
- సాధారణ స్థితిని దాటిన రుతుపవన ద్రోణి
- అన్నిచోట్లా పెరిగిన ఉష్ణోగ్రతలు
- మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి!
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : గత ఐదు రోజులుగా వాతావరణంలో ఇంత మార్పు ఏంటబ్బా? అంటూ రాష్ట్ర ప్రజానీకం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవిలో ఉండే అసౌకర్యాన్ని ప్రజలు కొన్ని రోజులుగా అనుభవిస్తున్నారు. వాతావరణ శాఖ తాజా నివేదికను చూస్తే... 'జూన్-సెప్టెంబర్ రుతుపవన కాలంలో ఒక్కోసారి ఇలా 'స్తబ్దత'గా తయారవుతుంది. దీన్నే మాన్‌సూన్ ట్రఫ్ లేదా మాన్‌సూన్ బ్రేక్ కాలంగా పిలుస్తారు' అని నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 38 లేదా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణ నిపుణులు చెబుతున్న ప్రకారం... మాన్‌సూన్ ట్రఫ్ అనేది పైకి వెళ్తోంది. వేసవిలో ఉండే అసౌకర్య స్థితిని రాష్ట్రం ఎదుర్కొనడానికి కారణం హిమాలయాల వైపు రుతుపవనాల ద్రోణి (మాన్‌సూన్) వెళ్లడమేనని చెబుతున్నారు. దీనివల్ల రుతుపవనాలు క్రియాశీలతను కోల్పోతాయి. దీన్నే రుతుపవనాల బ్రేక్ కాలంగా పిలుస్తారు. మరో నాలుగు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల గురు, శుక్రవారాల్లో రాష్ట్రమంతటా రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనివల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. కొన్నిచోట్ల ఎండల ప్రభావంతో భరించరాని పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. ఇప్పటికే నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని పలుచోట్ల 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 35 డిగ్రీలు దాటిన కేంద్రాలు 629 ఉన్నాయి. వర్షపాతం లోటు రాష్ట్రమంతటా కలిపి 16.2 శాతం ఉంది.