Nov 08,2023 09:42
  • మిజోరంలో 77.04 శాతం పోలింగ్‌
  • ఛత్తీస్‌గఢ్‌లో పలు జిల్లాల్లో ఉద్రిక్తత

ఐజ్వాల్‌/రాయ్పుర్‌ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లలో భారీ పోలింగ్‌ జరిగింది. మిజోరంలోని మొత్తం 40 స్థానాలకు ఒకే విడతగాను, 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడతగా 20 స్థానాలకు మంగళవారం నిర్వహించిన పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మిజోరంలో సాయంత్రం 5 గంటల వరకు 77.04 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ సెర్చిప్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో 83.96 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో జరిగినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి లియాంజలా వెల్లడించారు. మొత్తం 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించగా.. 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో సాయంత్రం 5గంల వరకు 70.87 శాతం పోలింగ్‌ నమోదైంది. భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించినప్పటికీ కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సుక్మా జిల్లాలో నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు.. ఖైరాగఢ్‌-చుయుఖదాన్‌- గండయి జిల్లాలో అత్యధికంగా 76.31శాతం పోలింగ్‌ నమోదైంది. అలాగే, అంబాగఢ్‌ చౌకి జిల్లాలో76శాతంబీ బస్తర్‌ (జగ్దల్‌పుర్‌)లో 72.41శాతం, కబీర్‌ధామ్‌ జిల్లాలో 72శాతం, కొండగాన్‌లో 75.35శాతం చొప్పున పోలింగ్‌ నమోదైంది. ఛత్తీస్‌గఢ్లో తొలి విడతలో పోలింగ్‌ జరిగే 20 స్థానాల్లో 223 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 90 శాసనసభ స్థానాలు ఉండగా.. మిగతా 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్‌ జరగనుంది.