Mar 21,2023 07:32

పార్లమెంటు సమావేశాలు జరగక పోవడానికి కారణాలు అనేకం. చాలా సందర్భాలలో, పార్లమెంట్‌లో ప్రతిష్టంభన సృష్టించడంలో ప్రతిపక్షం కీలక పాత్ర పోషిస్తుంటుంది. ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా అనేక అత్యవసర సమస్యలపై చర్చించాలనే డిమాండ్‌తో నిరసనలు చేపట్టడంతో పార్లమెంట్‌ స్తంభించింది. అయితే మోడీ హయాంలో పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేసే బాధ్యతను మోడీ అభిమానులే భుజానకెత్తుకున్నారని గమనించవచ్చు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ అధికార పార్టీకి మెజారిటీ ఉంది. లోక్‌సభలో మెజారిటీ భారీగా ఉంది. దాంతో తమ మాటలతో ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీ అభీష్టం మేరకు మాత్రమే సభ సాగింది. ఇంత జరుగుతున్నా... పార్లమెంటును గందరగోళ పరిస్థితిలో ఉంచేందుకు బిజెపి ఎందుకు తహతహలాడుతున్నందో చాలా మందికి అర్థం కాలేదు.
      నిజానికి మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అధికార పక్షం పార్లమెంట్‌ను తన ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోంది. ప్రతిపక్షాల గొంతు నొక్కివేయడం రివాజుగా మారుతోంది. పార్లమెంటులో ఎంత చర్చ జరగాలనేది ప్రభుత్వ పక్షమే నిర్ణయిస్తున్నది. ప్రతిపక్షాలు ఎంత సమయం మాట్లాడాలనేది కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. దేశానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న అంశాలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరగా, దానిని తిరస్కరించారు. ప్రభుత్వానికి, ప్రధానికి అసౌకర్యంగా ఉండే ఏ అంశం మీదా పార్లమెంటులో చర్చకు అనుమతించలేదు.
       అదానీ గ్రూపు పాల్పడిన మోసానికి సంబంధించి దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొన్న తరుణంలో ఈ విషయమై చర్చించాలని ప్రతిపక్షాలు కోరాయి. అదానీతో మోడీకి ఉన్న సాన్నిహిత్యంపై కూడా ప్రజల్లో తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల ప్రశ్నలకు పార్లమెంటులో మోడీ స్వయంగా సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. పార్లమెంటరీ కమిటీ విచారణలో అదానీ బండారం బయటపడాలని ప్రజలు కోరుకుంటున్నారు. చర్చ జరిగితే మోడీ ముసుగు తొలగవచ్చు. అయితే ప్రభుత్వం, అదానీపై ఎలాంటి చర్చను కోరుకోవడం లేదు. అందుకే మోడీ సూచనల మేరకు మంత్రులు, పార్లమెంటు సంభ్యులు చర్చను పక్కకు నెట్టేందుకు పార్లమెంట్‌లో ఇష్టానుసారం ప్రవర్తిస్తూ సభకు అంతరాయం కలిగిస్తున్నారు. అయితే మోడీ హయాంలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందన్న రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను అందుకు సాకుగా చూపారు. అధికారపక్షం విపక్షాల నోరు నొక్కుతున్న తీరు గురించి మాట్లాడి ఆయన భారత్‌ను అవమానించారట. అంటే రాహుల్‌ క్షమాపణ చెప్పాలి. లేకుంటే పార్లమెంట్‌ను కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతించదు. దీన్నిబట్టి పార్లమెంటును స్తంభింపజేయడంపై ప్రభుత్వ పక్షాల ఎంపీలు, మంత్రులు గుండెలు బాదుకుంటున్నారని భావించవచ్చు. పార్లమెంటును నడపాల్సిన బాధ్యత ఉన్నవారే అడ్డుకుంటున్నారు. వారే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇంతకంటే పెద్ద దెబ్బ ఏముంటుంది ?

/'గణశక్తి' సంపాదకీయం /