
శ్రీశ్రీ అన్నట్టు తారీఖులు, దస్తావేజుల కన్నా చరిత్ర సారం కీలకం. ఆ విధంగా చూస్తే తెలంగాణ సాయుధ పోరాటం 75 ఏళ్ల తర్వాత తన విశిష్టతను చాటుకుంటున్నది. కమ్యూనిస్టులు రాజకీయ మార్పుల రీత్యా సెప్టెంబరు 17నే జరిపి సైద్ధాంతిక చారిత్రిక ప్రాధాన్యత చెబుతూ వస్తున్నారు. బిజెపి రంగ ప్రవేశం తర్వాత వక్రీకరణలను నిలవరించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మారిన ఈ పరిస్థితుల్లో జాతీయ సమైక్యతా దినోత్సవంగానైనా దీన్ని జరపడం అందువల్లనే.
మూగవోయిన కోటి తమ్ముల గళాల / పాట పలికించి కవితా జవమ్ము కూర్చి / నా కలానకు బలమిచ్చి నడిపినట్టి /
నా తెలంగాణ కోటి రతనాల వీణ.
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవ సందర్భమిది. 1946 జులై నాల్గవ తేదీన దొడ్డి కొమరయ్య బలిదానం ఆ మహత్తర సమరానికి నాంది ప్రస్తావన. తెలుగు జాతి చరిత్రలో రుధిరాక్షర లిఖితం ఆ పోరాటం. రాజకీయ సాంస్కృతిక, ఆర్థిక పీడనలపై అశేష జనం ఒక్కుమ్మడిగా ఆయుధాలు ధరించి అంత పెద్ద ఎత్తున పోరాడటం భారతదేశంలో అంతకు ముందు కాని ఆ తర్వాత గాని జరగలేదు. అది అంతర్జాతీయంగానూ గొప్ప ఖ్యాతి గడించిన ఆ పోరాట చరిత్రలో సెప్టెంబరు17 ఒక కీలక ఘట్టం. దానిపై రకరకాల భాష్యాలున్నా కాలక్రమంలో అందరూ జరుపుతూ వస్తున్నారు. ఈ రోజు కూడా స్వాతంత్య్ర అమృతోత్సవాలలో దాన్ని మేళవించి కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం వేర్వేరు పేర్లతో విడి విడిగా నిర్వహిస్తున్నాయి. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టులు ఎప్పటిలాగే ఈ పోరాటాన్ని స్మరించుకుంటున్నారు.
వెట్టిచాకిరి, క్రూర నిరంకుశత్వం
హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ లోని తొమ్మిది జిల్లాలు కొన్ని మరాట్వాడా కన్నడిగ ప్రాంతాలతో పాటు నిజాం రాచరిక నిరంకుశ పాలనలో మగ్గిపోతుండేవి. జన సామాన్యం వెట్టిచాకిరీ కింద నలిగిపోతుండేది. పైగాలు, జాగీర్దార్లు, ఇజారాదార్లు, మక్తేదార్లు, ఈనాందార్లు, దేశ్‌ముఖులు రకరకాల పేర్లతో దొరలు వేల లక్షల ఎకరాలు కలిగి వుండేవారు. వీరికి పన్నులు వేసేందుకు వసూలు చేసేందుకు అధికారం వుండేది. ఏ స్త్రీనైనా సరే గడీలనబడే తమ బంగళాల్లోకి తీసుకుపోతారు. శ్రమనూ శరీరాలనూ కొల్లగొడతారు. ఈ అమానుష నిరంకుశ పీడన వందల ఏళ్లపాటు సాగింది. భాషా పరంగానూ, మత పరంగానూ కూడ నిజాం నిరంకుశత్వం. ప్రజలలో అత్యధికులు తెలుగు వారైనా పాలకుల ఉర్దు అధికార భాష, బోధనా భాష. సభలు జరుపుకోవడానికి గాని, సంఘాలు పెట్టుకోవడానికి ఆఖరుకు గ్రంథాలయం స్థాపించుకోవడానికి గాని అనుమతి వుండేది కాదు. 1930లో జోగిపేటలో ఆంధ్ర మహాసభ తొలి సభ జరిగింది. కొద్దిపాటి ప్రజాస్వామిక సంస్కరణలు కోరుతూ మహజర్లు సమర్పించేవారు. హైదరాబాదులో కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పడింది. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడైన రావినారాయణ రెడ్డి 1941 నాటికి ఆంధ్ర మహాసభ అధ్యక్షుడైనాడు.
