Jun 30,2023 06:56

  • జులై 1 ఏఐఐఇఏ ఆవిర్భావ దినోత్సవం

ఏఐఐఇఏ గత ఏడు దశాబ్దాలుగా సైద్ధాంతిక పునాదితో ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల ఉద్యమాన్ని ప్రజాఉద్యమంతో అనుసంధానం చేస్తూ, ఎదురైన సవాళ్ళను అధిగమిస్తూ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగించటం, ఎల్‌ఐసిలో వాటాల ఉపసంహరణ కాకుండా కాపాడుకోవడం, పాలసీదారుల ప్రయోజనాలను ఎల్‌ఐసి సంరక్షిస్తుందని భరోసా ఇవ్వడం, వారి ప్రయోజనాల పరిరక్షణకు ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించడం ఏఐఐఇఏ నేటి లక్ష్యంగా వుంది.

          'ఒంటరితనం నుండి సంఘటిత దిశగా' అనే నినాదంతో 'ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌' (ఏఐఐఇఏ) 1951 జులై 1వ తేదీన ఆవిర్భవించింది. ఇన్సూరెన్స్‌ రంగ జాతీయీకరణ కోరుతూ మొదటి సమావేశంలోనే తీర్మానాన్ని ఆమోదించి...ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలను అన్నింటిని కలిపి జాతీయీకరణ చేసి 'లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా'గా ఏర్పాటు చేసేలా పోరాడిన చైతన్యపూరిత చరిత్ర 'ఏఐఐఇఏ'ది.
        ఈ జనవరిలో కలకత్తాలో జరిగిన ఏఐఐఇఏ జాతీయ మహాసభలో సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి కా|| తపన్‌సేన్‌ సందేశమిస్తూ... జీతభత్యాల గురించి, ఉద్యోగ భద్రత గురించి చర్చించుకోవడం సాధారణంగా మహాసభలలో జరుగుతుంటుంది. కానీ, సామాజిక స్పృహగల ఒక సంఘంగా సమాజంలోని రుగ్మతలకు కారణాలను చర్చించి వాటిని నివారించేం దుకు అన్ని వర్గాలతో కలిసి ఏ విధంగా పోరాటం చేయాలో చర్చించటం ఏఐఐఇఏ విశిష్టత' అని పేర్కొనటం గమనార్హం.
          ఏఐఐఇఏ తొమ్మిదవ మహాసభ 1978లో కలకత్తాలో జరిగినప్పుడు సోషలిజం స్థాపనే మన లక్ష్యమనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన చరిత్రాత్మక నేపథ్యం వుంది. అప్పటి ఎమర్జెన్సీకి కారణమైన ఇందిరా గాంధీ ప్రభుత్వానికి దేశ ప్రజలు చరమగీతం పాడి దేశ ప్రజాస్వామ్యంపై నమ్మకం, విశ్వాసం పాదుగొల్పిన గొప్ప సందర్భమది.
           ఎల్‌ఐసిని ఐదు ముక్కలుగా విభజన చేయాలన్న బిల్లుకు వ్యతిరేకంగా ఏఐఐఇఏ సాగించిన పోరాటాన్ని పార్లమెంట్‌లో ప్రతిబింబించేలా వామపక్షాలు గొప్ప కృషి చేశాయి. ఏఐఐఇఏ సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన కా|| సునీల్‌ మైత్రా అప్పటి పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీని కలిసి ఎల్‌ఐసి విభజన బిల్లు దేశ సమగ్రతకు ఏ విధంగా విఘాతం కలిగిస్తుందో వివరించి ఆ బిల్లును పార్లమెంట్‌ నుంచి విరమించుకునేలా చేయడం యూనియన్‌ పోరాట ప్రస్థానంలో మరొక ముఖ్య ఘట్టం.
            జాతీయ ఇన్సూరెన్స్‌ రంగాన్ని పరిరక్షించటానికి ఏఐఐఇఏ ఏడు దశాబ్దాలుగా నిరంతర పోరాటాన్ని కొనసాగించింది. 'ప్రజల సొమ్ము ప్రజల శ్రేయస్సు కోసమే' అనే ఇన్సూరెన్స్‌ జాతీయీకరణ లక్ష్యాల సాధన కోసం ప్రచార, పోరాట కార్యాచరణతో నిరంతరం సైద్ధాంతిక నిబద్ధతతో పయనించింది. ఎమర్జెన్సీ కాలంలోనే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు గొంతెత్తి నినదించింది. ఎల్‌ఐసిని 5 స్వతంత్ర ప్రతిపత్తిగల కార్పొరేషన్‌గా విభజించాలన్న నాటి ప్రభుత్వ ప్రయత్నాలకు, మల్హోత్రా కమిటీ, బీమా రంగ సంస్కరణలు, ప్రైవేటీకరణ వంటి అంశాలకు వ్యతిరేకంగా కోటి యాభై లక్షల సంతకాల సేకరణతో విస్తృత ప్రజాభిప్రాయాన్ని కూడగట్టింది. బీమా రంగ ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా 'పీపుల్స్‌ పిటిషన్‌' పేరుతో వాటిని పార్లమెంట్‌కు సమర్పించడం వంటి ప్రచార ఆందోళనా ఉద్యమాలను చేపట్టింది.
