Aug 09,2022 06:22

బలమైన ప్రభుత్వం ఎలా వుండాలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. జులై 29న చెన్నైలో ఒక యూనివర్శిటీ స్నాతకోత్సవంలో మోడీ మాట్లాడుతూ ''బలమైన ప్రభుత్వం ప్రతీ దాన్ని లేదా ప్రతి ఒక్కరినీ నియంత్రించాలనుకోదు. జోక్యం చేసుకోవడానికి వ్యవస్థ యొక్క ప్రేరణను ఇది నియంత్రిస్తుంది...పటిష్టమైన ప్రభుత్వం ప్రతి ఒక్క రంగంలోకి వెళ్ళాలనుకోదు.'' అని పేర్కొన్నారు. ''అన్నింటినీ తెలుసుకోలేమని లేదా చేయలేమని అంగీకరించే వినయంలోనే పటిష్టమైన ప్రభుత్వం యొక్క బలం ఆధారపడి వుంది.'' అని కూడా మోడీ వ్యాఖ్యానించారు.
నిజంగా ఇవి చాలా మంచి మాటలు! కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కచ్చితంగా దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. మోడీ ప్రభుత్వం అన్నింటినీ, అందరినీ నియంత్రించాలనుకుంటోంది. ప్రతి ఒక్కరి డొమైన్‌ లోకి మోడీ ప్రభుత్వం దూరుతోంది. చివరకు రాజ్యాంగం హామీ కల్పించిన పౌరుల హక్కులను కుదించే విషయంలో కూడా వెనక్కి తగ్గడం లేదు.
వాస్తవానికి, సమాజంలోని అన్ని రంగాల్లోనూ పూర్తి నియంత్రణ కోసం ఈ బలమైన ప్రభుత్వం ఏకబిగిన అన్వేషిస్తోంది. ఎన్నికల ప్రజాస్వామ్యం చాలా వేగంగా ఎన్నికల నియంతృత్వంగా మారిపోతోంది. పార్లమెంట్‌ను కించపరుస్తున్న విధానం, ప్రతిపక్షాల గొంతు నులుముతున్న తీరు... పార్లమెంట్‌ ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో స్పష్టంగా ప్రదర్శితమవుతోంది. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలకు చెందిన 27 మంది సభ్యులను సస్పెండ్‌ చేశారు.
ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడానికి, వారిని జైళ్ళలో బంధించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి) ఒక రాజకీయ సాధనంగా మారింది. తమను ఎవరైనా ఏమైనా అంటారనే భయం కూడా లేకుండా ఇ.డి వ్యవహరిస్తున్న తీరు గత వారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో మరింత ఉధృతమైంది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఇ.డి కి సంక్రమించిన నిరంకుశ అధికారాలను సుప్రీం కోర్టు చట్టబద్ధం చేసింది. నిరంకుశ అరెస్టులు, బెయిల్‌ లేకుండా నిర్బంధాలు, ఆస్తుల జప్తు వంటివన్నీ ఇకపై నిబంధనలుగా మారనున్నాయి.
