
-రైతులకు ప్రోత్సాహకాలు, గిట్టుబాటు ధర ఏవీ? : వి.శ్రీనివాసరావు
-అల్లూరి జిల్లాలో ప్రజారక్షణ భేరి బస్సు యాత్రకు అపూర్వ ఆదరణ
ప్రజాశక్తి- పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా):ఏజెన్సీలో కాఫీ తోటల పెంపకం నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసిందని, గిరిజన రైతులకు ప్రోత్సాహకాలు, గిట్టుబాటు ధర అందించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసగిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. అసమానతలు లేని అభివృద్ధిని కాంక్షిస్తూ సిపిఎం ఆధ్వర్యాన తలపెట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర శుక్రవారం అల్లూరి జిల్లాలోని పెదబయలు, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి మండలాల్లో సాగింది. ఆయాచోట్ల ఈ యాత్రకు ఘన స్వాగతం లభించింది. గిరిజనులు తమ సమస్యలపై యాత్రా బృందానికి వినతిపత్రాలు అందజేశారు. పెదబయలు మండలం ఈదులుపుట్టు గ్రామంలో గిరిజన రైతుల కాఫీ తోటలను వి.శ్రీనివాసరావు, యాత్రా బృందం సభ్యులు పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాడేరులో కాఫీ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సామల రమేష్‌తో సమావేశమై కాఫీ రైతుల సమస్యలపై చర్చించారు. అనంతరం పాడేరులో జరిగిన బహిరంగ సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏజెన్సీలో కాఫీ, మిరియాల పెంపకాన్ని నాడు ప్రభుత్వాలు ఎంతో ప్రోత్సహించాయని, నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాఫీ తోటల నిర్వహణకు రైతులకు నిధులు ఇవ్వకుండా నిరుత్సాహపరుస్తున్నాయని అన్నారు. అరకు కాఫీ అంతర్జాతీయ ఖ్యాతి గడించినా గిరిజన రైతులకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదని తెలిపారు. కాఫీ కిలోకు రూ.500, మిరియాలకు రూ.వెయ్యి ధర కల్పించాలన్న గిరిజన రైతుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రోత్సాహకాల కింద కాఫీ రైతులకు చెల్లించాల్సిన కోట్ల రూపాయలను నాలుగేళ్లుగా ఇవ్వకపోవడం దారుణమన్నారు. గిరిజన ప్రాంతంలో అభివృద్ధి కానరాకున్నా, ఆదివాసీలకు అన్యాయం జరుగుతున్నా ఈ ప్రాంత ఎంపి, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. 'ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే నియోజకవర్గాల్లో ప్రజలకే మీరు కనిపించరా' అంటూ వారిని నిలదీశారు. ఏజెన్సీలో తొమ్మిది తెగల గిరిజనులు నేటికీ అత్యంత వెనుకబడి ఉన్నారని తెలిపారు. గిరిజన ప్రాంతంలో హైవే రోడ్లను వేస్తున్నది గిరిజనులపై ప్రేమతో కాదని, అటవీ సంపదను కొల్లగొట్టడానికేనని విమర్శించారు. అడవిలోకి అదానీ అడుగు పెడితే ఆదివాసీల ఉనికికే ముప్పని తెలిపారు. నాటి బాక్సైట్ పోరాటంలాగే నేడు హైడ్రో పవర్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఆదివాసీలకు అండగా ఎర్రజెండా నిలుస్తుందన్నారు. మోడీ చుట్టూ సిఎం జగన్ ప్రదక్షిణలు చేస్తున్నారని, విభజన హామీలను నెరవేర్చకున్నా అడగడం లేదని విమర్శించారు. ఎపికి బిజెపి సర్కారు తీవ్ర ద్రోహం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తోన్న కమ్యూనిస్టులకు ఆదివాసీలు ఎన్నికల్లో అండగా నిలవాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ పాడేరు ఏజెన్సీకి రూ.100 కోట్లు కేటాయిస్తే పుష్కలంగా సాగునీరు అందుతుందని, ఆ పని పాలకులు చేయడం లేదని అన్నారు. యాత్రలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, ఎ.అశోక్, అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం.సూర్యనారాయణ పాల్గన్నారు.
- పాడేరులో మెడికల్ కళాశాల నిర్మాణం పరిశీలన
పాడేరులో రూ.500 కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలను వి.శ్రీనివాసరావు పరిశీలించారు. నిర్మాణంలో జాప్యానికి కారణాలను నిర్మాణ సంస్థ ఎజిఎంను అడిగి తెలుసుకున్నారు. పాడేరులో యాత్రా బృందానికి స్కీం వర్కర్లు, పివిటిజిలు, కాఫీ రైతులు, కార్మికులు వారివారి సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.
- రోగుల గ్రామంలో ప్రాథమిక పాఠశాల సందర్శన
పెదబయలు మండలం రోగుల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను వి.శ్రీనివాసరావు సందర్శించారు. పాఠశాలలో ఉన్న పలువురు చిన్నారులను ఎక్కాలు, పద్యాలుపై ప్రశ్నలు వేసి పరీక్షించారు. ఐదో తరగతి చదువుతున్న ప్రశాంత్ ప్రపంచ దేశాలు, వాటి రాజధానులు, మరొక విద్యార్థి గ్రేసీ దేశంలోని రాష్ట్రాలు, వాటి రాజధానుల గురించి చెప్పారు. సంకోచం లేకుండా సమాధానాలు చెప్పిన విద్యార్థులను ఆయన అభినందించారు. భవనాల దుస్థితిపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు.