
వితంతువులు, వృద్ధులు, వికలాంగులు అందరినీ అర్హులుగా పరిగణలోకి తీసుకోవడం మెరుగైన మార్గం. స్థానిక పరిపాలన లేక గ్రామ పంచాయతీకి నిర్ణీత సమయానికి పరిశీలనా బాధ్యతను అప్పగించడంతో, అర్హత అనేది స్వయం ప్రకటనగా ఉండవచ్చు. కొంత మోసం కూడా జరగవచ్చు. కానీ కొన్ని ప్రత్యేకమైన కుటుంబాలు కొద్ది మొత్తంలో ఉండే పెన్షన్ కోసం ఇబ్బందులు పడే అవకాశం ఉండదు. కాబట్టి, పెన్షన్ పథకాల్లో నేడు మనం చూస్తున్న మూకుమ్మడి మినహాయింపు దోషాలను శాశ్వతం చేయడం కంటే చేరికల దోషాలను దిద్దుబాటు చేయడమే మేలైన విధానం.
భారతదేశంలో మనిషి ఆయుర్ధాయం స్వాతంత్య్రం సాధించిన నాటి నుండి రెట్టింపయ్యింది. అంటే, 1940వ దశకం చివరిలో ఆయుర్ధాయం 32 సంవత్సరాలుంటే నేటికది 70 సంవత్సరాలైంది. అనేక దేశాలు ఇంకా మెరుగయ్యాయి. ఇప్పటికీ ఇదొక చారిత్రక విజయమే. ఇదే కాలంలో సంతానోత్పత్తి రేటు (ఒక మహిళ ఆరుగురు పిల్లల్ని కనే స్థితి నుంచి కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే జన్మనిస్తున్నది) గణనీయంగా తగ్గడంతో పిల్లల్ని కని, సంరక్షించడం అనే బంధనాల నుండి మహిళలు విముక్తులయ్యారు. ఇది మంచి విషయమే. కాకపోతే ఇది 'జనాభా-వృద్ధాప్యం' అనే ఒక కొత్త సవాల్‌ను కూడా సృష్టిస్తున్నది.
2011లో భారతదేశ జనాభాలో 9 శాతంగా ఉన్న (60 సంవత్సరాలు పైబడిన) వద్ధులు వేగంగా పెరుగుతున్నారు. జాతీయ జనాభా కమిషన్ ప్రకారం, 2036 సంవత్సరం నాటికి వీరి సంఖ్య 18 శాతానికి పెరగవచ్చు. ఒకవేళ భారతదేశం, వృద్ధులకు సమీప భవిష్యత్తులో మంచి జీవన ప్రమాణాలు కల్పిస్తామనే హామీ ఇవ్వాలంటే దానికి సంబంధించిన ప్రణాళికలు, ఏర్పాట్లు నేటి నుంచే ప్రారంభించాలి.
పెన్షన్ల సహాయం
భారతదేశంలో వృద్ధుల మానసిక ఆరోగ్యంపై ఇటీవల జరిగిన కృషి వారి దురవస్థపై కొత్త అంశాలను వెలుగులోకి తెస్తుంది. అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (జే-పాల్) మరియు తమిళనాడు ప్రభుత్వ సహకారంతో జరిగిన సర్వే వృద్ధులలోని డిప్రెషన్ (కుంగుబాటు)ను తెలియజేస్తుంది. అరవయ్యేళ్ళకు పైబడిన 30 శాతం నుండి 50 శాతం (వయసు, జెండర్‌పై ఆధారపడి) మందిలో డిప్రెషన్ లక్షణాలు ఉన్నాయి. ఈ డిప్రెషన్ లక్షణాలు పురుషులలో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటూ వయసు పెరుగుతున్న కొద్దీ ఆ లక్షణాలు పెరుగుతాయి. అనేక కేసుల్లో కుంగుబాటును గుర్తించకుండా, వైద్యం చేయకుండా వదిలేస్తున్నారు.
డిప్రెషన్‌కు పేదరికం, అనారోగ్యంతో గట్టి సంబంధం వుంది. కానీ దానికి ఒంటరితనం కూడా ప్రధాన అంశమే. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులపై తమిళనాడులో జరిపిన శాంపిల్ సర్వేలో 74 శాతం మందికి డిప్రెషన్ (తీవ్రత లేని) లక్షణాలున్నాయని తేలింది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల్లో అత్యధికులు మహిళలే, ముఖ్యంగా వితంతువులే.
