
అమరావతి : ఎపిలో 35 సర్పంచ్, 245 వార్డు సభ్యుల స్థానాలకు శనివారం పోలింగ్ కొనసాగుతోంది. అధికార పార్టీ వైసిపి, ప్రతిపక్ష పార్టీ టిడిపిల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.
- శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందుల సర్పంచ్ ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసుల సమక్షంలోనే వైసిపి నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ ... తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభ్యంతరం తెలిపేందుకు పోలీసుల వద్దకు వెళ్లారు. దీంతో వైసిపి నాయకులకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. అయితే పోలీసులు ఏకపక్ష ధరణితో వ్యవహరిస్తూ అధికార పార్టీకి మద్దతుగా నిలబడడం సరికాదని విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమయ్యాయి.
- చేన్నాపు నాయునిపాల్లిలో ఇప్పటికి 105 ఓట్లు పోలైనట్లు పోలింగ్ అధికారులు తెలిపారు. మహిళలు 58, మగవారు 47 ఓట్లు పోలయ్యాయి.
నార్పల (అనంతపురం) : నార్పలలో ఎనిమిదవ వార్డు ఉప ఎన్నిక శనివారం జరుగుతోంది. టిడిపి వర్సెస్ వైసిపి ల మధ్య ఉత్కంఠ భరితంగా పోలింగ్ సాగుతోంది. ఒక వార్డ్ పోలింగుకు డీఎస్పీ వెంకటశివారెడ్డి, సీఐ అస్సార్ భాష, రాప్తాడు, నార్పల ఎస్సైలు, మరో 50 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రస్తుతం పోలింగ్ జోరుగా సాగుతోంది. ఎనిమిదవ వార్డులో మధ్యాహ్నం ఒంటి గంటకి పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత రెండు గంటల నుంచి వార్డు కౌంటింగ్ నిర్వహిస్తారు.. తుది ఫలితాలు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు తెలుస్తాయి.
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీ ఎన్నికల్లో ఉద్రికత్త ఏర్పడింది. వైసిపి కార్యకర్తలు.. టిడిపి కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. వైసిపి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తమపై దాడులు చేయిస్తున్నారని తెలుగు దేశం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌ను గ్రామంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం వణుదుర్రు పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని టిడిపి నేతలు ఆరోపించారు. వైసిపి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కుమారుడు ఆధ్వర్యంలో రిగ్గింగ్ జరుగుతోందని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సర్పంచి ఉపఎన్నికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏడుగురు టిడిపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండపి ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసిపి ఇన్‌ఛార్జిని వదిలి తమను అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే స్వామి ఆరోపించారు.
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం బప్పడంలో వైసిపి, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలువురు టిడిపి కార్యకర్తలకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.



