
- నందిగామలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి రాష్ట్రం అంతటా విస్తరించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ, మోస్తరు వర్షాలు కురిశాయి. భానుడి భగభగలతో విలవిల్లాడిన ప్రజానీకం వాతావరణ చల్లబడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఐఎండి నివేదిక ప్రకారం..ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి బిఆర్ అంబేద్కర్ తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గురువారం ఎన్‌టిఆర్ జిల్లా నందిగామలో 108 మిల్లీమీటర్లు, పల్నాడు జిల్లా దూళిపాళ్లలో 66, సత్తెనపల్లిలో 65, చాగల్లులో 59.5, కృష్ణా జిల్లా గుడ్లవల్లూరులో 49.75, ముప్పాళ్లలో 46 మిల్లిమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైనట్లు వివరించారు. శుక్రవారం పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం వుందని తెలిపారు.