మహత్తర పోరాట చరిత్ర
రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం తొలగి తొలిసారి బహిరంగంగా పనిచేసే అవకాశం కలిగింది. ప్రజా ఉద్యమాలు గొప్ప వెల్లువగా సాగాయి. రాజులు, సంస్థానాధీశులు, భూస్వామ్య ప్రజా కంటకులకు వ్యతిరేకంగా రైతాంగ తిరుగుబాట్లు ఉవ్వెత్తున ఎగసాయి. మునగాల, చల్లపల్లి జమీందార్లకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం వంటివి పెల్లుబికాయి. రెడ్డి హాస్టల్‌లో వుండి రాజకీయ తరగతులు జరిపి సంబంధాలు పెంచుకున్నారు చండ్ర రాజేశ్వరరావు. 1944లో భువనగిరిలో జరిగిన 11వ మహాసభ తర్వాత ఆంధ్ర మహాసభ పూర్తిగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోకి వచ్చింది. దాన్ని సంస్కరణలకై మొరపెట్టుకునే దశ నుంచి పోరాట వేదికగా మార్చే పని కమ్యూనిస్టు పార్టీ చేసింది. తెలంగాణ వీరులకు విశాలాంధ్ర కమ్యూనిస్టు కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రాంతంలోనూ వాలంటీర్ శిక్షణ, ఆయుధ తర్ఫీదు లభించింది. అయిలమ్మ భూమి సమస్యపై పోరాటం సందర్భంగా 1946 జులై 4న విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు దొడ్డి కొమరయ్య ప్రాణాలు బలి తీసుకోవడంతో ఈ పోరాటం విజృంభించింది.
సామాన్య ప్రజలు సంఘం అని పిలుచుకున్న ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన మొదలైన ఈ పోరాటంలో గడీలను ఆక్రమించి అప్పుల పత్రాలు చించేశారు. వారి పొలాలను ఆక్రమించారు. దొరల గూండాలను, నిజాం సైన్యాలను, రజాకార్లనబడే కిరాయి మూకలను, పోలీసులను ఎదిరించే మహా ప్రవాహంగా కదిలారు. స్త్రీలు పిల్లలూ కూడా సైన్యంలా కదం తొక్కారు. 'బాంచను దొరా... కాల్మొక్తా' అన్నవారే బందూకులు పట్టి దోపిడీ దొరలను దునుమాడారు. వడిశాల, కారం పొడి, రోకలిబండ కూడా ఆయుధాలైనాయి. ''ఈ కమ్యూనిస్టుల దగ్గర ఏ మహత్యమున్నదో కాని బానిసను దొరా అన్న వానితో బందూకు పట్టించారని'' వారి భావాలతో ఏకీభవించని సురవరం ప్రతాపరెడ్డి వ్యాఖ్యానించారు.
సాటిలేని విజయాలు
సాయుధ పోరాటం వెట్టిచాకిరీకి సమాధి కట్టింది. బానిసత్వానికి స్వస్తి చెప్పింది. మూడు వేల గ్రామాలలో పది లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచిపెట్టింది. వ్యవసాయ కార్మికుల కూలి రేట్లు పెరిగాయి. వడ్డీ భారం దాదాపు తగ్గించేయబడింది. ప్రజలను పీడించే ఫారెస్టు గార్డులను వెళ్లగొట్టింది. ప్రజాస్వామ్యమే ఎరుగని నిజాం ఫర్మానాలో ఇప్పుడు మూడు వేల గ్రామాల లోనూ పంచాయతీల ఆధ్వర్యాన ప్రజాపాలన ప్రారంభమైంది. కష్టజీవులకే ప్రాతినిధ్యం, ఇద్దరు స్త్రీలకు ప్రాతినిధ్యం కల్పించబడింది. జీవితంలో తొలిసారి రెండు పూటలా అన్నం తిన్నామని తెలంగాణ ప్రజలు చెప్పుకున్నారు.
