Feb 26,2023 07:57

నక్షత్రాల్లాంటి చిన్న పువ్వులు విభిన్న రంగులతో సుకుమార సుగంధాలతో విప్పారే పూల మొక్కలు. లాంటానా జాతికి చెందిన ఈ మొక్కల పుట్టుక అమెరికా. ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించి ఉన్నాయి. అక్షింతల పువ్వులు, నక్షత్రాల పువ్వులు, తలంబ్రాల పువ్వులు అని వేరువేరు ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా వీటిని పిలుస్తుంటారు. ఈ మొక్కలు పరిసరాల్లో ముఖ్యంగా రైల్వే ట్రాక్‌ పక్కన ఎక్కువగా ఉంటాయి. వీటి ఆకులు కాస్త దళసరిగా ఉంటాయి. కుండీల్లో, నేల మీద పెరిగే స్వభావం ఉన్న ఈ మొక్కలు పొద జాతివి. పువ్వులను చిదిమితే రేఖలు నక్షత్రాల్లా ఉంటాయి. వీటిలో వందల కొలది రకాల మొక్కలు ఉన్నాయి. ఏడాదిలో పది నెలలు ఈ మొక్కలు పుష్పిస్తూనే ఉంటాయి.

  • లాంటానా ఎల్లో..

మొక్క నిండుగా పువ్వులు పూసే సరికొత్త హైబ్రీడ్‌ రకం పూల మొక్క లాంటానా ఎల్లో. ఇది కూడా పరిమళభరితమే. సీతాకోకచిలుకలు నిత్యం ఈ పువ్వుల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. కొమ్మలు చాలా అల్పంగా ఉంటాయి. గట్టిగా తాకితే విరిగిపోతుంటాయి. వీటిని కూలింగ్‌ ప్రాంతాల్లో అలంకరణకు ఎక్కువగా ఉపయోగిస్తారు.

  • పింక్‌ లాంటానా..
1

మొక్కంతా పింకు రంగు పూలు విరబూస్తుంది. పూలు సుగంధ పరిమళాన్ని గుప్పిస్తాయి. తేజోవంతంగా వికసిస్తాయి.

  • లాంటానా రెడ్‌..
red

ముందు మొక్క కొమ్మకి గుత్తులుగా గింజల మాదిరిగా మొగ్గలు వస్తాయి. తరువాత క్రమంగా పువ్వులుగా విచ్చుకుంటాయి. విడిచిన పూలు తొలుత కాషాయ రంగులో ఉంటాయి. క్రమేపీ ముదురు ఎరుపు రంగులోకి మారతాయి. దీన్ని కుండీల్లో పెంచుకోవచ్చు.

  • దేశవాళీ రకం..
1

లే త గులాబీ, లేత గోధుమ, లేత పసుపు రంగుల కలబోతతో పూరేకలు పొదిగి ఉన్న లాంటానా పూల మొక్కలను దేశవాళీ తలంబ్రాల పూల మొక్కలని పిలుస్తారు. ఎర్రమట్టి నేలల్లో ఇవి ఎక్కువగా పెరుగుతుంటాయి. విత్తనాల ద్వారా ఈ మొక్కలు వద్ధి చెందుతాయి. ఈ ఆకులు కొద్దిగా విషతుల్యాలను కలిగి ఉంటాయి. అందుకే వీటిని జంతువులు ముట్టవు. వీటి పండ్లు, పువ్వుల్లో మకరందం విషతుల్యం కాదు.

  • బ్లూ లాంటానా..
blue

నాజూకైన పూల మొక్కల్లో బ్లూ లాంటానా ఒకటి. లేత నీలిరంగు పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. మొక్క మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. కుండీల్లోనూ నేల మీద కూడా పెంచుకోవచ్చు.

  • మల్టీకలర్‌ లాంటానా..

పసుపు, పింకు, ఎరుపు, లేతనీలం, తెలుపు ఇలా విభిన్న రంగుల కలబోతతో ఒక్కో పూలగుత్తి ఉంటుంది. క్రమేపీ పువ్వులు రంగులు కూడా మారుతూ ఉంటాయి. రంగురంగుల సోయగాలతో ఈ పూలమొక్క భలే కనువిందు చేస్తుంది. వర్షాకాలంలో క్రమేపీ పూల కాపు తగ్గి, మొక్క పెరగడం ప్రారంభిస్తుంది.

  • డబుల్‌ వైయిట్‌ లాంటానా..
1

తెల్లని పూలు మధ్యలో పసుపు చాయతో అచ్చంగా గుళ్ళలో ఉండే గన్నేరు పువ్వుల్లా ఉంటాయి. ఈ పువ్వులు కూడా గుత్తులు గుత్తులుగా, బంతులు మాదిరిగా పూస్తాయి. పువ్వులు సుగంధ పరిమళలాలను వెదజల్లుతుంటాయి. ఈ మొక్కలు కొబ్బరి పొట్టులో బాగా పెరుగుతాయి. ఇంటి ముంగిట ఉంచితే భలే అలంకరణగా ఉంటాయి.

  • మిల్కీ వైట్‌ లాంటానా..
1


తెల్లటి పాలమీగడ తెలుపులో మొక్కంతా గుత్తులుగా పువ్వులు పూసేది మిల్కీ వైట్‌ లాంటానా. పది నెలలు పువ్వులు పూసినా శీతాకాలం సీజన్లో మాత్రం పువ్వులు నిగారింపుగా, పెద్దవిగా మొక్క నిండుగా విచ్చుకుంటాయి. వీటిని అంట్లు కట్టడం ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. విత్తనాలు పెద్దగా రావు. కాస్త నీడ ప్రాంతాల్లో కూడా బాగానే పెరుగుతాయి. కుండీల్లో పెంచుకోవడం శ్రేయస్కరం.