         ఎల్‌ఐసి, ఇన్సూరెన్స్‌ చట్టసవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల పార్లమెంట్‌ సభ్యులను కలిసి వివరించి పార్లమెంట్‌లో అనేక సార్లు జాతీయ ఇన్సూరెన్స్‌ రంగ పరిరక్షణ కోసం చర్చ జరిగేలా కృషి చేసింది.
          ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేటీకరణ విధానాలపై జాతీయ కార్మిక సంఘాలతో కలిసి సమ్మెలలో పాల్గొని సమర శంఖం పూరించింది. దీంతోపాటు వేతన సవరణలు, పెన్షన్‌ సాధనతో సహా అనేక సౌకర్యాలు, సదుపాయాలను సాధించి మెజారిటీ ఉద్యోగుల మన్ననలు పొందింది.
ఎల్‌ఐసి, జాతీయ సాధారణ బీమా పరిశ్రమల వ్యవస్థాగత లక్ష్యాలను పరిరక్షించడం, విశాల ఉద్యోగుల ఐక్యతను కాపాడడం, ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల పోటీని ఎదుర్కొని సంస్థను మార్కెట్‌ లీడర్‌గా నిలపడం, ప్రభుత్వ ప్రైవేటీకరణ, డిజిన్వెస్ట్‌మెంట్‌ విధాన ప్రభావం నుంచి జాతీయ బీమా రంగాన్ని కాపాడుకోవడం, ఎల్‌ఐసి-ఐపీఓ అనంతర పరిణామాలపై పట్టాదారులకు భరోసా కల్పించడం వంటి అనేక రూపాలలో నేడు ఏఐఐఇఏ బహుముఖ సవాళ్ళను ఎదుర్కొంటోంది.
          ప్రస్తుత సవాళ్ళు గతంలో ఎదుర్కొన్న వాటి కంటే పెద్దవి. ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల ప్రభావమే ఇందుకు కారణం. ప్రజాస్వామిక భిన్నాభిప్రాయాన్ని, ప్రశ్నించే తత్వాన్ని ఆహ్వానించే పరిస్థితి కూడా నేడు లేదు.
          ఏఐఐఇఏ గత ఏడు దశాబ్దాలుగా సైద్ధాంతిక పునాదితో ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల ఉద్యమాన్ని ప్రజాఉద్యమంతో అనుసంధానం చేస్తూ ఎదురైన సవాళ్ళను అధిగమిస్తూ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగించటం, ఎల్‌ఐసిలో వాటాల ఉపసంహరణ కాకుండా కాపాడుకోవడం, పాలసీదారుల ప్రయోజనాలను ఎల్‌ఐసి సంరక్షిస్తుందని భరోసా ఇవ్వడం, వారి ప్రయోజనాల పరిరక్షణకు ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించడం ఏఐఐఇఏ నేటి లక్ష్యంగా వుంది.
            పాలక వర్గాల మతతత్వ, విచ్ఛిన్నకర పోకడలను, కార్మిక చట్టాల మార్పుల వంటి విధానాలను తిప్పికొట్టాలి. ఇన్సూరెన్స్‌ పరిశ్రమలో ఉద్యోగుల ఐక్యతకే పరిమితం కాక, విశాల కార్మిక వర్గ ఐక్యత-నిర్మాణం కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలి. ఈ లక్ష్యాల సాధనకు ఏఐఐఇఏ 73వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పునరంకిత మవ్వడం దేశవ్యాప్తంగా ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల నేటి కర్తవ్యం.

/వ్యాసకర్త ఎస్‌.సి.జడ్‌.ఐ.ఇ.ఎఫ్‌ ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఎల్‌.ఐ.సి ఉద్యోగ సంఘం జాయింట్‌ సెక్రటరీ,
సెల్‌: 9440905501/
జి. కిషోర్‌ కుమార్‌

జి. కిషోర్‌ కుమార్‌