మురోవైపు అశేష ప్రజల రక్తతర్పణ, ఎందరో ప్రజా యోధుల ప్రాణబలి ఈ విజయాల వెనక వున్నాయి. నాలుగు వేల మందికి పైగా కమ్యూనిస్టులు, రైతు గెరిల్లాలు అమరులైనారు. పది వేల మంది నిర్భంధాలతో జైలు శిక్షలను అనుభవించారు. యాభై వేల మంది చిత్రహింసలను ఎదుర్కొన్నారు. వేలాది గ్రామాలు దాడులకు గురైనాయి. మహిళలపై వేల సంఖ్యలో అత్యాచారాలు జరిగాయి. నిజాం రాజ్యం కదలిపోతున్న స్థితిలో 1948 సెప్టెంబరు 12న కేంద్రంలోని నెహ్రూ ప్రభుత్వ సైన్యాలు దిగాయి. హోంమంత్రి సర్దార్ పటేల్ నాయకత్వంలో సంస్థానాన్ని విలీనం చేసుకుని నిజాంను రాజప్రముఖ్‌గా గుర్తించి ప్రజలపై తుపాకులు ఎక్కుపెట్టాయి. పలాయనం పాడిన భూస్వాములకు కాంగ్రెస్ టోపీలతో పునరావాసం కల్పించి ప్రజలను ఊచకోత కోశాయి. ఆ దశలో కమ్యూనిస్టు పార్టీ సాధించిన విజయాలను కాపాడుకోవడం కోసం సాయుధ పోరాటాన్ని కొనసాగించడం అనివార్యమైంది. రెండు వారాల్లో తెలంగాణ పోరాటాన్ని అణచేస్తానన్న అప్పటి హోం మంత్రి సర్దార్ పటేల్ గొప్పలు వమ్ము కాగా 1951 అక్టోబరు 21 వరకూ ఈ సాయుధ పోరాటం కొనసాగింది. ఆ వెంటనే జరిగిన 1952 మొదటి సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టులు అఖండ విజయం సాధించారు.
దేశానికి నిర్దేశం, సాంస్కృతిక వెల్లువ
తెలంగాణ పోరాటం ఫలితంగానే దున్నేవానికి భూమి అన్న నినాదం రూపొందింది. పాలకులు మాట మాత్రంగానైనా భూసంస్కరణలను రంగం మీదకు తేవలసి వచ్చింది. ముక్కచెక్కలై వున్న తెలుగు ప్రజలను ఒక్కచోటికి చేర్చే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు మార్గం సుగమం కావడమే కాక దేశమంతటా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బాట వేసింది (తర్వాతి కాలంలో ఇది రెండుగా విభజించబడటం వేరే విషయం). ఆ విధంగా స్వాతంత్య్రానంతర భారత రాజకీయ చిత్రపటాన్ని రచించింది. ఈ పోరాట విరమణ విద్రోహమనీ కొనసాగించడం అతివాదమని సైద్ధాంతిక వాదనలు చేసిన రాసినవారున్నా అది ఇక్కడ అప్రస్తుతం. చరిత్ర వాటికి సమాధానం చెప్పేసింది. ఏమయినా ఈ క్రమంలో కమ్యూనిస్టు పార్టీలో జరిగిన అంతర్గత సైద్ధాంతిక పోరాటం మితవాద అతివాద ధోరణులను ప్రస్ఫుటం చేసి, భావి భారత ప్రజాస్వామిక విప్లవ స్వరూప స్వభావాలను కూడా తెలియజెప్పే దిక్సూచిగా నిలిచింది.