వృద్ధాప్యపు కష్టాలు పేదరికానికి సంబంధించినవి మాత్రమే కాదు. అనేక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి, కొన్ని సందర్భాల్లో ఒంటరితనం నుంచి బైటపడడానికి కూడా డబ్బు సహాయపడుతుంది. వృద్ధులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలంటే...ముందుగా వారిని పేదరికం నుంచి, దానితో వచ్చే కష్టనష్టాల నుండి రక్షించడమే మొదటి అడుగై ఉండాలి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్లు సామాజిక భద్రతా వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటున్నాయి.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఏపీ (నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం) కింద వృద్ధులు, వితంతు మహిళలు, వికలాంగులకు నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ల ముఖ్యమైన పథకాలు భారతదేశంలో ఉన్నాయి. కాలం చెల్లిన, నమ్మశక్యం కాని బీపీఎల్ (దారిద్య్ర రేఖకు దిగువన వున వారి) జాబితాలపై ఆధారపడి ఆ కుటుంబాలనే ఎన్‌ఎస్‌ఏపీ కి అర్హులుగా పరిమితం చేశారు. బీపీఎల్ జాబితాలు కొన్ని ఇరవై సంవత్సరాల క్రితానివి. ఎన్‌ఎస్‌ఏపీ కింద వృద్ధాప్య పెన్షన్ల నిమిత్తం 2006 నుండి కేంద్ర ప్రభుత్వ సహాయం నెలకు రెండు వందల రూపాయలు, వితంతువులకు నెలకు మూడు వందల రూపాయల దగ్గరే నిలిచిపోయింది.
అనేక రాష్ట్రాలు తమ స్వంత నిధులను, పథకాలను ఉపయోగించి (ఎన్‌ఎస్‌ఏపీ నిబంధనలను దాటి) సామాజిక భద్రతా పెన్షన్లను, వాటి పరిమితిని పెంచుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు వృద్ధాప్య-వితంతు పెన్షన్ల పరిమితిని 75 శాతం నుండి 80 శాతం వరకు (సమీప సార్వజనీనత) సాధించాయి కూడా. తమిళనాడును మినహాయిస్తే మిగిలిన అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడది ఒక నియమంగా ఉంది.
లక్ష్యాలను మించి...
సామాజిక ప్రయోజనాలకు కొద్దిమందినే లక్ష్యంగా చేసుకోవడం ఎప్పుడూ కష్టమే. వాటిని బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే పరిమితం చేయడం సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. బీపీఎల్ జాబితాల్లో భారీగా మినహాయింపు దోషాలున్నాయి. వృద్ధాప్య పెన్షన్ల విషయానికి వచ్చేసరికి, ''లక్ష్యం చేసుకోవడం'' అనేది మంచి ఆలోచన కాదు. లక్ష్యం చేసుకోవడమనేది వ్యక్తిగత సూచికల కంటే కూడా కుటుంబంపై ఆధారపడి ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఉన్నత కుటుంబాలకు చెందిన ఒక వితంతువు లేదా వృద్ధుడు సాపేక్షంగా కష్టాలు పడుతుండవచ్చు. జాగ్రత్తగా చూసుకునే/చూసుకోని బంధువులపై పూర్తిగా ఆధారపడకుండా ఉండేందుకు వారికి ఈ పెన్షన్ సహాయపడుతుంది. ఇది వారి పట్ల బంధువులు మరింత జాగ్రత్తగా ఉండటానికి దోహదం చేస్తుంది.
మరో విషయమేమంటే, లక్ష్యం చేయడం అనేది, బీపీఎల్ సర్టిఫికెట్లు, ఇతర ధ్రువ పత్రాలు సమర్పించడం లాంటి సంక్లిష్టమైన లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎన్‌ఎస్‌ఏపీ పెన్షన్ల విషయంలో ఇదొక కచ్చితమైన నియమం. పెన్షన్ల అవసరం బాగా ఉండి, కొద్దిపాటి చదువు, తక్కువ ఆదాయాలున్న వృద్ధులకు పెన్షన్లు రాకుండా ఈ లాంఛనాలు అడ్డుకుంటున్నాయి. తమిళనాడు శాంపుల్‌లో పెన్షన్ పథకాల నుంచి మినహాయించబడిన అర్హులు పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల కంటే చాలా పేదవారనే విషయం బయటపడింది. అంతేకాక, మినహాయించబడిన అర్హుల జాబితాలను స్థానిక సంస్థల పాలక వర్గానికి సమర్పించినప్పటికీ, చాలా కొది ్దమందికి మాత్రమే పెన్షన్ పొందడానికి ఆమోదం లభించింది.
