Aug 02,2022 08:46

స్వేచ్ఛ అయినా, స్వాతంత్య్రమైనా ఊరకనే రావు. పోరాడితేనే వస్తాయి. ఒక్కోసారి ఒకటీ రెండు సార్లు కాదు; అనేక వందల సార్లు పోరాడాల్సి వస్తుంది. పోరాటంలో ఓటమినీ ఎదుర్కోవల్సి వస్తుంది. ఓటమి అంటే ఓడిపోవడం మాత్రమే కాదు; ఎలా గెలవాలో ఒక అనుభవాన్ని పాఠంగా నేర్చుకోవటం కూడా! భారత స్వాతంత్య్రోద్యమం ఇలాంటి అనేక పాఠాల, గుణపాఠాల సమ్మేళనం. అనేకనేక మంది వేదనల, ఆవేదనల, సాహసాల, పోరాటాల, త్యాగాల సమ్మిళిత సాగరం.

న దేశం ఎప్పుడూ ఏకఖండంగా లేదు. ఏలుబడి ఎవరిదైనా ప్రజల కష్టాలూ, నష్టాలూ షరా మామూలుగానే ఉన్నాయి. వర్తకం కోసం వచ్చి దేశంలో కాలిడిన బ్రిటీషు వాళ్లు దేశం మొత్తమ్మీద పెత్తనం సంపాదించటానికి ... మన దేశంలోని రాజులూ, వాళ్ల స్వార్థాలూ, వాళ్ల మధ్య ఉన్న కీచులాటలే కారణం. బ్రిటీషు వాళ్ల కానుకలు అందుకొని, సహకారం పొంది, ప్రారంభంలో ప్రతి రాజూ ఆనందంతో పొంగిపోయినవాడే! ఒక్కొక్క టిగా హక్కులు, అధికారాలూ కోల్పోయి, తాము కీలుబొమ్మలుగా మారుతున్న దశలో మాత్రమే వారు బ్రిటీషు వ్యతిరేకతను ప్రదర్శించారు.
     వాస్తవానికి రాజులూ, జమిందార్లు కన్నా ముందుగా వివిధ అణచివేత కారణాల చేత, భూమి పన్ను, పంటల జప్తు వంటి జీవన సంబంధ సమస్యల చేత, స్వేచ్ఛా స్వాంత్య్రాల హరణం చేతా ... సామాన్య ప్రజలే తొలుత విదేశీ పాలకులను వ్యతిరేకించారు. స్థానిక జమిందార్లను, పైనున్న బ్రిటీషు వాళ్లను కూడా నిరసించారు. మొట్టమొదటి భారత స్వాతంత్య్ర సమరంగానూ, సిపాయిల తిరుగుబాటుగానూ చెప్పుకునే 1857 నాటి సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. దానికి 50 ఏళ్ల ముందే 1800 - 1801 సంవత్సరాల్లో దక్షిణ భారతదేశంలో ప్రజలు బ్రిటీషు పాలకుల మీద తిరుగుబాటు ప్రకటించారు. దీనికి స్థానికంగా పాలన సాగిస్తున్న కట్ట బ్రహ్మన, మరుడ పాండ్యన్‌ వంటి వారు నాయకత్వం వహించారు.
     ఈ దక్షిణాది స్థానిక పాలకులు ప్రజలతో కలిసి మెలసి ఉండేవారు. కాబట్టే వివిధ రూపాల్లో వ్యక్తమవుతున్న బ్రిటీషు వ్యతిరేకతను పసికట్టి, ప్రజలను తిరుగుబాటులోకి సమీకరించగలిగారు. పన్నులు కట్టకుండా సహాయ నిరాకరణ చేశారు. బ్రిటీషు అధికారులపై దాడులు చేశారు. దీంతో, ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. వందలాదిమంది దేశభక్తులను బంధించి, ఉరి తీయించింది. వారి ఆస్తులను స్వాధీనం చేసుకొని కుటుంబాలను నిరాధారం చేసింది. అత్యంత క్రూరంగా, పాశవికంగా తిరుగబాటును అణచి వేసింది. పరాయి దేశం నుంచి వచ్చిన బ్రిటీషువాళ్ల చేత ఇంతటి దౌర్జన్యానికి బలయ్యే దౌర్భాగ్యం భారతీయులకు ఎందుకు పట్టింది? దీనికి సమాధానం 1801లో తిరుచ్చిలో మరుడ పాండ్యన్‌ చేసిన ప్రకటనలో ఉంది. ''ఇక్కడి రాజుల్లో ఐక్యత లేదు. స్నేహ సంబంధాలు లేవు. తమలో తాము కలహించుకున్నారు. దేశాన్ని యూరోపియన్లకు ధారాదత్తం చేశారు''ఇదీ, పాండ్యన్‌ ప్రకటన సారాంశం.
 

                                                                   అక్కడి పాలకులు కుమ్మక్కు !

