నాలుగు గ్రామాలు కలిసే ప్రాంతంలో ఒక రావి చెట్టు ఉంది. ఆ చెట్టు వయసు వందేళ్లు పైనే ఉంటుందని అందరూ చెప్పుకొంటుంటారు. ప్రతి ఒక్కరూ ఆ చెట్టు నీడన సేదతీరి, తాము తెచ్చుకున్న ఆహారం అక్కడే తిని, కాసేపు విశ్రమించి వెళతారు.
ఆ నాలుగు గ్రామాలలో ఒకటైన రాఘవపురంలో ఉండే రైతు శివయ్యకు ఆ రావి చెట్టు అంటే ఎంతో ప్రాణం. ఆకులు రాలే కాలం మొదలయ్యింది. శిశిర ఋతువులో ఆ రావిచెట్టు ఆకులు రాలిపోయి, అంతా బోడిగా కనిపిస్తుంది. మళ్లీ వసంత ఋతువులో ఆ చెట్టు పచ్చని ఆకులతో కళకళలాడుతుంది.
ఒకసారి శివయ్య ఆ చెట్టు కింద కూర్చొని ఉండగా 'ఈ ఆకులు రాలే కాలంలో నన్ను ఎవ్వరూ పట్టించుకోరు. పక్షులు కూడా నా కొమ్మల మీద గూడు కట్టుకోవు, ఒక్కటి కూడా వాలదు' అని చెట్టు కన్నీరు కార్చింది. ఆ మాటలు విన్న శివయ్య ఆ రోజు నుండీ ఒక్క వర్షాకాలంలో తప్ప మిగతా రోజుల్లో ఒక చెంబుతో నీళ్లు తెచ్చి ఆ చెట్టు మొదట్లో పోసి, నీవు చల్లగా ఉండాలి అని పలుకరించి వెళ్ళేవాడు. రాఘవాపురం గ్రామంలోని వారు 'శివయ్య పిచ్చిగానీ ఒక చెంబుడు నీళ్లు ఆ చెట్టుకు సరిపోతాయా?' అని నవ్వుకునేవారు. అలా శివయ్యతో రావి చెట్టుకు స్నేహం ఏర్పడింది.
ఒకరోజు 'చూడు శివయ్యా! ఎంతో కాలంగా క్రమం తప్పకుండా నాకు నీళ్లు పోస్తున్నావు. ఆ నీళ్లతో ఒక్క వేరు తడిసినా నేను ఎంతో పులకరించిపోతాను. నీకు ఒక ఉపకారం చేయాలనుకొంటున్నాను.. కాదనకూడదు' అంది చెట్టు.
'అలాగే' అన్నాడు శివయ్య.
'నీవు నీళ్లు పోసే ప్రదేశంలో కాస్త తవ్విచూడు' అంది చెట్టు. శివయ్య అలాగే చేశాడు చిన్న గుడ్డ సంచి కనిపించింది. అది విప్పి చూసి 'ఇందులో ఐదు బంగారు నాణేలు ఉన్నాయి' అన్నాడు శివయ్య.
'వాటిని తీసుకుని, సుఖంగా జీవించు' అంది చెట్టు.
శివయ్య వాటిని తీసుకుని చెట్టుకు కృతజ్ఞతలు చెప్పి ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు గ్రామాధికారి వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. 'ఆ రావి చెట్టు నాకు ఇచ్చిన నాణేలు మన గ్రామాభివృద్ధి కోసం వినియోగించడం ఎంతో శ్రేయస్కరం అనిపించింది' అన్నాడు శివయ్య.
'నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు శివయ్యా. నీ గురించి కాకుండా గ్రామం గురించి ఆలోచిస్తున్నావు. చాలా సంతోషం. ఈ మధ్య మన గ్రామంలో కొందరు యాచకులు తయారయ్యారు. వారికి చేతివృత్తి పనులలో అవగాహన కల్పించి, వారితోనే ఒక కుటీర పరిశ్రమ పెట్టిస్తే ఎలా ఉంటుంది..?' అన్నాడు గ్రామాధికారి.
'చాలా బాగుంటుంది.. అలాగే చేద్దాము' అన్నాడు శివయ్య.
గ్రామాధికారి ఆ యాచకులను పిలిపించి, విషయం చెప్పాడు. వారు అంగీకరించారు. వారికి వెదురు, చెక్క బొమ్మలు తయారుచేయడంలో శిక్షణ ఇప్పించి, ఆ శిక్షణ పూర్తి అయ్యేవరకూ వారికి భోజనం ఏర్పాటు చేశాడు. వాళ్లు పూర్తిగా వృత్తి పని నేర్చుకున్నాక, ఆ బంగారు నాణేలను సొమ్ముగా చేసిన దానిలో నుంచి కొంత తీసి అవసరమైన సామాగ్రిని కొని, వారికి ఇచ్చారు. వారు ఎంతో సంతోషించారు. వారు చేసిన బొమ్మలను, ఇతర వస్తువులను సంతలో అమ్మడానికి శివయ్య, గ్రామాధికారి సహకరించారు.
తరువాత గ్రామంలోని చాలా రహదారుల మరమ్మతుకు, వీధి దీపాలకు కొంత సొమ్మును వినియోగించారు. ఇంకా కొంత సొమ్ము మిగిలింది.. దానిని కూడా మంచి కార్యాలకు వినియోగించాలని, ఆ చెట్టు నాణేలు ఇచ్చిందన్న విషయం ఎవ్వరికీ చెప్పవద్దని గ్రామాధికారి, శివయ్య నిర్ణయించుకున్నారు.
రావి చెట్టుతో శివయ్య జరిగింది చెప్పాక 'నీలాంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం' అంది రావిచెట్టు కొద్దికాలం తర్వాత మరల చిగురించి, పచ్చగా కళకళలాడింది. చెట్టుపైన పక్షులు గూళ్ళు కట్టుకోసాగాయి. మళ్లీ జనమంతా చెట్టు కింద సేద తీరసాగారు.
యు. విజయశేఖర రెడ్డి
99597 36475