సాధారణంగా ఇక్కడ సమస్య ప్రయత్న లోపం కాదు. లేదా ప్రభుత్వ అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడమూ కాదు. దానికంటే కూడా అనర్హుడైన ఏ ఒక్క వ్యక్తి కూడా పొరపాటున అర్హుడు కాకుండా చూడడం ద్వారా ప్రభుత్వ డబ్బును పొదుపు చేయడమే తమ బాధ్యత అనే ఆలోచనను చాలా మంది అధికారులు జీర్ణించుకున్నారు. ఉదాహరణకు దరఖాస్తుదారునికి ఒక నగరంలో సమర్థుడైన ఒక కొడుకు ఉంటే, తన కుమారుడి నుండి ఏదైనా సహాయం అందుతుందా లేదా అనే దానితో సంబంధం లేకుండానే అతడ్ని అనర్హుడ్ని చేస్తారు.
వితంతువులు, వృద్ధులు, వికలాంగులు అందరినీ అర్హులుగా పరిగణలోకి తీసుకోవడం మెరుగైన మార్గం. స్థానిక పరిపాలన లేక గ్రామ పంచాయతీకి నిర్ణీత సమయానికి పరిశీలనా బాధ్యత అప్పగించడంతో, అర్హత అనేది స్వయం ప్రకటనగా ఉండవచ్చు. కొంత మోసం కూడా జరగవచ్చు. కానీ కొన్ని ప్రత్యేకమైన కుటుంబాలు కొద్ది మొత్తంలో ఉండే పెన్షన్ కోసం ఇబ్బందులు పడే అవకాశం ఉండదు. కాబట్టి, పెన్షన్ పథకాల్లో నేడు మనం చూస్తున్న మూకుమ్మడి మినహాయింపు దోషాలను శాశ్వతం చేయడం కంటే చేరికల దోషాలను దిద్దుబాటు చేయడమే మేలైన విధానం.
ఈ ప్రతిపాదిత చర్య కొత్తదేమీ కాదు. ఇంతకు ముందు పేర్కొన్నట్లు, ఇది ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నది. కాకపోతే దీనికోసం భారీగా పెన్షన్ బడ్జెట్ల అవసరం ఉంటుంది కానీ అదనపు ఖర్చును సవరించడం తేలిక. భారతదేశ సామాజిక సహాయక పథకాలు చాలా తక్కువ బడ్జెట్లతో భారీ సంఖ్యలో ప్రజానీకానికి (ఎన్‌ఎస్‌ఏపీ కింద సుమారు 4 కోట్ల మందికి) ఊరట కలిగిస్తాయి. వాటిని విస్తరించడం ఉపయోగకరం కూడా.
సాపేక్షంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా బాగానే ఉన్నాయి. కానీ ఒడిశా, రాజస్థాన్ లాంటి కొన్ని పేద రాష్ట్రాల్లో కూడా సమీప సార్వజనీన సామాజిక భద్రతా పెన్షన్లు ఉన్నాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఏపీ లో మార్పులు చేస్తే, అన్ని రాష్ట్రాలు అలాంటి చర్యలు చేపట్టడం చాలా తేలికైన పని. ఈ సంవత్సరం ఎన్‌ఎస్‌ఏపీ బడ్జెట్ కేవలం రూ.9,652 కోట్లు, అంటే పది సంవత్సరాల క్రితం ఎంతుందో ఇప్పుడూ అంతే. వాస్తవంగా చెప్పాలంటే ఇంకా తక్కువే. ఇది జీడీపీ లో 0.05 శాతం కూడా కాదు.
వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితం కోసం సామాజిక భద్రతా పెన్షన్లు కేవలం ఒక మొదటి అడుగు మాత్రమే. వారికి ఆరోగ్య సంరక్షణ, అంగవైకల్య సహాయాలు, రోజువారీ పనుల్లో సహాయం, వినోద అవకాశాలు, మంచి సామాజిక జీవితం లాంటి సౌకర్యాల అవసరం కూడా ఉంటుంది. సమీప భవిష్యత్తులో పరిశోధన చెయ్యడానికి ఇదొక మంచి అంశంగా ఉంటుంది.
/ ఎస్త్తేర్ డఫ్లో నోబెల్ గ్రహీత, జీన్ డ్రెజ్ రాంచీ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ /
('ద హిందూ' సౌజన్యంతో)