1800 నాటికి దక్షిణ భారతదేశంలో కనిపించిన ఈ వ్యతిరేకత ఉత్తర భారతదేశంలో లేదు. అక్కడి స్థానిక పాలకులు బ్రిటీషు వారితో 'కలిసి' నడిచారు. ప్రజల్లో, రైతుల్లో అసంతృప్తి ఉన్నా ... దానిని ఒక దగ్గరకు చేర్చి, ప్రతిఘటనగా మార్చేవారు లేరు. అలాంటి తెలివిడిని ప్రదర్శించాల్సిన సంస్థానాధీశులు బ్రిటీషు వారికి ఆంతరంగికులుగా మారిపోయారు. అలా ప్రజల్లోని అంతృప్తి, నిరసనా బయటికి పెల్లుబకుండా లేవు. బెంగాల్‌, బీహార్‌, ఒడిశా, అస్సాంలలోని కొన్ని ప్రాంతాల్లో గిరిజన తెగల నుంచి తిరుగుబాట్లు జరిగాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా సాగాయి. వీటన్నిటినీ సమన్వయపరిచి, ఒక తీవ్ర శక్తిగా మార్చే ప్రయత్నం జరగలేదు. పైగా తమ స్వార్థ ప్రయోజనాల కోసం బ్రిటీషు ఆధిపత్యం నిరాటంకంగా సాగాలనే దళారీవర్గం అప్పుడప్పుడే బలపడడం మొదలైంది! ఈ ధోరణి సహజంగానే ప్రజల ప్రతిఘటనాకాంక్షను నీరసపరిచింది.
 

                                                                         సిపాయిల తిరుగుబాటు

నెమ్మది నెమ్మదిగా పట్టు సంపాదించుకున్న బ్రిటీషు యంత్రాంగం రాజుల, సంస్థానాధీశుల అధికారాలకు కత్తెర వేయడం మొదలుపెట్టింది. ''మీ రాజరికం నామమాత్రమే! రాజు అని మిమ్మల్ని సంబోధించటం కేవలం మర్యాద. ఇంకే అధికారాలూ మీకు లేవు'' మొగలాయి వారసులకు తేల్చి చెప్పేసింది! అదే సమయంలో ఝాన్సీరాణికి, నానా సాహెబ్‌ తదితరులకు బ్రిటీషు పాలకుల నిబంధనలు అడ్డంకిగా మారాయి.
     అధికారుల నిరంకుశ ధోరణులతో పాటు తమ నమ్మకాలను దెబ్బ తీసే నిబంధనలు భారతీయ సైనికుల్లో అసంతృప్తిని, ఆగ్రహాన్ని రాజేశాయి. ఆవు, పంది కొవ్వుతో తయారు చేసిన తుపాకీ తూటాల కొసలను నోటితో కొరకాల్సి రావడం, తిలకం ధరించొద్దని, గెడ్డాలు ఉంచుకోరాదని అధికారులు ఆదేశాలు ఇవ్వడం ... హిందూ, ముస్లిం, సిక్కు సైనికుల్లో తీవ్ర ఆవేదనను రగిల్చింది. 1857 మే 9వ తేదీన మీరట్‌లో అధికారులపై తిరగబడడంతో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. తిరుగుబాటు బలగాలు ఢిల్లీ వెళ్లి, మొగలాయి వారసుడు బహుదూర్‌ షాను తమ పోరాటానికి నాయకత్వం వహించాల్సిందిగా కోరాయి. అతడు అంగీకరించాడు. అయితే, పోరాటం సాగుతుండగానే తన భార్య ద్వారా బ్రిటీషు వారితో మంతనాలు సాగించాడు. తిరుగుబాటు విఫలం చెంది, తాను బందీగా దొరికినప్పుడు... తిరుగు బాటుదారులు తన పేరును ఉపయోగించుకున్నారు తప్ప- తాను తిరుగుబాటులో లేనని చెప్పుకున్నాడు. ఝాన్సీరాణి, నానా సాహెబ్‌ రంగంలో నిలిచి, పోరాడారు. ఈ తిరుగుబాటు అణచివేయబడి నప్పటికీ- అనేక పాఠాలను ముందుకు తెచ్చింది. ప్రజల్లోని అసంతృప్తిని, బ్రిటీషు వ్యతిరేకతనూ బలంగా చాటి చెప్పింది. ''ఇది కేవలం సిపాయిల తిరుగుబాటు కాదు; జాతీయ తిరుగుబాటు'' అన్నాడు బ్రిటీషు అధికారి డిస్రాయిల్‌. ''గంగానది నుంచి యమునా నది వరకూ గల ప్రాంతంలో హిందువుల్లో కానీ, ముస్లిముల్లో కానీ బ్రిటీషు వారికి వ్యతిరేకం కానివారు ఒక్కరూ లేరు'' అని నివేదిక రాశాడు జాన్‌ విలయం కేయీ.
తొలి స్వాతంత్య్ర సమరంలో సిపాయిలు ఓడిపోయి ఉండొచ్చు. కానీ, వారి పోరాటం భారత ప్రజల హృదయాల్లో బలమైన స్వరాజ్య కాంక్షను నాటింది.