
రేపు , ఎల్లుండి వర్షాలకు అవకాశం
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో :పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని సరిహద్దు ప్రాంతమైన తూర్పు మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం వాయుగుండంగా మారింది. ఇది విశాఖకు ఆగేయంగా 510 కిలోమీటర్లు, పారాదీప్ (ఒడిశా)కు దక్షిణ ఆగేయంగా 650 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ దీఘాకు దక్షిణంగా 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల పడొచ్చు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా పలుచోట్ల సంభవించవచ్చు. దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల పడొచ్చు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా పలుచోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమలో రాగల రెండు రోజులూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల పడొచ్చు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా కొన్నిచోట్ల సంభవించే అవకాశముంది. ఇది మొదట వాయువ్య దిశగా, తదుపరి ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరప్రాంతం, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా మరింత బలపడే అవకాశముంది. ఇది ఆ తరువాత దిశ మార్చుకొని పునరావృత దిశలో ఉత్తర ఈశాన్య దిశగా ఈ నెల 17న వాయువ్య బంగాళాఖాత ప్రాంతమైన ఒడిశా తీర ప్రాంతాలకు, 18న ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలకు, పశ్చిమ బెంగాల్ తీరాలకు విస్తరించే అవకాశముందని ఉందని అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల్లో మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించింది. ఉపరితల ద్రోణి ఉత్తర శ్రీలంక మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.