సాంస్కృతికంగా కూడా తెలంగాణ పోరాటం గొప్ప ప్రేరణ కలిగించింది. అంతకు ముందు జానపదాల్లో గోడు వెల్లబోసుకున్న ప్రజానీకం ఈ పోరాట ప్రభావం వల్ల అద్భుతమైన సమర సాహిత్యం సృష్టించారు. ప్రజా కవులు, కళాకారులు, రచయితలు చిరస్మరణీయమైన రచనలు కళా రూపాలు అందించారు. తెలంగాణ పోరాటం తలుచుకుంటేనే జానపద కళారూపాలు, నైజాం సర్కారోడా వంటి పాటలు ప్రతిధ్వనిస్తాయి. మా భూమి నాటకం కదలాడుతుంది. వజ్రాయధం, త్వమేవాహం, తెలంగాణ ఉదయిని వంటి కావ్యాలు గుర్తొస్తాయి. దాశరథి, ఆళ్వారు స్వామి తదితరుల నవలలు గుర్తొస్తాయి. చిత్తప్రసాద్ చిత్రాలు కళ్ల ముందు కదలాడతాయి.
బిజెపి కుటిల ప్రయత్నం, విపరీత వాదనలు
మతతత్వ రాజకీయాల మూల విరాట్టు బిజెపి 1998లో కేంద్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చేవరకూ సెప్టెంబరు 17ను పట్టించుకోలేదు. అప్పుడే విమోచన దినం అని పేరు పెట్టి ఎల్.కె. అద్వానీని రావించి రాజకీయ హడావుడి మొదలెట్టింది. నాడు ఈ విలీనం ప్రక్రియకు సర్దారు పటేల్ ఆధ్వర్యం వహంచినందున అద్వానీ అభినవ సర్దారు అని వారు చేసే ప్రచారానికి బాగా ఉపయోగకరమని తలపోసింది. ఇప్పుడు పటేల్ అంటే అమిత్‌షా గనక ఆయనా వస్తున్నాడు. నిజాం ముస్లిం రాజు గనక ఆయనను కూలదోయడం విమోచన అని వారి భాష్యం. వారిని వ్యతిరేకించే వారంతా నిజాంలూ రజాకార్లు. వాస్తవానికి బిజెపికి లేదా సంఘ పరివార్‌కు నిజాం వ్యతిరేక పోరాటంతో ఏ మాత్రం సంబంధం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జునాగఢ్ పాకిస్తాన్‌తో కలవడానికి మంతనాలు జరిపితే, కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు స్వతంత్రం ప్రకటించుకోవడానికి ప్రయత్నించాయి. బిజెపి తరహా పూర్వ రూపం లాంటి రామరాజ్య పరిషత్ హిందువనే ఒకే కారణంతో అందుకు మద్దతు తెలిపింది. వాస్తవానికి తెలంగాణ పోరాటంలో బందగీ వంటి సామాన్య ముస్లిం రైతుల నుంచి మేధావుల వరకూ పాల్గొన్నారు. సాయుధ పోరాటం కోసం పిలుపునిచ్చిన ముగ్గురిలో ముగ్దుం ఒకరు. స్టేట్ కాంగ్రెస్ పేరిట కొన్ని చర్యలు జరిగినా వాస్తవంలో ఈ పోరాటానికి ఆ పార్టీకి సంబంధం లేదు. కొందరు ఆ పేరుతో విచ్ఛిన్న చర్యలు కూడా చేశారు. ఇక్కడ ఆలస్యంగా ఏర్పడిన కాంగ్రెస్ ఎజెండాలో సంస్థానాలపై పోరాటమే లేదు. పైగా భూస్వాములతో దోస్తీ.