యుఎపిఎ, ఎన్‌ఎస్‌ఎ, ఇతర జాతీయ భద్రతా చట్టాలు సర్వసాధారణంగా పని చేస్తున్నందున...పౌరుల జీవించే హక్కులను, స్వేచ్ఛను తొక్కిపెడుతున్నామని కనీసం గుర్తించడానికి కూడా అత్యున్నత న్యాయ వ్యవస్థ తిరస్కరిస్తున్నందున, ప్రతిపక్షాలను, అసమ్మతిని అణచివేయడానికి, పౌర సమాజాన్ని మచ్చిక చేసుకోవడానికి చట్టబద్ధమైన సాధనాలు పెరుగుతున్నాయి. సవరించిన ఎన్నికల చట్టం ప్రకారం ఆగస్టు 1 నుండి ఆధార్‌తో ఓటర్‌ ఐడిని అనుసంధానించడం ఆరంభమైంది. ఎలాంటి నిశిత పరిశీలన లేదా చర్చ జరగకుండానే గతేడాది డిసెంబరులో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఈ సవరించిన బిల్లును ఆమోదించేశారు. ఆధార్‌ను అనుసంధానించడమనేది స్వచ్ఛందమే అయినప్పటికీ, ఆచరణలో అలా చేయని పక్షంలో ఓటర్ల జాబితా నుండి ఓటరు పేరును తొలగించడానికి దారి తీయవచ్చు. ''ఓటర్ల జాబితాలో ఓటర్ల గుర్తింపును తెలుసుకునేందుకు, వారిస్తున్న సమాచారం నిజమేనా కాదా అని రూఢ చేసుకునే'' ఉద్దేశ్యంతోనే ఇలా ఆధార్‌తో అనుసంధానిస్తున్నారు. డూప్లికేట్‌ ఓటరు ఐడి కార్డులను తొలగించే లక్ష్యంతోనే ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియ చేపట్టినందున, ఈ అనుసంధానం ద్వారా నిజమైన ఓటర్లను కూడా పెద్ద సంఖ్యలోనే తొలగించవచ్చనే భయాందోళనలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. పలువురి ఓటర్‌ ఐడి కార్డులను తొలగించేందుకు తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టు, ఏకంగా 10.26 లక్షల ఓటర్ల ఐడి కార్డులు తొలగించడానికి దారితీసింది. వీరిలో ఎంతమంది సరైన ఓటర్లో నిర్ధారించాల్సి వుంది.
సేకరించిన డేటా విశ్వసనీయతకు ఎలాంటి హామీ లేనందున ఆధార్‌తో అనుసంధానం...ఓటర్ల వ్యక్తిగత సమాచార సేకరణకు, వారి ఎన్నికల ప్రాధాన్యతల నిఘాకు పునాది వేయగలదు. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి కావడం ప్రధాని అభిరుచి అయినందున, ఆయన చేసే ప్రతి ఒక్క ప్రకటనను పూర్తిగా అర్ధం చేసుకోవాల్సిన అవసరం పడుతోంది. అంతకు ముందు జులై 25న ప్రధాని చేసిన ప్రసంగాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లైతే, దేశ, సమాజ సంక్షేమానికి మించి, తమ సైద్ధాంతిక, రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే పద్ధతి పట్ల మోడీ ప్రతిపక్షాన్ని హెచ్చరించారు. ''సిద్ధాంతాలకు, రాజకీయ ఆకాంక్షలకు స్థానం వుండాలి. కానీ, దేశం, సమాజం అన్నింటి కంటే ముందు వుండాలి.'' అని మోడీ వ్యాఖ్యానించారు. ఆ వాక్యాలను జాగ్రత్తగా చదవడం ద్వారా ఆయన ఏం చెప్పాలనుకున్నారో అర్ధం చేసుకోవాలి. దేశ ప్రయోజనాలు నెరవేర్చగల ఏకైక సిద్ధాంతం, రాజకీయం కేవలం హిందూత్వ మాత్రమే. ఇతర సిద్ధాంతాలన్నీ దేశం, సమాజం ప్రయోజనాలు నెరవేర్చేవి కావు.
ఈ దృక్పథంతోనే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నడుస్తోంది. రాష్ట్రాల్లో హిందూత్వను అధికారిక సిద్ధాంతంగా నెలకొల్పాలని భావిస్తోంది. ఇందులో భాగంగా విద్యా వ్యవస్థకు ప్రభుత్వం తిరిగి రూపమిస్తోంది. సిలబస్‌ను కూడా హిందూత్వ సిద్ధాంతాలకు అనుగుణంగా రూపొందిస్తోంది. చరిత్రను, పాఠ్యపుస్తకాలను తిరిగి రాయడం కూడా అప్రతిహతంగా కొనసాగుతోంది.
విద్యా, సంస్కృతులతో సహా అన్ని రంగాలపై పూర్తిగా నియంత్రణ విధించాలని ఈ బలమైన ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మోడీ రెండు నాలుకలతో మాట్లాడడాన్ని, మెలికలు పెట్టి మాట్లాడడాన్ని కూడా పరిశీలించడం ముఖ్యం.

('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)