళ్లి ఇతర జిల్లాలకు అందించేవారు.
      స్వతంత్రోద్యమ నిధి కోసం గాంధీజీ దేశ వ్యాపిత పర్యటనలో భాగంగా పాలకొల్లు విచ్చేశారు. అక్కడ జరిగిన భారీ సభలో తన పైకండువా చాపి, స్వతంత్ర నిధి కావాలి అంటే హాజరైన మహిళాలోకం తమ వొంటి మీదున్న మొత్తం బంగారు నగలన్నీ తీసి పెద్ద గుట్టగా వేశారు. రామం గారి సతీమణి మాణిక్యాంబ కూడా అత్యంత ఉత్సాహంతో తన దగ్గర ఉన్న 70 కాసుల బంగారు నగలన్నీ ఇచ్చేశారు. ఆ మహాతల్లి కన్నుమూసే వరకూ పసుపు తాడుతోనే ఉన్నారు. ఐదుగురు పిల్లలతో ఇల్లు వాకిలి లేక సంచార జీవితం గడుపుతూ, వ్యవసాయ కూలీలతో కలిసి, పిల్లలను పోషించుకుంటూ, కష్టాలు కడగండ్లు లెక్కచేయక...దేశసేవ కోసం వాటిని సంతోషంగా భరించారు.
     1934లో సుందరయ్య గారు భీమవరం కేంద్రంగా...ఉద్దరాజు రామం, గారపాటి సత్యనారాయణ మొదలైన ఐదుగురుతో జిల్లాలో కమ్యూనిష్టు పార్టీ మొదటి శాఖను నిర్మించి రామం గారిని కార్యదర్శిగా నియమించారు. అలా రామం గారు జిల్లాలో పార్టీ నిర్మాణానికి పూనుకున్నారు.
     స్వాతంత్య్రోద్యమం లోనూ, కమ్యూనిష్టు పార్టీ నిర్మాణంలోనూ రామంగారు బలమైన ప్రాత నిర్వహించారు. ఆదర్శ ప్రజా సేవకుడుగా అజాత శుత్రువుగా జిల్లాలో రామంగారి పేరు మార్మోగేది. కమ్యూనిస్టు పార్టీని ద్వేషించేవాళ్లు కూడా రామంగారిని చూస్తే చేయెత్తి నమస్కరించేవారు. 1957 పార్లమెంటు ఎన్నికలలో 40 వేల మెజారిటీతో విజయం సాధించి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. రామంగారి ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓటుతో పాటు 'ఒక రూపాయి' ఎన్నికల నిధి సేకరించాం. దానికి ఎంతో ఆదరణ లభించింది.
     జిల్లాలో నర్సాపురం నియోజకవర్గ పార్లమెంటు సభ్యులుగా సైకిల్‌ మీద గ్రామాలు పర్యటిస్తూ రైతాంగ వ్యవసాయ సమస్యల మీద అధ్యయనం చేశారు. అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షులుగా రైతాంగ ఉద్యమాలలో ప్రధాన పాత్ర వహించారు. పార్లమెంటు సభ్యులుగా పాలకొల్లులో పంచదార ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అలుపెరగకుండా తిరిగి రైతులతో పంచదార ఫ్యాక్టరీకి షేర్లు కట్టించారు. ప్రభుత్వ గ్రాంటు సాధించి ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేశారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. అలాగే వసతి లేక చిన్నచిన్న పూరిళ్లలోనే చేనేత మగ్గాలతో, పిల్లలతో నివసించే చేనేత కార్మికుల గృహ వసతి కోసం ఎంతగానో పరితపించారు. ఆయన కృషి వల్లే చేనేత సొసైటీ కాలనీ ఏర్పడింది. ఫలితంగా పశ్చిమ గోదావరి జిల్లాలో చేనేత కార్మిక సంఘం బలమైన శక్తిగా, ప్రతిష్టాత్మకంగా వృద్ధి చెందింది.
      ముఖ్యంగా రామంగారి జీవన యానం చిన్ననాడే స్వాతంత్య్ర సమరంతో మొదలైంది. అనంతరం ఆకలి, అజీర్తి లేని సమ సమాజ నిర్మాణం కోసం, సామ్యవాద సిద్ధాంతమే మార్గదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్య బాటలో పీడిత ప్రజల ఆత్మబంధువు వలే నిరంతరం సంచార జీవనమే. ఉద్యమాల కేంద్రమైన పాలకొల్లు చేనేత కాలనీయే ఆయన స్వగృహం. పార్లమెంట్‌ సభ్యునిగా చేసినా సొంత ఇల్లు అనేది లేదు. చివరలో రామం దంపతులు మనుమల ఇంట్లోనే అస్తమించారు.
     అంత పెద్ద జాతీయ నాయకుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, జిల్లా పార్టీ నిర్మాతగా ఉండి కూడా...కార్మిక, కర్షక జీవన విధానమే ఆయన నిత్యజీవితం. అర్ధరాత్రి, అపరాత్రి ఏది పెట్టినా 'అమృతమమ్మా' అనేవారు.
     ముఖ్యంగా ఉద్దరాజు రామం శ్రామిక జన నేతగా రైతాంగానికి ఆత్మబంధువుగా చేసిన చారిత్రాత్మక వీరోచిత కాళీపట్నం రైతు పోరాటం మరువలేనిది (కాళీపట్నం నర్సాపురం దగ్గరలో ఉన్న గ్రామం). అలాగే 1963లో అదనపు భూమిశిస్తు చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాపితంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన అఖిలపక్ష రైతు సంఘం అధ్వర్యాన 15 రోజులు ప్రభుత్వ ఆఫీసుల దగ్గర ఉధృతంగా సాగిన పికెటింగ్‌లతో, అరెస్టులతో ప్రభుత్వం స్థంభించింది. రైతాంగం విజయం సాధించింది. ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేసింది.
    ఒకసారి రామంగారు జిల్లాలో రైతు సంఘ సభ్యత్వం జరగపోతే ఆర్‌.యస్‌ గారితో కలసి గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సభ్యత్వం చేర్పించారు. జీవితం అంటే ఆశయ సాధనే అని స్వయంగా ఆచరించి చూపించారు. ఆరోగ్యం పాడై మంచంలో పడి పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ 1994 నవంబర్‌ 27న అస్తమించారు. నాకు రాజకీయ గురువైన రామం గారు పార్టీ నిర్మాణంలో చిరంజీవి.
పత్రికా పఠనానికి రామంగారు ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారు. ఒకసారి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ...అందరూ ప్రజాశక్తి చదువుతున్నారా? ప్రజాశక్తి చదవని వాళ్లకి పార్టీ సభ్యులుగా అర్హత లేదు...అంటూ పార్టీ నిర్మాణం గురించి అనేక వివరాలు చెప్పారు. అటువంటి మహనీయులు పార్టీని పటిష్టం చేయడం కోసం నిరంతరం ఆరాటపడుతూ వెళ్లిపోయారు. వారి ఆశలు ఫలించటానికి ఈనాటి యువతరం దీక్షబూనాలి. పార్టీ విస్తరణకై నిరంతరం పాటు పడాలి. కమ్యూనిస్టుగా బతకటం కన్నా ప్రపంచంలో గొప్ప విషయం లేదు.
 

- అల్లూరి మన్మోహిని