ఇంకొన్ని శక్తులు. వారికి వంత పాడే కొందరు మేధావులు కూడా వలసవాదం వంటి సందర్భం లేని పదజాలంతో తెలంగాణ పోరాట ప్రాధాన్యతకు మసిపూసే ప్రయత్నం చేశారు. తెలంగాణ పోరాటంలో ప్రారంభం నుంచి చివరి వరకూ తెలుగు ప్రజలందరి పోరాటంగా విశాలాంధ్ర కమ్యూనిస్టు కమిటీ నాయకత్వంలో జరిగింది. తెలంగాణ ప్రజా పోరాటాన్ని రగిలించడంలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వంటి వారు ముఖ్యులు. సుందరయ్య, బసవపున్నయ్య, రాజేశ్వరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బి.ఎన్.రెడ్డిలతో కూడిన కమిటీ దాన్ని నడిపించింది. వందల సంఖ్యలో కమ్యూనిస్టులు భౌగోళిక సరిహద్దుల ప్రసక్తి లేకుండా ఆ పోరాటంలో కీలక పాత్ర వహించారు. ప్రాణాలర్పించారు. నాలుగు వేల మంది తెలంగాణ యోధులతో పాటు కోస్తా ప్రాంతంలోనూ మూడు వందల మంది పోలీసు తూటాలకు బలైనారు. దానికి ఆయుధాలు, నిధులనే కాక కార్యకర్తలను కూడా అందించడంలోనూ, ఆశ్రయం ఇవ్వడంలోనూ, నిర్బంధ తరుణంలో తోడుగా పోరాడటం లోనూ కోస్తా ప్రాంత ప్రజానీకం ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించారు. ప్రజాశక్తి నగర్ ఈ కృషికి కేంద్ర బిందువు. ఆ కారణంతోనే కాంగ్రెస్ పాలకులు 1948 తర్వాత దాన్ని ధ్వంసం చేశారు. పీడిత ప్రజా విముక్తి అనే విశాల లక్ష్యంతో జరిగిన విప్లవ పోరాటాన్ని తదుపరి రాజకీయాల సంకుచిత సులోచనాలతో వక్రీకరించడం ఎవరికీ మంచిది కాదు. కొందరు మరీ విపరీత ధోరణిలో నిజాం కూలిపోవడం వల్ల నష్టం జరిగినట్టు కూడా రాశారు. అవన్నీ ఎలాగూ నిలవలేదు.
చారిత్రిక అనివార్యత
కెసిఆర్ ప్రభుత్వం కూడా ఈ పోరాట వారసత్వాన్ని తలుచుకోవడానికి ఎనిమిదేళ్లు పట్టింది. కె.సి.ఆర్ చాలాకాలంగా నిజాం ఘనతను కీర్తిస్తున్నారు. ఉత్సవాలు కూడా జరపడానికి వెనుకాడారు. రజాకార్ల నాయకుడైన కాశిం రజ్వీ స్థాపించిన మజ్లిస్ పార్టీ నేత ఒవైసీ లేఖ రాశాక జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిన్నారు. బిజెపి మతకోణంలో విమోచన అంటుంటే కాంగ్రెస్ స్వతంత్ర దినోత్సవం అంటున్నది. అంటే వీరెవరికీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ఆ పేరుతోనే జరపడం ఇష్టం లేదు. శ్రీశ్రీ అన్నట్టు తారీఖులు, దస్తావేజుల కన్నా చరిత్ర సారం కీలకం. ఆ విధంగా చూస్తే తెలంగాణ సాయుధ పోరాటం 75 ఏళ్ల తర్వాత తన విశిష్టతను చాటుకుంటున్నది. కమ్యూనిస్టులు రాజకీయ మార్పుల రీత్యా సెప్టెంబరు 17నే జరిపి సైద్ధాంతిక చారిత్రిక ప్రాధాన్యత చెబుతూ వస్తున్నారు. బిజెపి రంగ ప్రవేశం తర్వాత వక్రీకరణలను నిలవరించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మారిన ఈ పరిస్థితుల్లో జాతీయ సమైక్యతా దినోత్సవంగానైనా దీన్ని జరపడం అందువల్లనే. తెలంగాణ సాయుధ తిరుగుబాటు జరక్కపోతే రాష్ట్రం, దేశం కూడా ఎలా వుండేది అన్నది ఊహించుకోవలసిందే. ఇప్పుడు రెండు రాష్ట్రాలైనా ఆ చారిత్రక సత్యాలు మారవు. ఆ పోరాట వారసత్వాన్ని సరైన రీతిలో ముందుకు తీసుకుపోవడం వల్ల కలిగే సత్ఫలితాలూ అంత గొప్పగానే వుంటాయి.
లాల్ సలామ్ వీర తెలంగాణ.
తెలకపల్లి రవి