
కన్నూర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ గోపీనాథ్ రవీంద్రన్‌ను 'క్రిమినల్' అని కేరళ గవర్నరు అరిఫ్ మహ్మద్ ఖాన్ వ్యాఖ్యానించడం అత్యంత అభ్యంతరకరమూ, బాధ్యతారాహిత్యం కూడా. గత రెండున్నరేళ్లుగా అరిఫ్ మహ్మద్ ఖాన్ మాటలు, చేష్టలు చూసినవారికెవరికైనా ఆయన ఒక గవర్నర్‌లా కాకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఫక్తు రాజకీయ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతుంది. గవర్నరు అనుచిత వ్యాఖ్యలను ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం, వామపక్షాలే కాదు, దేశంలోని 50 మందికి పైగా ప్రఖ్యాత చరిత్రకారులు, మేధావులు సైతం తీవ్రంగా ఖండించారు. ప్రొఫెసర్ రవీంద్రన్‌కు పూర్తి సంఘీభావం ప్రకటించారు. దేశం గర్వించదగ్గ చరిత్రకారుల్లో ఒకరైన రవీంద్రన్‌ను 'క్రిమినల్', 'కుట్రదారు', 'దురాక్రమణదారు' అంటూ నిరాధారమైన ఆరోపణలు చేయడం గవర్నరుకు తగదని వారు హెచ్చరించాల్సి వచ్చింది. గవర్నరుకు ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేముంటుంది? నైతిక విలువలను, రాజ్యాంగ ప్రమాణాలను బాహాటంగా ఉల్లంఘిస్తూ కేరళ ప్రభుత్వంతో పదే పదే కయ్యానికి దిగే ఇటువంటి జగడాలమారి గవర్నర్‌ను కేరళలో బిజెపి, కాంగ్రెస్ వెనకేసుకురావడం వాటి దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనం. బిజెపి అంటే సరే. కానీ, కాంగ్రెస్ బుద్ధి ఏమైంది. కన్నూర్ యూనివర్సిటీకి డిసిసి అధ్యక్షుడ్ని వి.సి గా చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఎక్స్‌లెన్స్ గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఢిల్లీ లోని జామియా మిలియా ఇస్లామియా సెంట్రల్ యూనివర్సిటీలో చరిత్ర, సంస్కృతి విభాగం అధిపతిగా, భారతీయ చరిత్ర సంస్కృతి పరిశోధనా మండలి మెంబర్ సెక్రటరీగా, జామియా మిలియా యూనివర్సిటీలో నెల్సన్ మండేలా శాంతి పీఠం సంచాలకులుగా వ్యవహరించిన ప్రొఫెసర్ రవీంద్రన్‌ను కన్నూర్ యూనివర్సిటీ వి.సి గా నియమించినప్పుడూ గవర్నరు మోకాలడ్డే ప్రయత్నం చేశారు. 2019 డిసెంబరులో కన్నూర్ యూనివర్సిటీ ఆతిథ్యమిచ్చిన హిస్టరీ కాంగ్రెస్ మహాసభలకు చాన్సలర్ హోదాలో హాజరైన గవర్నరు అరిఫ్ మహ్మద్ ఖాన్ వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ (సిఎఎ)ను పొగుడుతూ మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో సిఎఎను గవర్నరు సమర్థించడంతో ఆకస్మికంగా చెలరేగిన నిరసనలను హింసగా అభివర్ణించడం గవర్నరు తెంపరితనాన్ని తెలియజేస్తోంది. వేదిక ముందున్న కొంతమంది ప్రతినిధులు కూడా నిరసన తెలిపారు. మత పరమైన విభజన ద్వారా ఒక సమూహానికి పౌరసత్వం లేకుండా చేయడాన్ని సమర్థించడానికి హిస్టరీ కాంగ్రెస్ వేదికను గవర్నర్ దుర్వినియోగపరచినప్పుడు లౌకికవాదానికి కట్టుబడి ఉన్నవారెవరైనా నిరసన తెలపకుండా ఎలా ఉంటారు? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరునికి ఉంటుంది. వారు అదే పని చేశారు. దీనిపై ఆగ్రహోదగ్రుడైన గవర్నరు అరిఫ్ మహ్మద్ ఖాన్ వి.సి రవీంద్రన్ ప్రోద్బలంతోనే ఇర్ఫాన్ హబీబ్ తనపై దాడికి వచ్చారని అవాకులు చవాకులు పేలారు. ఆయన వ్యాఖ్యలపై ఆ నాటి పత్రికలు ఘాటుగానే స్పందించాయి. గవర్నరు ద్వేషపూరిత ప్రసంగాన్ని విన్న ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్ లేచి తన అభ్యంతరం చెబితే, అది హింస అని చెప్పడం హాస్యాస్పదం.
లౌకిక, ప్రజాస్వామ్యం కోసం నికరంగా పోరాడేవారిని సంఫ్‌ు పరివార్ తన శత్రువులుగా చూస్తుంది. ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్, ప్రొఫెసర్ రవీంద్రన్ రుజువుల ఆధారంగా చరిత్రను విశ్లేషిస్తారు. అందుకే వారంటే సంఫ్‌ు పరివార్‌కు మంట. 'ముందు భయపెట్టండి, అప్పటికీ దారిలోకి రాకపోతే చంపండి'. ఇదీ ఫాసిస్టుల ధోరణి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం దీనినే అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నది. విద్వేషాలను రెచ్చగొట్టి, డబ్బును కుమ్మరించి అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. అది సాధ్యం కాని రాష్ట్రాల్లో ఫెడరలిజం విలువలను తుంగలో తొక్కి గవర్నర్ల ద్వారా మితిమీరిన అధికారాన్ని చలాయిస్తున్నది. కేరళ గవర్నర్ నీతిమాలిన చర్యలు ఇందులో భాగమే.
ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి, అప్రతిష్టపాల్జేయడానికి గవర్నర్ పదవులను ఉపయోగించే సంఫ్‌ు పరివార్ కుట్రల్ని తిప్పికొట్టాలి.